binamis
-
బినామీల లెక్క తేలేనా?
సాక్షి, ములకలపల్లి : భూ నిర్వాసితుల్లో బినామీల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా అటవీ భూముల సాగులో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు రీ సర్వే నిర్వహిస్తున్నారు. గతంలోనే పలు సర్వేలు చేపట్టి.. అర్హుల జాబితాను సిద్ధం చేశారు. అయితే వారిలో కొందరికి పరిహారం కూడా అందింది. అయితే ఆర్ఓఎఫ్ఆర్, అటవీ భూములు, అన్యాక్రాంతమైన అటవీ భూముల నిర్వాసితుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు తెలిత్తిన నేపథ్యంలో ఇటీవల ‘రీ సర్వే’కు కలెక్టర్ ఆదేశించారు. దీంతో మూడు రోజులుగా అధికారులు రీ సర్వే చేస్తున్నారు. ములకలపల్లి మండల పరిధిలోని కమలాపురం, ఒడ్డురామవరంలో పంప్‌హౌస్‌లతోపాటు కాలువలను నిర్మిస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా వందలాది ఎకరాల భూముల్లో వీటని నిర్మించనున్నారు. హక్కుపత్రాలు కలిగిన భూములు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులకు ఎకరాకు రూ. 8 లక్షలు, పోడు సాగు చేస్తున్న గిరిజనుల భూములకు ఎకరాకు రూ.4లక్షలు పరిహారం చెల్లించనున్నారు. ములకలపల్లి పూర్తిస్థాయి ఏజెన్సీ మండలం కావడంతో భూ నిర్వాసితుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అటవీభూముల సాగు చేసిన వారిలో అనర్హుల పేర్లు నమోదు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో పోడు సేద్యం ప్రధాన జీవనాధారం.. కాగా.. గిరిజన, గిరిజనేతరులు కూడా అటవీ, ఆర్ఓఎఫ్ఆర్, పోడు భూములను సాగు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత నిబంధనల మేరకు గిరిజనులు మాత్రమే పోడు సాగుకు అవకాశం ఉంది. ఈ తరుణంలో ఏన్నో ఏళ్లుగా పోడునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరినేతరుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తమ నమ్మకస్తులైన గిరిజన, లంబాడీల పేర్లను భూ నిర్వాసితులకు రికార్డుల్లో నమోదు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమాలకు తెరలేపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అధికారం, ఆర్థికబలం ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా పనులు సాగాయని.. నిజమైన నిర్వాసితులు అన్యాయమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్వాసితుల ఖాతాలు ఫ్రీజ్ మండల పరిధిలోని రామచంద్రాపురం శివారులో హరితహారం మొక్కలు నాటిన భూములకు రూ.60లక్షల పరిహారం విడుదలైందని గ్రామస్తులు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అటవీశాఖ ఆధీనంలో ఉండి.. హరితహారం మొక్కలు పెరుగుతున్న భూములను గ్రామానికి చెందిన కొందరి పేరిట రికార్డుల్లో ఎక్కించి.. పరిహారం కాజేసేందుకు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఈ విషయమై మరికొందరు గ్రామస్తులు జనవరి 2వ తేదీన ఫీర్యాదు చేయడంలో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ వెంటనే విచారణ చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. విచారణ పూర్తయ్యేవరకు ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. అలాగే జిల్లా వ్యాప్తంగా మరికొన్ని ఉదంతాలు వెలుగులోకి రావడంతో రీసర్వేకు ఆదేశించారు. దీంతో మండలంలో మూడు రోజలుగా ‘రీసర్వే’ నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ అధికారులతో పాటు, రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ, ఆర్ఓఎఫ్ఆర్ శాఖల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి.. క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నారు. భూమిని ఎవరు సాగు చేస్తున్నారు? ఎన్నేళ్లు సాగులో ఉంది? తదితర వివరాలు సేకరించే సనిలో నిమగ్నమై ఉన్నారు. పెగ్ మార్కింగ్ ద్వారా రీసర్వే నిర్వహిస్తున్నారు. ‘రీసర్వే’లో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
నామినీ ముసుగులో బినామీలు...?
ప్రభుత్వం విసిరిన వలలో బినామీ డీలర్లు చిక్కుకున్నారు... రేషన్ సరుకుల పంపిణీకి డీలర్‌వేలిముద్రను మాత్రమే అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్‌తో బినామీల బండారం బట్టబయలవుతోంది.నెల ప్రారంభమై ఐదురోజులు గడుస్తున్నా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రేషన్ దుకాణాలు తెరుచుకోని పరిస్థితి. సరుకుల కోసం లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు డీలర్ కోసం బినామీ లు పరుగులు పెడుతున్నారు. పౌరసరఫరాలశాఖ మాత్రం సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నంచేస్తోంది. జిల్లాలో బినామీలు ఎవరూ లేరు..సాంకేతిక సమస్యతోనే దుకాణాలు తెరుచుకోలేదని పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తోందనేవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుత్తూరు: ప్రజా పంపిణీ వ్యవస్థలో బినామీల రాజ్యం కుప్పకూలుతోంది. నామినీల ముసుగులో ఇన్నాళ్లుగా దుకాణాలు నడుపుతున్న బినామీలకు కాలం చెల్లినట్లే. ఈ పాస్ విధానం అమలులోకి వచ్చాక సరుకుల పంపిణీలో డీలర్లకు వెసులుబాటు కోసం నామినీల వ్యవస్థను ప్రవేశపెట్టారు. కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఈపాస్ యంత్రంలో డీలర్‌తో పాటు నామినీల వేలిముద్రతో కూడా సరుకులు పంపిణీ చేసేఅవకాశం ఉండేది. బినామీల పరమైన దుకాణాలు... టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ అనుయాయులు రెచ్చిపోయారు. జిల్లా వ్యాప్తంగా అప్పటి వరకు డీలర్లుగా ఉన్న వారిని నయానో భయానో బెదిరించి దుకాణాలను తమ పరం చేసుకున్నారు. ఈ పాస్ విధానం అమలు, కిరోసిన్, చక్కెర పంపిణీని రేషన్ దుకాణాల్లో నిలిపివేశాక డీలర్లకు వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. దీంతో చాలామంది డీలర్లు వేరొకరిని తమ నామినీలుగా నమోదు చేయించి దుకాణాలను వారికి అప్పగించినట్లు సమాచారం. ఇలా దుకాణాలు నడుపుతున్న బినామీలు చేతివాటానికి తెరతీశారు. రేషన్ బియాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న సంఘటనల్లో బినామీ డీలర్లదే కీలకపాత్రగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇప్పటివరకు డీలర్లకు వెసులుబాటుగా ఉన్న నామినీ వ్యవస్థను ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం రద్దు చేసింది. తప్పనిసరిగా డీలర్ వేలిముద్ర వేస్తేనే సరుకులను పంపిణీ చేసే విధంగా పౌరసరఫరాల శాఖ సర్క్యులర్‌ను జారీ చేసింది. తెరుచుకోని దుకాణాలు... నెల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా జిల్లా వ్యాప్తంగా సుమారు 214 రేషన్ దుకాణాలు తెరుచుకోలేదు. డీలర్ వేలిముద్ర లేకుండా సరుకులు పంపిణీ చేయలేని పరిస్థితి ఉండడంతో దుకాణాలను మూసేసినట్లు సమాచారం. ఇదివరకే వేరే ఊర్లలో స్థిరపడిపోయిన అసలైన డీలర్లు వచ్చే వరకు సరుకుల పంపిణీ నిలిచిపోయినట్లే. దీంతో సరుకుల కోసం నిరుపేదలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క దుకాణం నెలకు రూ.600 వరకు పౌరసరఫరాల శాఖకు ముడుపుల రూపంలో చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారుల కనుసన్నల్లోనే బినామీల వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ దుకాణాల్లో బినామీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటిదేమీ లేదు... రేషన్ దుకాణాల్లో బినామీ డీలర్ల వ్యవహారం మా దృష్టికి రాలేదు. సాంకేతిక సమస్యల కారణంగానే జిల్లాలో కొన్ని దుకాణాలు తెరుచుకోలేదు. సమస్యను సరిదిద్ది, లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందిస్తాం. - చాముండేశ్వరి,జిల్లా పౌరసరఫరాల అధికారి, చిత్తూరు -
బినామీ డీలర్ల ప్రక్షాళనకు చర్యలు
దేవరపల్లి: బినామీ రేషన్ డీలర్ల వ్యవస్థపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో బినామీలకు చెక్ పెట్టడానికి చర్యలు చేపట్టింది. బినామీ డీలర్ల వల్ల ప్రజాపంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన అధికారులు ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈ–పోస్ యంత్రంలోని నామినీ పేర్ల్లను మే 1 నుంచి తొలగించారు. ఇప్పటివరకు డీలర్‌తో పాటు మరో ఇద్దరు పేర్లు నామినీగా చేర్చి వేలిముద్రలు ఇచ్చారు. మూడేళ్లుగా నామినీల వ్యవస్థ నడుస్తుంది. దీని కారణంగా ఒరిజినల్ డీలర్ వేరే ప్రాంతంలో ఉండి బినామీల పేరును నామినీగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించారు. దీంతో నామినీ వ్యవస్థను రద్దుచేసి ఒరిజినల్ డీలర్ల పేరు మాత్రమే యంత్రంలో ఉంచితే బినామీల సంఖ్య బయటపడుతుందని అధికారులు ఆలోచన చేశారు. ఈమేరకు మే 1 నుంచి ఈ–పోస్ యంత్రంలో డీలర్ పేరు మాత్రమే ఉంచి నామినీలను తొలగించారు. దీనిపై రేషన్ డీలర్లలో గందగోళ పరిస్థితి ఏర్పడింది. నామినీ పేరు లేకుండా దుకాణాలు నడపటం కష్టమని డీలర్లు అంటున్నారు. డీలర్లలో వృద్ధులు, అనారోగ్యవంతులు ఉన్నారని వీరు నామినీ లేకపోతే ఇబ్బంది పడతారని డీలర్ల సంఘ ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. డీలర్ రక్తసంబంధీకులను నామినీగా చేర్చాలని కోరుతున్నారు. నామినీ వ్యవస్థను పునరుద్ధరించకపోతే దుకాణాలు నిర్వహణ చేయలేమని, అవసరం అయితే దుకాణాలను స్వచ్ఛందంగా వదులుకుం టామని చెబుతున్నారు. జిల్లాలో సుమారు 2,163 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మారుమూల గ్రామాలు, కొండప్రాంతాల్లో ఈ పోస్ విధానం అమలు జరగడం లేదు. నామినీ తొలగింపుపై సీఎంను కలుస్తాం ఈ పోస్ యంత్రంలో నామినీ పేర్లు తొలగింపుపై ఈనెల 5న ముఖ్యమంత్రిని కలిసి సమస్యను వివరిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు టీఏవీవీఎల్ నరసింహమూర్తి తెలిపారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నామినీ పేరు తొలగింపు పట్ల డీలర్లు ఆందోళన చెందనవసం లేదన్నారు. ఇది బినామీ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య మాత్రమేనని అన్నారు. కుటుంబంలో రక్తసంబంధీకులకు నామినీ ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. దుకాణాలను బంద్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆయన డీలర్లకు సూచించారు. -
బినామీల బాగోతం
కలువాయి మండలం రాజుపాళెం చౌక దుకాణం ఓ మహిళ పేరుతో నిర్వహిస్తున్నారు. ఆమెకు వివాహమై సుమారు 7 సంవత్సరాలు గడిచింది. ఆమె నెల్లూరులో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. రాజుపాళెంలోని చౌకదుకాణాన్ని ఆమె తండ్రి నిర్వహిస్తున్నాడు. నెల్లూరు నగరంలోని మూలాపేట, వెంకటేశ్వరపురం, కావలి, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి తదితర మండలాల్లో ఇలా బినామీలు రేషన్‌షాపులు నిర్వహిస్తుండడం కారణంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. నెల్లూరు(పొగతోట): చౌకదుకాణాల్లో ఏళ్ల తరబడి బినామీల బాగోతం నడుస్తోంది. రేషన్‌షాపు డీలర్ పక్క జిల్లాలో ఉన్నా బినామీ డీలర్ మాత్రం చౌకదుకాణాలను సంవత్సరాల తరబడి నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ఈ–పాస్ విధానంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పేద ప్రజలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లాలో చాలా మంది డీలర్ల ఆధ్వర్యంలో మూడు నుంచి నాలుగు చౌకదుకాణాలు ఉన్నాయి. మూలాపేటకు చెందిన రెండు చౌకదుకాణాలకు సంబంధించిన డీలర్లు పక్క జిల్లాలో నివాసం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. రేషన్‌షాపును మరొకరికి అద్దెకు ఇచ్చి రెండు వైపులా సంపాదిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో 300లకు పైగా చౌకదుకాణాలు బినామీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనేక ప్రాంతాల్లో మహిళల పేర్లతో రేషన్ షాపులు ఉన్నాయి. వాటి నిర్వహణ మాత్రం బినామీలు చేస్తున్నారు. వివాహమై దూర ప్రాంతాలకు వెళ్లిన వారు షాపులు వదులుకోకుండా బినామీల ఆధ్వరంలో నిర్వహిస్తున్నారు. మరణించినా కొనసాగుతున్న వైనం పలువురు డీలర్లు మరణించినా ఆ షాపులు కొనసాగుతున్నాయి. మరణించిన వారిలో అతి తక్కువ మందికి మాత్రమే వారి కుటుంబ సభ్యులకు కేటాయించారు. అధిక శాతం రేషన్ షాపులు బినామీల చేతుల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని బినామీ డీలర్లు రేషన్ షాపునకు బోర్డులు కుడా ఏర్పాటు చేయకుండా వారి ఇళ్లలోనే నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో బినామీ డీలర్లు రూ.కోట్లు సంపాదించారు. జిల్లాలో 1896 చౌకదుకాణాలు ఉన్నాయి. 8.76 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యం చౌకదుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. చౌకదుకాణాల డీలర్లు ప్రతి నెలా డీడీ తీసి కార్యాలయంలో అందజేయాల్సిఉంది. డీడీలు చెల్లించిన చౌకదుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ సరఫరా చేస్తారు. గత నెలలో ఉన్న నిల్వలను పరిశీలించి రేషన్ సరఫరా చేస్తారు. ఈ–పాస్ విధానం ప్రవేశ పెట్టక ముందు డీలర్లు 100, 95 శాతం పంపిణీ చేసినట్లు రికార్డులు చూపించేవారు. 50 నుంచి 60 శాతం మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేసేవారు. మిగిలిన దానిని దొడ్డిదారిన పక్క రాష్ట్రాలకు తరలించే వారు. కొంతమంది డీలర్లు జిల్లాలో రైస్ మిల్లర్లకు విక్రయించేవారని సమాచారం. బియ్యం, చక్కర, కిరోసిన్ ద్వారా డీలర్లు లక్షల రూపాయలు వెనుకవేసుకునేవారు. అక్రమమార్గంలో సంపాదించిన దానిలో అసలు డీలర్లకు అద్దెతోపాటు 10 శాతం వాటా ఇచ్చేవారని తెలుస్తోంది. కొత్తదారులు వెదకి.. ఈ–పాస్ విధానం వచ్చిన తరువాత డీలర్ల చేతులు కొంతవరకు కట్టేశారు. డీలర్లు నూతన మార్గాలు అన్వేషించారు. బినామీలు నిర్వహించే రేషన్ షాపులకు బోగస్ ఏఏవై(అంత్యోదయ అన్న యోజన) కార్డులు సృష్టించారు. ప్రస్తుతం ఏఏవై కార్డుల ద్వారా బియ్యం స్వాహా చేస్తున్నారు. ఏఏవై కార్డుకు 35 కేజీలు బియ్యం పంపిణీ చేస్తారు. 100 బోగస్ ఏఏవై కార్డులు ఉన్న చౌకదుకాణం డీలర్ 3500 కిలోల బియ్యం(70 బస్తాలు) స్వాహా చేస్తున్నారు. 150 ఏఏవై కా>ర్డులు ఉన్న రేషన్ డీలర్లు 105 బస్తాల బియ్యం స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎలక్ట్రానికల్ నో యువర్ కస్టమర్(ఈకేవైసీ) కార్యక్రమం జరుగుతోంది. ఈకేవైసీ ద్వారా చౌకదుకాణాల డీలర్ల పూర్తి సమాచారం ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటి వరకు 17 మండలాల్లో మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభమైంది. మిగిలిన 29 మండలాల్లో ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరణించిన రేషన్ షాపుల డీలర్ల సమాచారం వచ్చే అవకాశం లేదు. ఇతర జిల్లాల్లో నివసించే వారు, వివాహం అయిన మహిళల షాపులకు సంబంధించిన సమాచారం పూర్తిగా ఆన్లైన్లో నమోదు అయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారణ చేపడితే బినామీల రేషన్ డీలర్ల బండారం బయటపడే అవకాశం ఉంది. డీలర్ల సమాచారం సేకరిస్తున్నాం చౌకదుకాణాల డీలర్లకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాం. ఈకేవైసీ ద్వారా డీలర్ల సమాచారం సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తాం. సమాచారం సేకరించే సమయంలో బినామీలు ఉంటే బయపడే అవకాశం ఉంది. అలాంటి షాపులకు సంబంధించిన వివరాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. అధికారుల అనుమతితో నోటిషికేషన్ ద్వారా షాపులను నూతన డీలర్లకు కేటాయిస్తాం. – శివప్రసాధ్, డీఎస్ఓ -
బినామీల పేర్లతో మోసం
రణస్థలం: రెవెన్యూ అధికారులతో టీడీపీ ఎంపీపీ గొర్లె విజయకుమార్ కుమ్మక్కై బినామీ పేర్లతో అణు పార్కు పరిధిలో ఉన్న భూములు రాయించుకున్నారని కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతవాసులు ఆరోపించారు. రైతులు మైలపల్లి జగ్గులు, పట్టయ్య, మైలపల్లి రాముడు మండల కేంద్రంలో విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ అణు విద్యుత్ కేంద్రం వల్ల నష్టపోయిన రైతులకు రెవెన్యూ అధికారులు పరిహారం అందించకుండా టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు, ఎంపీపీ బీనామీలకు అందించారని విమర్శించారు. ఎంపీపీ విజయకుమార్‌కు బంధువులైన కొయ్యాం, అదపాక తదితర గ్రామస్తుల పేర్లు అణు పరిహా రంలో జాబితాలో ఎందుకున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంపీపీ కోళ్లు ఫారం, పొలాల్లో పనిచేసిన మరువాడ గ్రామానికి చెందిన కొందరి పేర్లు అణు నష్టపరిహారం జాబితాలోకి ఎలా వచ్చి పరిహారం పొందారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మైలపల్లి సూరి, మైలపల్లి తవుడు, మంత్రి శ్రీను, మైలపల్లి సత్యం, దన్నాన అప్పలనాయుడు, కిల్లారి సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బినామీలకే ట్రాక్టర్లు..?
పెనుబల్లి : రైతుల సాగు ఖర్చు తగ్గించేందుకు, యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసి, ఆర్థిక చేయూత నందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో దారి తప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పెనుబల్లి మండలంలో 2016–2017కు యాంత్రీకరణ పథకం ద్వారా 33 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. మండల వ్యాప్తంగా 68 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా వాటిలో 54 మంది అర్హులుగా నిర్ధారించారు. 14 మంది ట్రాక్టర్లు ఉండి గతంలో వ్యవసాయ ట్రాక్టర్ సామగ్రి సబ్సిడీపై పొందడం వల్ల అనర్హులుగా తేల్చిన వ్యవసాయాధికారులు నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ట్రాక్టర్ పొందాలంటే నిబంధనల ప్రకారం 2.5 ఎకరాల పట్టా భూమి పాస్‌బుక్ గానీ, మీ సేవ పహాణీ గానీ కలిగి ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ అధికారులను గులాబీ నేతలు ఒత్తిళ్లకు గురిచేసి, భూమిలేని వారికి సైతం మాన్యువల్ పహాణీపై భూమి ఉన్నట్లు రాయించి..దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవంగా కాస్రా పహాణీ , 1970కు ముందు 1బీ రిజిస్టర్లో నమోదైన రైతులకే మాన్యువల్ పహాణీలు రెవెన్యూ అధికారులు సరిచూసి జారీ చేయాల్సి ఉంది. ఈ నిబంధనను తుంగలో తొక్కి రెవెన్యూ అ«ధికారులు ఇష్టానుసారం మాన్యువల్ పహాణీలు జారీ చేశారని రైతుల ప్రధాన ఆరోపణ. 54 మంది రైతులు వ్యవసాయాధికారుల సూచన మేరకు రెండు రోజుల్లోనే దరఖాస్తులు సమర్పించారు. గులాబీ నాయకులు సూచించిన వారి పేర్లను ముందుగా జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేయిస్తే..లొసుగులు బయట పడతాయని పలువురు రైతులు కోరుతున్నారు. -
పథకాలు అడిగితే బినామీలంటారా..
పాలకొండ రూరల్: జన్మభూమి గ్రామసభల్లో పథకాలు వర్తింపజేయాలని గట్టిగా అడిగిన వారిని బినామీలుగా మంత్రి కళావెంకటరావు వ్యాఖ్యానించడం తగదని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ గత నాలుగు జన్మభూమి సభల్లోనూ అర్జీలు చేసుకున్న వారే తాజా గ్రామసభలోనూ దరఖాస్తు చేసుకున్నారని, అయినా వారికి న్యాయం జరగడం లేదన్నారు. పక్షపాత ధోరణితో జన్మభూమి కమిటీలు అర్హులకుఅన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు పింఛన్ల కోసం దరఖాస్తులు అందిస్తే వారికి కొత్త పేర్లు పెట్టి అవమానించటం శోచనీయమన్నారు. ఆన్లైన్లో నమోదు ఉంటే వారు అర్హులనే విషయాన్ని మంత్రి గుర్తించాలన్నారు. పచ్చ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు కట్టపెట్టిన అధికార పార్టీని ప్రజలు అన్నిచోట్టా ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం తప్పదన్నారు. -
శశికళకు మరిన్ని కష్టాలు!
సాక్షి, చెన్నై: తమిళనాడులో మన్నార్గుడి మాఫియా కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కేందుకు వ్యూహరచనలు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. చిన్నమ్మ కుటుంబం, బినామీలను టార్గెట్ చేసి త్వరలో మరిన్న దాడులకు ఆస్కారం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. మున్ముందు చిన్నమ్మకు మరిన్ని షాక్‌లు తగిలే అవకాశాలు ఉన్నట్టు చర్చ సాగుతోంది. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేను గుప్పెట్లోకి తీసుకుని, సీఎంగా పగ్గాలు చేపట్టాలన్న కలలుకన్న చిన్నమ్మ శశికళ ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది. కోర్టు తీర్పుతో పరప్పన అగ్రహార చెరకు ఆమె పరిమితమై ఉన్నారు. అయితే, తన ప్రతినిధిగా అక్క వనితామణి కుమారుడు దినకరన్‌ను రంగంలోకి దించినా, రెండాకుల చిహ్నం ఆయన్ను చుట్టుముట్టింది. ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి యత్నించి కటకటాల పాలయ్యాడు. తాజాగా, సాగుతున్న ఈ పరిణామాల వెనుక ఢిల్లీలోని కేంద్ర పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, రాష్ట్ర బీజేపీ వర్గాలు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. కమలం కనుసన్నల్లోనే అన్నాడీఎంకే రాజకీయ పరిణామాలు సాగుతున్నట్టుగా ప్రతి పక్షాలన్నీ గళాన్ని వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే, రాజకీయ జీవితం నుంచి శశికళ, దినకరన్ కేసుల రూపంలో దూరమైనా, మన్నార్గుడి మాఫియా చాప కింద నీరులా వ్యూహాలకు పదును పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా ఢిల్లీ పెద్దలకు సమాచారం వెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. శశికళ కుటుంబ మాఫియాను అణచివేయడానికి అస్త్రాలను ప్రయోగించేందుకు ఢిల్లీ సిద్ధం అవుతోన్నట్టు సమాచారం. జయలలిత అధికారాల్ని అడ్డం పెట్టుకుని చాప కింద నీరులా ఆ మాఫియా కూడబెట్టిన ఆస్తుల్ని గురిపెట్టి దాడులకు పథకం సాగుతున్నట్టు తెలిసింది. బినామీలే టార్గెట్ శశికళ కుటుంబానికి చెందిన వారి గుప్పెట్లో అనేక సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్ ఉన్నట్టుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోనూ ఆస్తుల్ని గురిపెట్టినట్టుగా ప్రచారం సాగుతున్నది. ఈ ఆస్తుల వివరాలు, జయలలిత మరణం తదుపరి ఆమెకు చెందిన ఆస్తుల పర్యవేక్షణ ఎవ్వరి చేతిలో ఉన్నాయో, పత్రిక, టీవీ ఛానళ్లు, సిరుదావూర్ బంగ్లా, కొడనాడు ఎస్టేట్, మిడాస్ లిక్కర్, జోష్సినిమాస్ వంటి వాటిని వివరాల సేకరణ శరవేగంగా సాగుతున్నట్టు సమాచారం. చిన్నమ్మ బినామీలు ఎవ్వరెవ్వరో అన్న వివరాల చిట్టాను సిద్ధం చేసి, అందర్నీ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బ తీసే రీతిలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంటున్నది. ప్రస్తుతం అన్నాడీఎంకేకు దినకరన్‌ను దూరం చేసిన దృష్ట్యా, తదుపరి చిన్నమ్మ కుటుంబానికి చెందిన వివేక్, వెంకటేష్, శివకుమార్, అనురాధ, దివాకరన్ను టార్గెట్ చేసి ఐటీ దాడులకు అవకాశాలు ఉన్నట్టుగా తమిళ మీడియాల్లోనూ కథనాలు వెలువడుతుండడంతో, మున్ముందు తమిళనాట మరిన్ని హాట్ టాపిక్లతో కూడిన ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘ఇంటి’ దొంగల్ని పట్టేద్దాం!
‘ఇందిరమ్మ’ పథకంలో అక్రమాలపై సీబీసీఐడీ విచారణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఇందిరమ్మ ఇళ్ల’ నిర్మాణంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బినామీలు, ప్రజాప్రతినిధుల మిలాఖత్‌తో ఈ పథకం పక్కదారి పట్టిందని భావించిన ప్రభుత్వం.. అక్రమాలను వెలికితీయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన విచారణ బాధ్యతను సీబీసీఐడీకి అప్పగించింది. ఇందులో భాగంగా బుధవారం సీబీసీఐడీ అధికారులు జిల్లా హౌసింగ్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరును పరిశీలించే క్రమంలో భాగంగా జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన రికార్డులు, ఆన్లైన్ రిపోర్టులను వారు స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి సమాచారం సేకరించనున్నట్లు సమాచారం. ఇదిలావుండగా 2008-09 సంవత్సరంలో జిల్లాలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌పార్టీతో విచారణ చేయించింది. జిల్లావ్యాప్తంగా 20,707 గృహాలను పరిశీలించగా 2,350 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలింది. వీటిలో 133 ఇళ్లకు రెండుసార్లు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. అసలు నిర్మాణ పనులే చేపట్టకుండా 47మంది పేరిట బిల్లులు క్లియర్ చేసినట్లు పసిగట్టారు. ఎనిమిది పాత ఇళ్లకు మెరుగులు దిద్ది బిల్లులు స్వాహా చేసినట్లు తేల్చారు. మరో 313 మంది లబ్ధిదారులకు లెక్కకు మించి చెల్లింపులు చేశారు. 105 మంది లబ్ధిదారుల పేర్లు రెండుసార్లు నమోదుచేసి నిధులు కైంకర్యం చేశారు. మొత్తంగా సర్వేచేసిన వాటిలో 11 శాతం అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు రూ. 80.74లక్షలు పక్కదారి పట్టినట్లు నిగ్గుతేల్చారు. ప్రతి ఇంటింటి లెక్క పరిశీలన.. ‘ఇందిరమ్మ’ పథకంలో భాగంగా జిల్లాలో మూడు విడతలుగా 2.09లక్షల ఇళ్లను మంజూరు చేశారు. దశాలవారీగా మంజూరుచేసిన ఇళ్లలో పావువంతు నిర్మాణాలు మొదలుకాలేదు. అయితే పనులు చేపట్టిన, పూర్తిచేసిన వాటిల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీంతో విచారణ మొదలుపెట్టిన అధికారులు బుధవారం కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తనిఖీ ప్రక్రియ మరింత పకడ్భందీగా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంబంధించిన రికార్డు పరిశీలించనున్నట్లు తెలిసింది. మొత్తంగా అక్రమాల లోగుట్టు పూర్తిస్థాయిలో తేల్చేందుకు సీబీసీఐడీ చర్యలు వేగిరం చేసింది. మరో రెండు రోజుల్లో జిల్లా హౌసింగ్ శాఖలో లోతైన పరిశీలన చేయనున్నట్లు సమాచారం.