శశికళకు మరిన్ని కష్టాలు!
సాక్షి, చెన్నై: తమిళనాడులో మన్నార్‌గుడి మాఫియా కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కేందుకు వ్యూహరచనలు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. చిన్నమ్మ కుటుంబం, బినామీలను టార్గెట్ చేసి త్వరలో మరిన్న దాడులకు ఆస్కారం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. మున్ముందు చిన్నమ్మకు మరిన్ని షాక్‌లు తగిలే అవకాశాలు ఉన్నట్టు చర్చ సాగుతోంది. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేను గుప్పెట్లోకి తీసుకుని, సీఎంగా పగ్గాలు చేపట్టాలన్న కలలుకన్న చిన్నమ్మ శశికళ ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది.
కోర్టు తీర్పుతో పరప్పన అగ్రహార చెరకు ఆమె పరిమితమై ఉన్నారు. అయితే, తన ప్రతినిధిగా అక్క వనితామణి కుమారుడు దినకరన్‌ను రంగంలోకి దించినా, రెండాకుల చిహ్నం ఆయన్ను చుట్టుముట్టింది. ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి యత్నించి కటకటాల పాలయ్యాడు. తాజాగా, సాగుతున్న ఈ పరిణామాల వెనుక ఢిల్లీలోని కేంద్ర పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, రాష్ట్ర బీజేపీ వర్గాలు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. కమలం కనుసన్నల్లోనే అన్నాడీఎంకే రాజకీయ పరిణామాలు సాగుతున్నట్టుగా ప్రతి పక్షాలన్నీ గళాన్ని వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే, రాజకీయ జీవితం నుంచి శశికళ, దినకరన్ కేసుల రూపంలో దూరమైనా, మన్నార్‌గుడి మాఫియా చాప కింద నీరులా వ్యూహాలకు పదును పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా ఢిల్లీ పెద్దలకు సమాచారం వెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. శశికళ కుటుంబ మాఫియాను అణచివేయడానికి అస్త్రాలను ప్రయోగించేందుకు ఢిల్లీ సిద్ధం అవుతోన్నట్టు సమాచారం. జయలలిత అధికారాల్ని అడ్డం పెట్టుకుని చాప కింద నీరులా ఆ మాఫియా కూడబెట్టిన ఆస్తుల్ని గురిపెట్టి దాడులకు పథకం సాగుతున్నట్టు తెలిసింది.
బినామీలే టార్గెట్
శశికళ కుటుంబానికి చెందిన వారి గుప్పెట్లో అనేక సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్ ఉన్నట్టుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోనూ ఆస్తుల్ని గురిపెట్టినట్టుగా ప్రచారం సాగుతున్నది. ఈ ఆస్తుల వివరాలు, జయలలిత మరణం తదుపరి ఆమెకు చెందిన ఆస్తుల పర్యవేక్షణ ఎవ్వరి చేతిలో ఉన్నాయో, పత్రిక, టీవీ ఛానళ్లు, సిరుదావూర్ బంగ్లా, కొడనాడు ఎస్టేట్, మిడాస్ లిక్కర్, జోష్‌సినిమాస్ వంటి వాటిని వివరాల సేకరణ శరవేగంగా సాగుతున్నట్టు సమాచారం.
చిన్నమ్మ బినామీలు ఎవ్వరెవ్వరో అన్న వివరాల చిట్టాను సిద్ధం చేసి, అందర్నీ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బ తీసే రీతిలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంటున్నది. ప్రస్తుతం అన్నాడీఎంకేకు దినకరన్‌ను దూరం చేసిన దృష్ట్యా, తదుపరి చిన్నమ్మ కుటుంబానికి చెందిన వివేక్, వెంకటేష్, శివకుమార్, అనురాధ, దివాకరన్‌ను టార్గెట్ చేసి ఐటీ దాడులకు అవకాశాలు ఉన్నట్టుగా తమిళ మీడియాల్లోనూ కథనాలు వెలువడుతుండడంతో, మున్ముందు తమిళనాట మరిన్ని హాట్ టాపిక్‌లతో కూడిన ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.