ఇందిరమ్మ పథకం కింద పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి నిరీక్షణ తప్పడం లేదు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందిరమ్మ పథకం కింద పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి నిరీక్షణ తప్పడం లేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు మొత్తం 31,153 మంది పింఛన్ కోసం ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు పరిశీలనకే పరిమితమయ్యాయి. ఏ ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు 2013 జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు అదే సంవత్సరం నిర్వహించిన రచ్చబండ-2లో, ఆ తర్వాత కొత్తగా పింఛన్ల కోసం అర్హులైనవారు జిల్లాలో మొత్తం 61,366 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై కసరత్తు చేసిన అధికారులు 2013 నవంబర్‌లో 24,213 మందికి పింఛన్లు మంజూరు చేశారు. మిగిలిన 37,153 మందికి ఎదురు చూపులు తప్పడం లేదు.
లబ్ధిదారుల లెక్కలు ఇవీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ, రెగ్యులర్ పథకాల కింద జిల్లాలో పింఛన్‌దారుల సంఖ్య కనీసం 3.05 లక్షల మందికి పెంచాలని సంకల్పించారు. చేనేత కార్మికులు, వితంతువులు, వృద్ధులకు టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా రూ.75 చెల్లి స్తే, వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రూ.200కు పెంచారు. వికలాంగులకు అంతకు ముందు రూ.150 ఇవ్వగా, రూ.500కు పెంచారు.
అయితే, వైఎస్సార్ మరణాంతరం వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయి. అర్హులైనవారు రెవెన్యూ, రచ్చబండల సందర్భంగా దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) అధికారుల వద్ద ఉన్న గణాంకాల ప్రకారం 2,84,165 మంది వృద్ధాప్య, వితంతు, చేనేత, వికలాంగులకు ప్రతినెల రూ.3.16 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఐదేళ్లు గడిచినా జిల్లాలో పింఛన్ల సంఖ్య 2.85 లక్షలు దాటక పోవడంపై జిల్లాలోని వివిధ వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఒక వేళ రాజశేఖరరెడ్డి బతి కుంటే, ఆయన నిర్దేశించిన లక్ష్యం మేరకు 2009 ఆఖరులో 3.05 లక్షల మందికి పింఛన్‌లు అందేవేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.