mannargudi mafia
-
దినకరన్ వెనక మన్నార్గుడి మాఫియా?
రెండాకుల గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఏకంగా ఎన్నికల కమిషన్ అధికారులకే కోట్లలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన టీటీవీ దినకరన్ వెనక ఉన్నది.. మన్నార్గుడి మాఫియా అని దాదాపు తేలిపోయింది. తమిళనాడులో ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులకు దీనిపై కళ్లు చెదిరే వాస్తవాలు తెలుస్తున్నాయి. తాజాగా వాళ్లు మన్నార్గుడికి చెందిన ఓ రిటైర్డ్ అధికారి ఇంట్లో సోదాలు చేశారు. దాంతో ఇన్నేళ్లుగా శశికళ కుటుంబం చేస్తున్న అక్రమాలు, ఇతర విషయాలన్నీ ఢిల్లీ పోలీసులకు తెలిశాయంటున్నారు. వీడియో క్యాసెట్లు అమ్ముకునే వీకే శశికళ.. జయలలితతో ఉన్న సాన్నిహిత్యంతో కొన్నాళ్ల పాటు తమిళనాట చక్రం తిప్పారు. జయలలిత మరణం తర్వాత పూర్తిగా అధికారాన్ని హస్తగతం చేసుకుందామని అనుకున్నారు. అంతలో అక్రమాస్తుల కేసు తీర్పు రావడం.. శశికళ జైలు పాలు కావడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి. జయలలిత ఉన్నన్నాళ్లు ఆమెకు ఎప్పుడు ఆపద వచ్చినా, ఆమె స్థానంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమే ఉండేవారు. అమ్మ కుర్చీలో తాను కూర్చోకూడదని.. అక్కడ జయలలిత ఫొటోను మాత్రం ఉంచి తాను వేరే కుర్చీలో కూర్చుని పాలన సాగించేవారు. జయలలిత మరణం తర్వాత అలాంటి పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో మన్నార్గుడి మాఫియాకు ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. శశికళ - దినకరన్ కలిసి ఎలాగైనా అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకోవాలని భావించారు. దాంతో ముందుగా పళనిస్వామిని రంగంలోకి దించి ఆయనను ముఖ్యమంత్రిగా చేశారు. అందుకోసం బే రిసార్ట్ వద్ద భారీ క్యాంపు నిర్వహించి ఎమ్మెల్యేలను అక్కడే ఉంచారు. ఆ తర్వాత జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ స్థానం నుంచి దినకరన్‌తో పోటీ చేయించి నెమ్మదిగా రాష్ట్ర పగ్గాలను అతడికి ఇప్పించాలన్నది మన్నార్గుడి మాఫియా ప్లాన్. అయితే ఓటర్లకు కనీ వినీ ఎరుగని స్థాయిలో డబ్బులు పంపిణీ చేయడం, అదంతా ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల్లో బయటపడటంతో ఏకంగా ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత కొద్దికాలానికే రెండాకుల గుర్తు కోసం ప్రయత్నం జరగడం, అందులో దినకరన్ దొరికిపోవడం లాంటి పరిణామాలు జరిగాయి. తాము గెలవాలన్నా, గెలిచి నిలవాలన్నా.. పార్టీ గుర్తు తమకు రావడం చాలా అవసరమని శశికళ వర్గం భావించింది. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా ఉన్నా బలం తమకే ఎక్కువగా ఉన్నా కూడా గుర్తు లేకపోవడం అతిపెద్ద లోపమని దినకరన్ వర్గీయులు అనుకున్నారు. అందుకోసమే ఎలాగైనా గుర్తును సాధించాలని.. ఆ బాధ్యతను దినకరన్ మీద పెట్టారు. తాను హైకోర్టు జడ్జినని చెప్పిన సుఖేష్ చంద్రశేఖరన్ వలలో దినకరన్ చిక్కుకోవడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. దినకరన్ - సుఖేష్ సంభాషణలకు సంబంధించిన టేపులన్నీ తమవద్ద ఉన్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అయితే వాటిని ఇంతవరకు బయటపెట్టలేదు. -
శశికళకు మరిన్ని కష్టాలు!
సాక్షి, చెన్నై: తమిళనాడులో మన్నార్గుడి మాఫియా కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కేందుకు వ్యూహరచనలు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. చిన్నమ్మ కుటుంబం, బినామీలను టార్గెట్ చేసి త్వరలో మరిన్న దాడులకు ఆస్కారం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. మున్ముందు చిన్నమ్మకు మరిన్ని షాక్‌లు తగిలే అవకాశాలు ఉన్నట్టు చర్చ సాగుతోంది. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేను గుప్పెట్లోకి తీసుకుని, సీఎంగా పగ్గాలు చేపట్టాలన్న కలలుకన్న చిన్నమ్మ శశికళ ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది. కోర్టు తీర్పుతో పరప్పన అగ్రహార చెరకు ఆమె పరిమితమై ఉన్నారు. అయితే, తన ప్రతినిధిగా అక్క వనితామణి కుమారుడు దినకరన్‌ను రంగంలోకి దించినా, రెండాకుల చిహ్నం ఆయన్ను చుట్టుముట్టింది. ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి యత్నించి కటకటాల పాలయ్యాడు. తాజాగా, సాగుతున్న ఈ పరిణామాల వెనుక ఢిల్లీలోని కేంద్ర పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, రాష్ట్ర బీజేపీ వర్గాలు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. కమలం కనుసన్నల్లోనే అన్నాడీఎంకే రాజకీయ పరిణామాలు సాగుతున్నట్టుగా ప్రతి పక్షాలన్నీ గళాన్ని వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే, రాజకీయ జీవితం నుంచి శశికళ, దినకరన్ కేసుల రూపంలో దూరమైనా, మన్నార్గుడి మాఫియా చాప కింద నీరులా వ్యూహాలకు పదును పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా ఢిల్లీ పెద్దలకు సమాచారం వెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. శశికళ కుటుంబ మాఫియాను అణచివేయడానికి అస్త్రాలను ప్రయోగించేందుకు ఢిల్లీ సిద్ధం అవుతోన్నట్టు సమాచారం. జయలలిత అధికారాల్ని అడ్డం పెట్టుకుని చాప కింద నీరులా ఆ మాఫియా కూడబెట్టిన ఆస్తుల్ని గురిపెట్టి దాడులకు పథకం సాగుతున్నట్టు తెలిసింది. బినామీలే టార్గెట్ శశికళ కుటుంబానికి చెందిన వారి గుప్పెట్లో అనేక సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్ ఉన్నట్టుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోనూ ఆస్తుల్ని గురిపెట్టినట్టుగా ప్రచారం సాగుతున్నది. ఈ ఆస్తుల వివరాలు, జయలలిత మరణం తదుపరి ఆమెకు చెందిన ఆస్తుల పర్యవేక్షణ ఎవ్వరి చేతిలో ఉన్నాయో, పత్రిక, టీవీ ఛానళ్లు, సిరుదావూర్ బంగ్లా, కొడనాడు ఎస్టేట్, మిడాస్ లిక్కర్, జోష్సినిమాస్ వంటి వాటిని వివరాల సేకరణ శరవేగంగా సాగుతున్నట్టు సమాచారం. చిన్నమ్మ బినామీలు ఎవ్వరెవ్వరో అన్న వివరాల చిట్టాను సిద్ధం చేసి, అందర్నీ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బ తీసే రీతిలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంటున్నది. ప్రస్తుతం అన్నాడీఎంకేకు దినకరన్‌ను దూరం చేసిన దృష్ట్యా, తదుపరి చిన్నమ్మ కుటుంబానికి చెందిన వివేక్, వెంకటేష్, శివకుమార్, అనురాధ, దివాకరన్ను టార్గెట్ చేసి ఐటీ దాడులకు అవకాశాలు ఉన్నట్టుగా తమిళ మీడియాల్లోనూ కథనాలు వెలువడుతుండడంతో, మున్ముందు తమిళనాట మరిన్ని హాట్ టాపిక్లతో కూడిన ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.