=నాటుసారా కేంద్రాలపై దాడులు చేయండి
=ఎంఆర్‌పీకి విక్రయించకుంటే చర్యలు
=ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్
=5 జిల్లాల ఎక్సైజ్ అధికారులతో సమావేశం
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: నాటుసారా తయారీదారులకు నల్లబెల్లం విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని, నాటుసారా తయారీని నిరోధంచాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్ ఆదేశించారు. తిరుపతిలో బుధవారం కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో రాష్ట్ర కమిషనర్‌తో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ టి.ప్రసాద్ సమావేశమయ్యారు.
ఎస్వీయూ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ నాటుసారా తయారీ కోసం నల్ల బెల్లం సరఫరా చేసే వ్యాపారస్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయించడాన్ని పూర్తిగా నిరోధించాలన్నారు. పక్క రాష్ట్రాల మద్యం రాకుండా నిరోధించాలని, సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీలు క్షుణ్ణంగా చేయాలని ఆదేశించారు. ఎక్కైడైనా కల్తీ మద్యం దొరికితే సంబంధి స్టేషన్ సీఐ, ఆ జిల్లా ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు అధికారులు తనిఖీలు చేయాలని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఎంఆర్‌పీ ధరల సిండికేట్, కల్తీ మద్యంపై ఫిర్యాదులు అందాయంటూ ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్ చైతన్యమురళిపై మండిపడ్డారు. అలాగే వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఎక్సైజ్ సీఐ ఖాజాబీ పట్టణంలోని మద్యం వ్యాపారస్తులతో కుమ్మక్కై కల్తీ మద్యం విక్రయాలకు సహకరిస్తున్నారని ఫిర్యాదులు అందాయని ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు.
ఇప్పటికే ఈ వ్యవహారంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. ఈ సమావేశంలో డెప్యూటీ కమిషనర్లు చంద్రమౌళి(చిత్తూరు), జీవన్‌సింగ్(అనంతపురం), ప్రేమ్‌ప్రసాద్(కర్నూలు), నాగలక్ష్మి(కడప), చైతన్యమురళి(నెల్లూరు)తో పాటు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు.
నల్లబెల్లం వ్యాపారులపై కేసులు పెట్టండి
Published Thu, Dec 5 2013 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement