జనవరిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన గిరిజనులు
సాక్షి, ములకలపల్లి : భూ నిర్వాసితుల్లో బినామీల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా అటవీ భూముల సాగులో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు రీ సర్వే నిర్వహిస్తున్నారు. గతంలోనే పలు సర్వేలు చేపట్టి.. అర్హుల జాబితాను సిద్ధం చేశారు. అయితే వారిలో కొందరికి పరిహారం కూడా అందింది. అయితే ఆర్‌ఓఎఫ్‌ఆర్, అటవీ భూములు, అన్యాక్రాంతమైన అటవీ భూముల నిర్వాసితుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు తెలిత్తిన నేపథ్యంలో ఇటీవల ‘రీ సర్వే’కు కలెక్టర్ ఆదేశించారు. దీంతో మూడు రోజులుగా అధికారులు రీ సర్వే చేస్తున్నారు. ములకలపల్లి మండల పరిధిలోని కమలాపురం, ఒడ్డురామవరంలో పంప్‌హౌస్‌లతోపాటు కాలువలను నిర్మిస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా వందలాది ఎకరాల భూముల్లో వీటని నిర్మించనున్నారు. హక్కుపత్రాలు కలిగిన భూములు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కలిగిన రైతులకు ఎకరాకు రూ. 8 లక్షలు, పోడు సాగు చేస్తున్న గిరిజనుల భూములకు ఎకరాకు రూ.4లక్షలు పరిహారం చెల్లించనున్నారు.
ములకలపల్లి పూర్తిస్థాయి ఏజెన్సీ మండలం కావడంతో భూ నిర్వాసితుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అటవీభూముల సాగు చేసిన వారిలో అనర్హుల పేర్లు నమోదు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో పోడు సేద్యం ప్రధాన జీవనాధారం.. కాగా.. గిరిజన, గిరిజనేతరులు కూడా అటవీ, ఆర్‌ఓఎఫ్‌ఆర్, పోడు భూములను సాగు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత నిబంధనల మేరకు గిరిజనులు మాత్రమే పోడు సాగుకు అవకాశం ఉంది. ఈ తరుణంలో ఏన్నో ఏళ్లుగా పోడునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరినేతరుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తమ నమ్మకస్తులైన గిరిజన, లంబాడీల పేర్లను భూ నిర్వాసితులకు రికార్డుల్లో నమోదు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమాలకు తెరలేపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అధికారం, ఆర్థికబలం ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా పనులు సాగాయని.. నిజమైన నిర్వాసితులు అన్యాయమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిర్వాసితుల ఖాతాలు ఫ్రీజ్
మండల పరిధిలోని రామచంద్రాపురం శివారులో హరితహారం మొక్కలు నాటిన భూములకు రూ.60లక్షల పరిహారం విడుదలైందని గ్రామస్తులు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అటవీశాఖ ఆధీనంలో ఉండి.. హరితహారం మొక్కలు పెరుగుతున్న భూములను గ్రామానికి చెందిన కొందరి పేరిట రికార్డుల్లో ఎక్కించి.. పరిహారం కాజేసేందుకు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఈ విషయమై మరికొందరు గ్రామస్తులు జనవరి 2వ తేదీన ఫీర్యాదు చేయడంలో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ వెంటనే విచారణ చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. విచారణ పూర్తయ్యేవరకు ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. అలాగే జిల్లా వ్యాప్తంగా మరికొన్ని ఉదంతాలు వెలుగులోకి రావడంతో రీసర్వేకు ఆదేశించారు. దీంతో మండలంలో మూడు రోజలుగా ‘రీసర్వే’ నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ అధికారులతో పాటు, రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ, ఆర్‌ఓఎఫ్‌ఆర్ శాఖల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి.. క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నారు. భూమిని ఎవరు సాగు చేస్తున్నారు? ఎన్నేళ్లు సాగులో ఉంది? తదితర వివరాలు సేకరించే సనిలో నిమగ్నమై ఉన్నారు. పెగ్ మార్కింగ్ ద్వారా రీసర్వే నిర్వహిస్తున్నారు. ‘రీసర్వే’లో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment