resurvey
-
తుది దశకు డ్రోన్ సర్వే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో కీలకమైన డ్రోన్ సర్వే (డ్రోన్లతో భూముల కొలత) తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 97 శాతం సర్వే పూర్తయింది. మిగిలిన 3 శాతాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయడానికి సర్వే, సెటిల్మెంట్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని 17,595 గ్రామాలకు గాను, డ్రోన్ సర్వే సాధ్యం కాని 4,135 గ్రామాలను మినహాయిస్తే 13,460 గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 13,075 గ్రామాల్లో దాదాపు 1.75 కోట్ల ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఇంకా కేవలం 385 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కావాల్సి ఉంది. వీటిలో శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వే జరగాల్సి ఉంది. ఈ నెలాఖరుకు మొత్తం గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని సర్వే శాఖ అధికారులంటున్నారు. ఇది పూర్తయితే రీ సర్వేలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసినట్లవుతుంది. మొత్తం 1.80 కోట్ల ఎకరాలను కొలిచినట్లవుతుంది. ఇది ఒక రికార్డుగా అధికారులు చెబుతున్నారు. వేగంగా పూర్తి చేసేందుకు... వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏరియల్ సర్వే కోసం డ్రోన్లతోపాటు విమానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేట్ డ్రోన్ ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 వేలమంది సర్వేయర్లను నియమించడంతోపాటు సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేయర్లకు పైలెట్లుగా శిక్షణ ఇచ్చి సర్వే చేయిస్తోంది. దీంతో సర్వే అత్యంత వేగంగా పూర్తవుతోంది. -
భూముల రీ సర్వేకు జాతీయస్థాయి ప్రశంస
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న భూ సమ స్యలన్నింటినీ పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియకు జాతీయస్థాయిలో ప్ర శంసలు లభిస్తున్నాయని మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల రీ సర్వేను అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం జగనన్న భూహక్కు–భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు మాట్లాడుతూ ఇటీవలే కేంద్ర కార్యదర్శి, అడిషనల్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులతోపాటు 5 రాష్ట్రాల నుంచి సర్వే విభాగానికి సంబంధించిన కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించి, భూముల రీ సర్వే విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. మొదటి, రెండు దశల్లో మొత్తం 4 వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, భూ హక్కు పత్రాలను పంపిణీ చేసినట్లు అధికారులు మంత్రుల కమిటీకి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,072 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 9 వేల గ్రామాలకు డ్రోన్ ఇమేజ్‌లను పంపించినట్లు చెప్పారు. మూడో దశకు సంబంధించి ఇప్పటికే 360 గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. నాలుగు మున్సిపల్ ఏరియాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, హక్కు పత్రాలను అందించాలనే లక్ష్యం మేరకు పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. మూడో దశ సర్వేను వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మైనింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ కమిషనర్ సిద్దార్థ్ జైన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి పాల్గొన్నారు. -
గ్రామాల్లో మొదలైన ఆస్తుల రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ప్రభుత్వం మరో భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు అనుకూలంగా పరిపాలనను మండలం నుంచి గ్రామ స్థాయికి తీసుకువచ్చిన ప్రభుత్వం.. దాన్ని మరింత మెరుగుపరిచేలా రిజిస్ట్రేషన్ల సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. భూముల రీసర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. తమ గ్రామాల్లోని సచివాలయాలకు వెళితే అక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే అన్ని సేవలు పొందవచ్చు. సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశల్లోనూ పూర్తయి అక్కడ డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవల్ని ప్రారంభించాలని గతంలోనే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అందుకోసం మొదట ప్రయోగాత్మకంగా రీసర్వే పూర్తి చేసిన 51 గ్రామ సచివాలయాలను గత సంవత్సరం జనవరిలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించి అక్కడి పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా నియమించింది. ఆ తర్వాత 2022 నవంబర్‌లో 1,949 సచివాలయాలు, ఈ నెల 23న మరో 195 సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించింది. వీటిలో రీసర్వే పూర్తయిన 2 వేల గ్రామాలను 1,535 గ్రామ సచివాలయాలుగా మ్యాపింగ్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎం దిశా నిర్దేశం.. ఊపందుకున్న రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తి స్థాయిలో మొదలు కావాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఈ నెలాఖరు నాటికి ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. దీంతో ఈ 15 రోజుల్లోనే దాదాపు అన్ని సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు ఊపందుకున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించే సర్టిఫైడ్ కాపీ, ఈసీ సర్టిఫికెట్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ జారీ సహా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ను మొదలుపెట్టారు. ఇప్పటివరకు 4,300కిపైగా రిజిస్ట్రేషన్లను సచివాలయాల్లో చేశారు. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.7.67 కోట్ల ఆదాయం లభించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోని 44 గ్రామ సచివాలయాల్లో 766 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ 2 వేల గ్రామాలకు సంబంధించి సచివాలయాల ద్వారా 16 లక్షల ఈసీలు, 62 లక్షల సర్టిఫైడ్ కాపీలు జారీ చేశారు. ఈ సేవల్ని మరింత విస్తృతంగా సచివాలయాల నుంచి అందించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సేవల గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రజల ముంగిటకే రిజిస్ట్రేషన్ సేవలు ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకువెళ్లే విధానాన్ని రిజిస్ట్రేషన్ల శాఖలోనూ ప్రవేశపెట్టాం. రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ప్రజలు ఈ సర్వీసుల్ని వినియోగించుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఎవరి గ్రామాల్లో వారు ఈ సేవలను పొందవచ్చు. రిజిస్ట్రేషన్లు చేయడం కోసం ఆయా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. – వి రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. -
West Godavari: 5.50 లక్షల ఎకరాల భూమి రీ సర్వే
ఆకివీడు(ప.గో. జిల్లా): జగనన్న సంపూర్ణ భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో రీ సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. మండలంలోని చినమిల్లిపాడు శివారు కొత్త చెరువు ప్రాంతంలో గ్రౌండ్ కంట్రోల్ పాయింట్(సర్వే రాయి)ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపూర్ణ భూహక్కు రీ సర్వే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పారు. సరిహద్దు వివాదాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ముందుగా రీ సర్వే పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఆకివీడు, కాళ్ల మండలాల్లో డ్రోన్ సర్వేను వేగవంతం చేయాలన్నారు. ముందుగా ఆకివీడు మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల జిల్లా అధికారి కె.జాషువాను ఆదేశించారు. ఆకివీడు మండలంలో 15 గ్రామాల్లో 2,9971.29 ఎకరాల భూమి రీ సర్వే చేయాల్సి ఉందని, దానిలో ఇంతవరకూ మూడు గ్రామాల్లో 492.46 ఎకరాల భూమి రీ సర్వే చేయించామని కలెక్టర్ చెప్పారు. కాళ్ల మండలంలో 13 గ్రామాల్లో 3,6561.69 ఎకరాలు రీ సర్వే చేయాల్సి ఉండగా 2 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందన్నారు. గ్రామాల్లో సర్వే చేస్తున్న సమయానికి ముందుగా గ్రామస్తులందరికీ సర్వే గురించి తెలియజేయాలని కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు. పీహెచ్సీ వైద్యులపై ఆగ్రహం మండలంలోని పెదకాపవరం గ్రామంలో పీహెచ్‌సీని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ సెలవులో ఉండటం, ఇన్చార్జి డాక్టర్ విధులకు రాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు డాక్టర్లు సెలవులో ఉంటే ఓపీ ఎవరు చూస్తారని ప్రశ్నించారు. ప్రతీ రోజూ రోగులు ఎంత మంది వస్తున్నారు, డెలివరీ కేసులు ఎన్ని వస్తున్నాయి, వాటిలో ఫ్రీ డెలివరీ కేసులెన్ని అని సిబ్బందిని ప్రశ్నించారు. ఫ్యామిలీ డాక్టర్ సేవల్ని గ్రామాల్లో విస్తరింపజేయాలని కలెక్టర్ హెచ్చరించారు. తొలుత గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు–నేడు పనుల్ని పరిశీలించారు. ఫేస్–2లో పాఠశాలలో జరగుతున్న పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. స్కూల్లోని ల్యాబ్‌ను పరిశీలించి, ఇటీవల పంపిణీ చేసిన ట్యాబ్‌లను ఏవిధంగా ఉపయోగిస్తున్నారని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కఠారి జయలక్ష్మీ, సర్పంచ్‌లు ఊసల బేబీ స్నేతు, ఎన్.రామరాజు, డీఈఓ వెంకటరమణ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీకర్, ఎంఈఓ రవీంద్ర, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రీసర్వేతో అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్
రామభద్రపురం: రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే పకడ్బందీగా చేయడంతో విజయవంతమైందని కమిషనర్ ఆఫ్ సర్వే అస్టిస్టెంట్ డైరెక్టర్ బీఎల్ కుమార్ అన్నారు. రామభద్రపురం మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద గుర్తించి సర్వే పూర్తి చేసిన మర్రివలసతో పాటు ప్రస్తుతం మిగిలిన గ్రామాలలో రీసర్వే జరుగుతున్న తీరును శుక్రవారం ఆయన పరిశీలించారు. రీసర్వే పూర్తయిన మర్రివలసలో సర్వే అధికారులు సర్వే రాళ్లు ఎలా పాతారో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. 2023 నాటికి రీ సర్వే పూర్తి చేసి ఎలాంటి చిక్కులు లేకుండా భూములను రైతులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన సర్వే ప్రకారం భూములు అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం వంటి వాటికి చెక్‌పడుతుందన్నారు. రీ సర్వేలో సర్వే అధికారులకు రైతులు సహకరించాలని సూచించారు. రామభద్రపురం మండలం సర్వే అధికారులు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని మండల సర్వేయర్ శ్రీనివాసరావు, గ్రామ సర్వేయర్లను అభినందించారు. అనంతరం రీసర్వే ఎలా జరిగింది? భూముల లెక్క తేలిందా? సర్వే అధికారులు పారదర్శకంగా సర్వే చేశారా? అని రైతు సూరెడ్డి చిన్నంనాయుడును అడిగి తెలుసుకున్నారు. దీనికి రైతు మాట్లాడుతూ గతంలో భూములు పాస్‌పుస్తకంలో నమోదు చేసుకునేందుకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారమని, ప్రభుత్వం రీ సర్వే చేపట్టి భూములు ఎవరి వారికి నమోదయ్యేలా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయ పరిశీలకులు బీబీవీవీ రాజు, బొబ్బిలి డివిజన్ సర్వేయర్ రవి శంకర్ పాల్గొన్నారు. -
AP: వెయ్యి గ్రామాల్లో పూర్తయిన రీసర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే వెయ్యికిపైగా గ్రామాల్లో పూర్తయింది. మిగిలిన గ్రామాల్లోనూ త్వరితగతిన సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే విజయవంతం కావడంతో మరో 1,034 గ్రామాలను రీసర్వే కోసం ఎంపిక చేశారు. వీటిలో మొదటి విడత 650 గ్రామాలు, రెండో విడత 384 గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. 513 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే ముగింపునకు సంబంధించిన నంబర్–13 నోటిఫికేషన్లు కూడా ఈ గ్రామాల్లో జారీ చేశారు. మిగిలిన 598 గ్రామాల్లో ఈ నెలాఖరుకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 108 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. త్వరలో మరో 118 గ్రామాల్లో నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. అల్లూరి సీతారామరాజు, గుంటూరు, విశాఖ, కోనసీమ జిల్లాల్లో తక్కువ గ్రామాల్లో సర్వే పూర్తయింది. మలి దశలో ఈ జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటివరకు 1,854 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. అందులో 1,142 గ్రామాల డ్రోన్ చిత్రాలు (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ –ఓఆర్ఐ)లు రెవెన్యూ బృందాలకు చేరాయి. మిగిలినవి కూడా అందగానే ఆ గ్రామాల్లో సర్వేను ముమ్మరం చేస్తామని సర్వే సెటిల్మెంట్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. రీసర్వే అనుకున్న దానికంటె వేగంగా జరుగుతోందని చెప్పారు. 3 నెలల్లోనే 1034 గ్రామాల్లో సర్వేను తుది దశకు తీసుకొచ్చినట్లు తెలిపారు. గ్రామాల్లో భూయజమానుల నుంచి వస్తున్న అభ్యంతరాలను సాధ్యమైనంత వరకు సర్వే బృందాలే పరిష్కరిస్తున్నాయి. చాలా తక్కువ సంఖ్యలోనే అభ్యంతరాలు తహశీల్దార్ వరకు వెళుతున్నాయి. 9,278 అభ్యంతరాలు రాగా 8,933 అభ్యంతరాలను సర్వే బృందాలు పరిష్కరించాయి. -
పైసా భారం లేకుండా.. భూముల రీసర్వే
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకమైన భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు పక్కాగా నిర్దిష్ట సమయంలో పూర్తిచేసేందుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మంజూరైన నిధులతో టెండర్ల ద్వారా నెట్వర్క్ రోవర్స్ కొనుగోలుకు రెవెన్యూశాఖ ప్రభుత్వ అనుమతి కోరింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేయగా సవరించిన అంచనా ప్రకారం రూ.334 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన పంపింది. ఆర్థికశాఖ అనుమతి రాగానే రీసర్వేకి అవసరమైన సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు. వీరికి ఇప్పటికే మంజూరు చేసిన రూ.200 కోట్ల నుంచే వేతనాలు చెల్లిస్తారు. వచ్చే జనవరి ఒకటో తేదీన మొదటి దశ కింద రాష్ట్రవ్యాప్తంగా 5,000 గ్రామాల్లో రీసర్వే పనులకు శ్రీకారం చుట్టాలని రెవెన్యూశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇక రెండోదశలో 6,500, మూడోదశలో 5,500 కలిపి మొత్తం 17,000 గ్రామాల్లోని 1.63 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని రీసర్వే చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: కీలక రోడ్డు నిర్మాణాలు చేపట్టిన మేఘా) ప్రతి గ్రామానికి సర్వే బృందం రీసర్వే కోసం రెవెన్యూశాఖ 4,500 బృందాలను ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామానికి ఒక బృందం ఉండేలా తర్వాత వీటిసంఖ్య పెంచుతారు. ఒక్కో బృందంలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు (వీఆర్వోలు), ఒక గ్రామ రెవెన్యూ సహాయకుడు ఉంటారు. భూమి రిజిస్టర్ స్క్రూటినీ ప్రక్రియను ఇద్దరు వీఆర్వోలు చూసేలా రెవెన్యూశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వీఆర్వోలు పరిశీలించి ఒకే చేసిన ల్యాండ్ రిజిస్టర్‌ను తహసీల్దారు ఆమోదిస్తారు. రీసర్వే పనుల కోసం సర్వేయర్లందరికీ దశలవారీగా శిక్షణ కొనసాగుతోంది. రీసర్వేకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. దేశంలో తొలిసారిగా దేశంలో మొదటిసారిగా కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (సీవోఆర్‌ఎస్) ద్వారా రీసర్వే చేస్తారు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) ప్రామాణికంగా అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం ఈ సర్వే జరుగుతుంది. డ్రోన్ల ద్వారా ఫొటోలు తీయించి డౌండ్ మ్యాపుల్లో వాటిని ఉంచుతారు. రీసర్వేకి ముందస్తు కసరత్తులో భాగంగా ఇప్పటికే గ్రామాల వారీగా రెవెన్యూ రికార్డుల అప్డేట్ (స్వచ్ఛీకరణ)కు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలపై నయాపైసా భారం లేకుండా.. రీసర్వేకి అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రజల నుంచి నయాపైసా కూడా వసూలు చేయరాదని ఆదేశించారు. నంబరు రాళ్ల ఖర్చును సైతం ప్రభుత్వమే భరించాలని ఆయన రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం రైతులు తమ భూములను కొలత వేయించుకోవాలంటే ముందే డబ్బు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో రీసర్వే పూర్తిగా ప్రభుత్వ డబ్బుతోనే చేయాలని నిర్ణయించడంపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయానికి ఒకరు ఉండేలా 11 వేల మందికిపైగా సర్వేయర్లను ప్రభుత్వం నియమించడం గమనార్హం. భవిష్యత్తులోనూ వీరు కొనసాగుతారు. గ్రామాల్లో ఎవరికి ఎప్పడు అవసరం వచ్చినా దరఖాస్తు చేసిన వెంటనే వారు భూమి కొలతలు వేసేలా ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి మండలంలో మొబైల్ కోర్టులు రాష్ట్రంలోని భూములను సర్వే చేయడం ద్వారా భూ వివాదాలు పరిష్కరించాలని, భవిష్యత్తులోనూ సమస్యలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యాలుగా పెట్టుకున్నారు. ఇందుకోసమే భారీఖర్చుకు కూడా వెనుకాడకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు చేపట్టాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నందునే దీనిపై ఎక్కువసార్లు సమగ్రంగా సమీక్షించారు. రీసర్వే సందర్భంగా వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రతి మండలంలో మొబైల్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొలతల్లో ఏమాత్రం తేడా లేకుండా చూడాలనే ఉద్దేశంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 11,000 మందికిపైగా సర్వేయర్లను నియమించడం ద్వారా రికార్డు సృష్టించారు. భూ వివాదాల పరిష్కారం ద్వారా రైతుల ఆశలు, సీఎం కల నెరవేర్చేదిశగా రెవెన్యూశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. - వి.ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి -
బినామీల లెక్క తేలేనా?
సాక్షి, ములకలపల్లి : భూ నిర్వాసితుల్లో బినామీల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా అటవీ భూముల సాగులో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు రీ సర్వే నిర్వహిస్తున్నారు. గతంలోనే పలు సర్వేలు చేపట్టి.. అర్హుల జాబితాను సిద్ధం చేశారు. అయితే వారిలో కొందరికి పరిహారం కూడా అందింది. అయితే ఆర్ఓఎఫ్ఆర్, అటవీ భూములు, అన్యాక్రాంతమైన అటవీ భూముల నిర్వాసితుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు తెలిత్తిన నేపథ్యంలో ఇటీవల ‘రీ సర్వే’కు కలెక్టర్ ఆదేశించారు. దీంతో మూడు రోజులుగా అధికారులు రీ సర్వే చేస్తున్నారు. ములకలపల్లి మండల పరిధిలోని కమలాపురం, ఒడ్డురామవరంలో పంప్‌హౌస్‌లతోపాటు కాలువలను నిర్మిస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా వందలాది ఎకరాల భూముల్లో వీటని నిర్మించనున్నారు. హక్కుపత్రాలు కలిగిన భూములు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులకు ఎకరాకు రూ. 8 లక్షలు, పోడు సాగు చేస్తున్న గిరిజనుల భూములకు ఎకరాకు రూ.4లక్షలు పరిహారం చెల్లించనున్నారు. ములకలపల్లి పూర్తిస్థాయి ఏజెన్సీ మండలం కావడంతో భూ నిర్వాసితుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అటవీభూముల సాగు చేసిన వారిలో అనర్హుల పేర్లు నమోదు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో పోడు సేద్యం ప్రధాన జీవనాధారం.. కాగా.. గిరిజన, గిరిజనేతరులు కూడా అటవీ, ఆర్ఓఎఫ్ఆర్, పోడు భూములను సాగు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత నిబంధనల మేరకు గిరిజనులు మాత్రమే పోడు సాగుకు అవకాశం ఉంది. ఈ తరుణంలో ఏన్నో ఏళ్లుగా పోడునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరినేతరుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తమ నమ్మకస్తులైన గిరిజన, లంబాడీల పేర్లను భూ నిర్వాసితులకు రికార్డుల్లో నమోదు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమాలకు తెరలేపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అధికారం, ఆర్థికబలం ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా పనులు సాగాయని.. నిజమైన నిర్వాసితులు అన్యాయమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్వాసితుల ఖాతాలు ఫ్రీజ్ మండల పరిధిలోని రామచంద్రాపురం శివారులో హరితహారం మొక్కలు నాటిన భూములకు రూ.60లక్షల పరిహారం విడుదలైందని గ్రామస్తులు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అటవీశాఖ ఆధీనంలో ఉండి.. హరితహారం మొక్కలు పెరుగుతున్న భూములను గ్రామానికి చెందిన కొందరి పేరిట రికార్డుల్లో ఎక్కించి.. పరిహారం కాజేసేందుకు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఈ విషయమై మరికొందరు గ్రామస్తులు జనవరి 2వ తేదీన ఫీర్యాదు చేయడంలో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ వెంటనే విచారణ చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. విచారణ పూర్తయ్యేవరకు ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. అలాగే జిల్లా వ్యాప్తంగా మరికొన్ని ఉదంతాలు వెలుగులోకి రావడంతో రీసర్వేకు ఆదేశించారు. దీంతో మండలంలో మూడు రోజలుగా ‘రీసర్వే’ నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ అధికారులతో పాటు, రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ, ఆర్ఓఎఫ్ఆర్ శాఖల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి.. క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నారు. భూమిని ఎవరు సాగు చేస్తున్నారు? ఎన్నేళ్లు సాగులో ఉంది? తదితర వివరాలు సేకరించే సనిలో నిమగ్నమై ఉన్నారు. పెగ్ మార్కింగ్ ద్వారా రీసర్వే నిర్వహిస్తున్నారు. ‘రీసర్వే’లో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
చేసిన పనే మళ్లీ మళ్లీనా!
తూర్పుగోదావరి, కొత్తపేట: గ్రామాల్లో వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన, పురోగతిపై రెండు రోజుల్లో సర్వే జరిపి నివేదించాలని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులను ప్రభుత్వం గ్రామాల్లోకి పంపింది. గ్రామదర్శినిలో గ్రామీణాభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆ మేరకు 51 అంశాలకు సంబంధించి 2018 మార్చి 31 నాటికి ప్రగతి, పూర్తి చేయడానికి మిగిలిన లక్ష్యం, 2018–19 లక్ష్యం, 2019–24 లక్ష్యం అంటూ నాలుగు కాలమ్స్, రెండు పేజీల్లో పేర్కొన్నారు. విద్యాశాఖకు సంబంధించి మరుగుదొడ్లు కలిగిన పాఠశాలల సంఖ్య తదితర 5 అంశాలు, పంచాయతీరాజ్‌కు సంబంధించి బీటీ రోడ్ల సదుపాయం కలిగి ఉన్న ఆవాసాలు, తాగు నీరు, అంగన్వాడీ, పీహెచ్సీ, మీ–సేవ, శిశు, మాతృ మరణాల సంఖ్య, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సంఖ్య తదితర 51 అంశాలను పేర్కొన్నారు. వీటిపై ఇప్పటికే గ్రామ దర్శిని ద్వారా కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు సర్వే చేసి నివేదికను మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ద్వారా జిల్లా అధికారులకు నివేదించారు. ఆ నివేదిక సక్రమమా? కాదా? అనే దానిపై రీ సర్వే చేసి నివేదించాలని కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులను రంగంలోకి దింపారు. రెండు రోజుల్లోనే.. ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులకు ఒక అధ్యాపకుడి చొప్పున బృందాలుగా విభజించి, మండలానికి రెండు బృందాలకు ఈ సర్వే బాధ్యతలు అప్పగించారు. అలా జిల్లా వ్యాప్తంగా 74 ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు చెందిన 218 మంది అధ్యాపకులను (మోనిటర్స్గా), 854 మంది విద్యార్థులను రంగంలోకి దింపింది. ఈ విధంగా ఒక్కో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మూడు, నాలుగు మండలాలకు వెళ్లారు. పలు మండలాల్లో బృందాలు మండల పరిషత్ కార్యాలయాలకు లేదా గ్రామ పంచాయతీలకు వెళ్లి ఇప్పటికే నివేదించిన నకళ్లను తీసుకుని పరిశీలించి వాటిలో చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి నివేదించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. ఇదేమిటండీ! అంటే ఏమి చేస్తామండీ! అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించి 51 అంశాలపై సర్వే రెండు రోజుల్లో రెండు బృందాలు పూర్తి చేయడం సాధ్యమా? అని ఓ అధ్యాపకుడు ప్రశ్నించారు. చదువులు గాలికొదిలేసి గ్రామాల్లో అదీ ఇతర మండలాలకు వెళ్లి సర్వే చేయమన్నారు.. రవాణా చార్జీలు, భోజనం ఖర్చులు ఏమీ లేవు. ఎలా? అని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. పబ్లిసిటీ కోసమా? ఈ ప్రభుత్వం ప్రజలను ఉద్ధరిస్తోందని, దానిలో భాగంగా అధికారులు బాగా పనిచేస్తున్నారా? లేదా? వారిచ్చే నివేదికలు సంతృప్తికరమేనా? కాదా అని అనుమానిస్తూ వారి నివేదికలపై రీ సర్వేకు అధ్యాపకులు, విద్యార్థులను నియమించినట్టు ప్రజల నుంచి మెప్పు పొందడానికి, ప్రచారం కోసమేనని పలువురు అధికకారులు, అధ్యాపకులు పెదవివిరిచారు. -
రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం
- కొందరు చేసిన తప్పులను వ్యవస్థకంతా అపాదించొద్దు – విలేకరుల సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలు(అగ్రికల్చర్): మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ద్వారా 90శాతం భూసమస్యలు పరిష్కారం అయ్యాయని,మిగిలిన సమస్యలు పరిష్కారం కావలంటే భూముల రీ సర్వే చేపట్టాలని ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్ , రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖలో ఎక్కడో ఒకరిద్దరు చేసిన పనులను మొత్తం వ్యవస్థకే అపాదించొద్దని కోరారు. రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం అప్పగించిన అన్ని పనులను విజయంతంగా నిర్వహిస్తోందని కర్నూలు జిల్లాలోని ఇండస్ట్రియల్ పార్క్‌కు, అమరావతి నిర్మాణానికి సకాలంలో భూములు సేకరించి ఇచ్చిన ఘనత రెవెన్యూదేనని చెప్పారు. ఉద్యోగులకు తగిన సదుపాయాలు, శిక్షణ ఇస్తే ఎటువంటి క్లిష్టతరమైన పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో ఎపుడూ లేని విధంగా సంస్కరణలు తీసుకవచ్చామని వివరించారు. భూముల రిజిస్ట్రేషన్లకు ముందే సబ్ డివిజన్లు చేయడం వల్ల భూ సమస్యలు తగ్గతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రవేశపెట్టిన హెల్త్ కార్డుల విధానం లోపభూయిష్టంగా ఉందని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఏ కార్పేరేట్ ఆసుపత్రి వీటిని గుర్తించడం లేదని వాపోయారు. బయోమెట్రిక్ విధానంలో క్షేత్రస్థాయికి వెళ్లే వారికి కొంత మినహాయింపునివ్వాలని సూచించారు. రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయడంలో ఎన్జీఓ అసోషియేషన్ అధ్యక్షడు అశోక్‌బాబు విఫలం అయ్యారని ఆరోపించారు. ఏపీ జేఏసీకి సంఘీభావం.... బీసీ హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ జేఏసీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ఏఎన్ఎంల సంఘం కూడా మద్దతు ఇస్తోందని అధ్యక్షురాలు సులోచనమ్మ చెప్పారు. రాష్ట్ర టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ల అసోసియేషన్ మద్దతుగా నిలుస్తోందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం నేత యోగేశ్వరరెడ్డి, కో ఆపరేటివ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత వీర్రాజు, జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం నేత గిరిధర్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకుడు శ్రీనివాసరెడ్డి , రెవెన్యూ సర్వీస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ బాబు, కార్యదర్శి గిరికుమార్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షడు ఉశేన్ సాహెబ్ జిల్లా నాయకులు వేణుగాపాల్ రావు,రామన్న, శ్రీనివాసులు,జలాలుద్దీన్,వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు రాముడు తదితరులు పాల్గొన్నారు.