సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో కీలకమైన డ్రోన్ సర్వే (డ్రోన్లతో భూముల కొలత) తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 97 శాతం సర్వే పూర్తయింది. మిగిలిన 3 శాతాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయడానికి సర్వే, సెటిల్‌మెంట్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
రాష్ట్రంలోని 17,595 గ్రామాలకు గాను, డ్రోన్ సర్వే సాధ్యం కాని 4,135 గ్రామాలను మినహాయిస్తే 13,460 గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 13,075 గ్రామాల్లో దాదాపు 1.75 కోట్ల ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఇంకా కేవలం 385 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కావాల్సి ఉంది. వీటిలో శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వే జరగాల్సి ఉంది. ఈ నెలాఖరుకు మొత్తం గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని సర్వే శాఖ అధికారులంటున్నారు. ఇది పూర్తయితే రీ సర్వేలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసినట్లవుతుంది. మొత్తం 1.80 కోట్ల ఎకరాలను కొలిచినట్లవుతుంది. ఇది ఒక రికార్డుగా అధికారులు చెబుతున్నారు.
వేగంగా పూర్తి చేసేందుకు...
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏరియల్ సర్వే కోసం డ్రోన్లతోపాటు విమానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేట్ డ్రోన్ ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 వేలమంది సర్వేయర్లను నియమించడంతోపాటు సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేయర్లకు పైలెట్లుగా శిక్షణ ఇచ్చి సర్వే చేయిస్తోంది. దీంతో సర్వే అత్యంత వేగంగా పూర్తవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment