లీజు కోసం కదులుతున్న పావులు
పోటీ పడుతున్న మాజీ మంత్రి
15 నాటికి అధ్యయన కమిటీ రిపోర్ట్
ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులు
చిత్తూరు: చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని లీజు పేరుతో దక్కించుకునేందుకు ఎంపీ సీఎం రమేష్ పావులు కదుపుతున్నట్లు అధికార పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సైతం పోటీపడుతున్నట్లు సంకేతాలున్నాయి. మొత్తంగా ఇద్దరు నేతలు చిత్తూరు చక్కెర కర్మాగారం కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇరువురు నేతలు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల మద్దతు కోసం తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధ్యయన కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాతనే ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టాలా? లేక లీజుకు అప్పగించాలా ? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. ఎలాగైనా * 800 కోట్ల విలువైన ఫ్యాక్టరీని దక్కించుకొనేందుకు ఇటు ఎంపీ అటు మాజీ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
చారిత్రక చిత్తూరు షుగర్స్‌లో ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేశారు. ఈ కర్మాగారం పరిధిలో 16 నెలలుగా 400 మంది కార్మికులకు ప్రభుత్వం జీతాలు చెల్లించకపోగా మూడేళ్లుగా చెరుకు రైతులకు సైతం కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించాల్సి వుంది. బకాయిలు చెల్లించి చక్కెర కర్మాగారాన్ని నడిపిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తరువాత మంగళం పాడారు. ఫ్యాక్టరీని తన అనుచరుల పరం చేసేందుకు బాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి చాపకింద నీరులా పావులు కదుపుతోంది. ఇందులో భాగం గా చక్కెర కర్మాగాల నిర్వహణపై అధ్యయన కమిటీ అంటూ ఐదుగురు ప్రైవేటు వ్యక్తులతో కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కర్మాగారాలపై నిర్ణయం తీసుకుంటామంటూ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నాటికి అధ్యయన కమిటీ నివేదిక రానున్నట్లు సమాచారం.
2002లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు *18 కోట్లకు చక్కెర కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టారు. అప్పట్లో రైతులు, కార్మికులు కోర్టుకు వెళ్లి ఫ్యాక్టరీని దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అధికారం చేపట్టిన బాబు తన హయాంలోనే మరోసారి కర్మాగారాన్ని అమ్మకానికి పెడితే సొంతజిల్లా వాసుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లీజుకు అప్పగించడమే మేలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
చిత్తూరు కర్మాగారం పరిధిలో 84.5 ఎకరాల విలువైన స్థలం ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం మొత్తం స్థలాన్ని అమ్మితే * 800 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ స్క్రాప్ అమ్మితే రూ.10 కోట్లకు పైగా వస్తుంది. తొలుత లీజు పేరుపెట్టి ఆ తరువాత కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఫ్యాక్టరీని లీజుకు లేదా అమ్మకానికి పెట్టే పక్షంలో ఆందోళనలు ఉధృతం చేయడంతో పాటు మరో మారు కోర్టుకు వెళ్తామని కర్మాగారం కార్మికులు, శాంతియుత ఉద్యమనేత వెంకటాచలంనాయుడు హెచ్చరిస్తున్నారు.
చిత్తూరు షుగర్స్‌పై సీఎం రమేష్ కన్ను?
Published Mon, Apr 6 2015 2:08 AM | Last Updated on Fri, Aug 10 2018 5:04 PM
Advertisement
Advertisement