
పింఛన్ ఎప్పుడో..
పింఛన్ పండుటాకులలో కొత్త ఆశలు రేపుతోంది. పాత సర్కారుకు సమర్పించిన దరఖాస్తులు 18 నెల లుగా బీరువాలో భద్రంగా ఉన్నాయి. టీఆర్‌ఎస్ ప్రభు త్వం వచ్చాక వాటికి మోక్షం లభిస్తుందేమోనని లబ్ధి దారులు ఎదురు చూస్తున్నారు. వృద్ధులకు, వితంతు వులకు నెలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ. 1,500లు పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ పథకాన్ని సత్వరమే అమలులోకి తీసుకురావాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందిరమ్మ పథకం కింద పింఛన్ కోసం దరఖాస్తు చేసుకు న్న వారికి ఏడాదిన్నరగా ఎదురు చూపులు తప్పడం లేదు. గత ప్ర భుత్వం నిర్వహించిన రచ్చబండలో వృద్ధాప్య, వికలాంగ, వితం తు, చేనేత, కల్లుగీత కార్మిక పింఛన్లకోసం 38,664 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు.. మంజూరు మాత్రం చేయలేదు. కొత్త ప్రభుత్వమైనా కరుణించాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు.
ప్రస్తుత పింఛన్ల లెక్కలివి
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందు పరిస్థితి దారుణంగా ఉండేది. టీడీపీ హయాంలో వృద్ధాప్య, వితంతు పింఛన్ రూ. 75 ఇచ్చేవారు. రాజశేఖరరెడ్డి దానిని రూ. 200 లకు, వికలాంగ పింఛన్‌ను రూ. 150 నుంచి రూ. 500లకు పెంచారు. లబ్ధిదారుల సంఖ్యనూ భారీగా పెంచారు. ప్రస్తుతం జిల్లాలో 2,76,118 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. 1,49,415 మంది వృద్ధాప్య, 74,661 మంది వితంతు, 29,509 మంది వికలాంగ, 20,646 మంది అభయహస్తం, 1,134 మంది చేనేత, 753 మంది కల్లుగీత కార్మిక పింఛన్ పొందుతున్నారు. వీరికి నెలనెలా రూ. 7,02,70,100 ఖర్చు చేస్తున్నారు. ఆయన మరణానంతరం పరిస్థితి మొదటికొచ్చింది. వేలాది పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్హులైన వారు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
సాంకేతిక లోపంతో..
పెండింగ్ దరఖాస్తుల పరిస్థితి ఇలా ఉంటే.. లబ్ధిదారులు సైతం బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. సాంకేతిక లోపాల కారణంగా పలువురికి సక్రమంగా పెన్షన్ అందడం లేదు. బయోమెట్రిక్ పద్ధతిలో లబ్ధిదారుల వేలి ముద్రలు సరిపోలక నిలిచిపోయిన పెన్షన్‌లెన్నో ఉన్నాయి. ప్రధానంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వృద్ధాప్య పింఛన్లలో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పింఛన్లను ప్రతినెల పదో తేదీలోగా పంపిణీ చేయాల్సి ఉండగా.. ఎన్నికల సందర్భంగా మార్చి, ఎప్రిల్, మే నెలల్లో 24-30 తేదీల మధ్య ఇచ్చారు. జూన్‌కు సంబంధించిన ఫించన్లను ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించడంతో పాటు సాంకేతిక లోపాలను సవరించి ప్రతినెల సకాలంలో పెన్షన్లు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.