‘ఇందిరమ్మ’ పథకంలో అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఇందిరమ్మ ఇళ్ల’ నిర్మాణంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బినామీలు, ప్రజాప్రతినిధుల మిలాఖత్‌తో ఈ పథకం పక్కదారి పట్టిందని భావించిన ప్రభుత్వం.. అక్రమాలను వెలికితీయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన విచారణ బాధ్యతను సీబీసీఐడీకి అప్పగించింది.
ఇందులో భాగంగా బుధవారం సీబీసీఐడీ అధికారులు జిల్లా హౌసింగ్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరును పరిశీలించే క్రమంలో భాగంగా జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన రికార్డులు, ఆన్‌లైన్ రిపోర్టులను వారు స్వాధీనం చేసుకున్నారు.
మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి సమాచారం సేకరించనున్నట్లు సమాచారం. ఇదిలావుండగా 2008-09 సంవత్సరంలో జిల్లాలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌పార్టీతో విచారణ చేయించింది. జిల్లావ్యాప్తంగా 20,707 గృహాలను పరిశీలించగా 2,350 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలింది. వీటిలో 133 ఇళ్లకు రెండుసార్లు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు.
అసలు నిర్మాణ పనులే చేపట్టకుండా 47మంది పేరిట బిల్లులు క్లియర్ చేసినట్లు పసిగట్టారు. ఎనిమిది పాత ఇళ్లకు మెరుగులు దిద్ది బిల్లులు స్వాహా చేసినట్లు తేల్చారు. మరో 313 మంది లబ్ధిదారులకు లెక్కకు మించి చెల్లింపులు చేశారు. 105 మంది లబ్ధిదారుల పేర్లు రెండుసార్లు నమోదుచేసి నిధులు కైంకర్యం చేశారు. మొత్తంగా సర్వేచేసిన వాటిలో 11 శాతం అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు రూ. 80.74లక్షలు పక్కదారి పట్టినట్లు నిగ్గుతేల్చారు.
ప్రతి ఇంటింటి లెక్క పరిశీలన..
‘ఇందిరమ్మ’ పథకంలో భాగంగా జిల్లాలో మూడు విడతలుగా 2.09లక్షల ఇళ్లను మంజూరు చేశారు. దశాలవారీగా మంజూరుచేసిన ఇళ్లలో పావువంతు నిర్మాణాలు మొదలుకాలేదు. అయితే పనులు చేపట్టిన, పూర్తిచేసిన వాటిల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీంతో విచారణ మొదలుపెట్టిన అధికారులు బుధవారం కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ తనిఖీ ప్రక్రియ మరింత పకడ్భందీగా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంబంధించిన రికార్డు పరిశీలించనున్నట్లు తెలిసింది. మొత్తంగా అక్రమాల లోగుట్టు పూర్తిస్థాయిలో తేల్చేందుకు సీబీసీఐడీ చర్యలు వేగిరం చేసింది. మరో రెండు రోజుల్లో జిల్లా హౌసింగ్ శాఖలో లోతైన పరిశీలన చేయనున్నట్లు సమాచారం.
‘ఇంటి’ దొంగల్ని పట్టేద్దాం!
Published Wed, Jul 30 2014 11:43 PM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement