ఏరుదాటి తెప్ప తగలేస్తారా!
ఏరుదాటి తెప్ప తగలేస్తారా!
Published Wed, Dec 14 2016 11:50 PM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది
ఇందిరమ్మ ఇళ్లు రుణాలు వసూలుకు వెళ్లిన అధికారులపై లబ్ధిదారుల మండిపాటు
మునిసిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లను చుట్టుముట్టిన పేదలు
భీమవరం :
’ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇళ్ల రుణాలు రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం రుణాల మాఫీ బాధ్యత తమదేనని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో బ్యాంకోళ్లు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి రుణాలు కట్టాలంటున్నారు. లేదంటే ఇళ్లను స్వాధీనం చేసుకుని తాళాలు వేస్తామంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే జాడలేదు. ఏరు దాటాక తెప్ప తగలేస్తారా. మా బతుకుల్ని రోడ్డున పడేస్తారా’ అంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మండిపడ్డారు. ’మా ఇళ్లకు తాళాలు వేస్తే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటా’మని హెచ్చరించారు. భీమవరం పట్టణ పరిధిలోని తాడేరు రోడ్డులో వైఎస్సార్ కాలనీ (టౌన్‌షిప్) లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం నిమిత్తం తమ బ్యాంకులో తీసుకున్న రుణాలను చెల్లించని దృష్టా‍్య రెవెన్యూ రికవరీ చట్టం కింద వాటిని స్వాధీనం చేసుకుంటామని ఎస్‌బీఐ అధికారులు హెచ్చరించారు. పోలీసుల సాయంతో బ్యాంకు అధికారులు బుధవారం అక్కడకు వెళ్లగా.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. 200507 సంవత్సరాల మధ్య టౌన్‌షిప్‌లోని సుమారు 139 మంది ఒక్కొక్కరు రూ.74 వేల వ్యయంతో ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు› నిర్మించుకున్నారు. వారికి భీమవరం ఏడీబీ శాఖ ఒక్కొక్కరికి రూ.28 వేల చొప్పున రుణాలు ఇచ్చింది. వీరంతా నిరుపేదలు కావడంతో వాయిదాలు చెల్లించేందుకు అవస్థలు పడ్డారు. ఆ తరుణంలో 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరం వచ్చిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే ఇళ్ల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వాయిదాలు కట్టాలని ఎవరైనా వస్తే తనకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. రుణాలు మాఫీ చేయిస్తానని హామీ ఇచ్చారు. దీనిని నమ్మిన పేదలంతా అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తున్నా రుణాలు మాఫీ కాలేదు. ఇదిలావుంటే.. రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం రుణాలు వసూలు చేసుకోడానికి జిల్లా కలెక్టర్ అనుమతితో ఎస్‌బీఐ ఛీప్ మేనేజర్ ఐ.ఫణికొండలరావు, ఫీల్ట్ ఆఫీసర్ పీఎస్‌ఎన్ మూర్తి, తహసీల్దార్ చవాకుల ప్రసాద్ తదితరులు బుధవారం ఉదయం 9 గంటలకు టౌన్‌షిప్‌కు చేరుకున్నారు. రుణాలు చెల్లించకుంటే ఇళ్లకు తాళాలు వేస్తామని హెచ్చరించడంతో లబోదిబోమన్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు రుణాలు మాఫీచేస్తామంటూ హామీ ఇచ్చారని విన్నవించుకున్నారు. తమకు అటువంటి ఆదేశాలేమీ రాలేదని, అప్పు చెల్లించకుంటే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ హెచ్చరించడంతో వారిలో ఆందోళన ఎక్కువైంది.
బాధితులకు బాసటగా..
ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు టౌన్‌షిప్‌కు చేరుకుని బాధితులకు బాసటగా నిలిచారు. ఽరుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో అమాయక ప్రజలతో ఓట్లు వేయించుకుని అవసరం తీరిపోయాక పేదలను గాలికి వదిలేస్తారా అని ప్రశ్నించారు. బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ టీడీపీ హామీతో రుణాలు చెల్లించలేకపోయారని, ఈ పరిస్థితుల్లో పేదల ఇళ్లకు తాళాలు వేస్తామంటూ ఒత్తిడి చేయడం భావ్యం కాదన్నారు. రుణాలు మాఫీ చేయకుంటే బాధితుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మునిసిపల్ చైర్మన్‌ను నిలదీసిన లబ్ధిదారులు
కొంతసేపటికి మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు (చినబాబు), వార్డు కౌన్సిలర్ యర్రంశెట్టి చందు అక్కడకు చేరుకోవడంతో బాధితులంతా వారిని చుట్టుముట్టారు. ’ఎన్నికల్లో మీ నాయకుడు హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు ఇదేంటి’ అని నిలదీశారు. కంగుతిన్న మునిసిపల్ చైర్మన్ బ్యాంకు అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారులు రుణాలు ఇప్పటికిప్పుడు చెల్లించలేరని, వారికి కొంత గడువు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు స్వయంగా రుణాలు మాఫీ చేస్తానని చెబితే గడువు కోరడం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. మునిసిపల్ చైర్మన్ బ్యాంకు అధికారులకు నచ్చచెప్పి అక్కడ నుంచి తీసుకువెళ్లడతో పరిస్థితి చక్కబడింది.
ఎన్నికల హామీ ఏమైంది.....
ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు, అంజిబాబు టీడీపీకి ఓట్లువేస్తే ఇళ్ల రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మేమంతా ఓట్లు వేసి గెలిపించాక.. మూడేళ్లకు బ్యాంకోళ్లు వచ్చి రుణాలు చెల్లించాలంటున్నారు. హామీ ఇచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు. రోజు గడవమే కష్టంగా ఉన్న మేం బ్యాంకు రుణాలు ఎలా చెల్లించగలం.
నూకలక్ష్మి, లబ్ధిదారు
డబ్బున్న పెద్దలకే రుణాలు మాఫీ చేస్తారా
డబ్బున్న పెద్దలకు కోట్లకు కోట్ల రూపాయలు ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తోంది. మాలాంటి పేదలు గూడు కట్టుకుంటే కొద్దిమొత్తం రుణం మాఫీ చేయడానికి మీనవేషాలు లెక్కించడం దారుణం. ఇప్పుడు రుణాలు చెల్లించాలంటే ఆత్మహత్యలే శరణ్యం.
షకీరా, లబ్ధిదారు
పనుల్లేక ఇబ్బంది పడుతుంటే ఇదేంటి
పెద్ద నోట్లు రద్దు చేయడంతో నెల రోజులుగా చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పనులు దొరకడం లేదు, పేద ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్న తరుణంలో బ్యాంకు రుణాలు వసూలు చేస్తారా. పేదల కష్టాలు ప్రభుత్వాలకు పట్టవా. నాయకులు ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయాలి.
పార్వతి, లబ్ధిదారు
Advertisement
Advertisement