ఖమ్మం వైరారోడ్: ఇందిరమ్మ పథకం ఇళ్ల అవినీతి బాగోతంపై జిల్లాలో సీబీసీఐడీ అధికారులు చేపట్టిన దర్యాప్తు పూర్తయింది. నివేదికను విచారణ అధికారి సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్ సంబంధిత శాఖ ఐజీకి సమర్పించటంతో అవినీతికి పాల్పడిన వారి గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో మొత్తం రూ. 14 కోట్లు స్వాహా అయినట్లు గృహనిర్మాణ శాఖ విచారణలో తేలగా సీబీసీఐడీ బృందం నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది.
విచారణలో భారీగా అక్రమాలు జరిగినట్లు సీబీసీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. నివేదికను హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి పంపించినట్లు జిల్లాలో విచారణ చేపట్టిన అధికారి తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో విచారణ అధికారి డీఎస్పీ బాలుజాదవ్ తన బృందంతో క్షేత్ర స్థాయిలో రెండు నెలల పాటు విచారణ చేశారు.
గ్రామాల్లో కూడా విచారణ కొనసాగింది. పాలేరు నియోజకవర్గంలోని రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం, కూసుమంచి మండలం లోక్యాతండా, నేలకొండపల్లి మండలం కూనాయిగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పట్వారిగూడెం, ములకలపల్లి మండలం పూసుగూడెంలో విచారణ చేశారు.
గతంలో నిధులు స్వాహచేసి సస్పెండ్ అయ్యి మళ్లీ విధుల్లో చేరిన అధికారుల్లో గుబులు పుడుతోంది. మళ్లీ తమ మెడకు ఉచ్చు బిగుస్తుందేమోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
‘ఇందిరమ్మ’పై సీబీసీఐడీ విచారణ పూర్తి
Published Tue, Nov 11 2014 3:14 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement