దినకరన్ వెనక మన్నార్‌గుడి మాఫియా?
రెండాకుల గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఏకంగా ఎన్నికల కమిషన్ అధికారులకే కోట్లలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన టీటీవీ దినకరన్ వెనక ఉన్నది.. మన్నార్‌గుడి మాఫియా అని దాదాపు తేలిపోయింది. తమిళనాడులో ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులకు దీనిపై కళ్లు చెదిరే వాస్తవాలు తెలుస్తున్నాయి. తాజాగా వాళ్లు మన్నార్‌గుడికి చెందిన ఓ రిటైర్డ్ అధికారి ఇంట్లో సోదాలు చేశారు. దాంతో ఇన్నేళ్లుగా శశికళ కుటుంబం చేస్తున్న అక్రమాలు, ఇతర విషయాలన్నీ ఢిల్లీ పోలీసులకు తెలిశాయంటున్నారు. వీడియో క్యాసెట్లు అమ్ముకునే వీకే శశికళ.. జయలలితతో ఉన్న సాన్నిహిత్యంతో కొన్నాళ్ల పాటు తమిళనాట చక్రం తిప్పారు. జయలలిత మరణం తర్వాత పూర్తిగా అధికారాన్ని హస్తగతం చేసుకుందామని అనుకున్నారు. అంతలో అక్రమాస్తుల కేసు తీర్పు రావడం.. శశికళ జైలు పాలు కావడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి.
జయలలిత ఉన్నన్నాళ్లు ఆమెకు ఎప్పుడు ఆపద వచ్చినా, ఆమె స్థానంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమే ఉండేవారు. అమ్మ కుర్చీలో తాను కూర్చోకూడదని.. అక్కడ జయలలిత ఫొటోను మాత్రం ఉంచి తాను వేరే కుర్చీలో కూర్చుని పాలన సాగించేవారు. జయలలిత మరణం తర్వాత అలాంటి పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో మన్నార్‌గుడి మాఫియాకు ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. శశికళ - దినకరన్ కలిసి ఎలాగైనా అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకోవాలని భావించారు. దాంతో ముందుగా పళనిస్వామిని రంగంలోకి దించి ఆయనను ముఖ్యమంత్రిగా చేశారు. అందుకోసం బే రిసార్ట్ వద్ద భారీ క్యాంపు నిర్వహించి ఎమ్మెల్యేలను అక్కడే ఉంచారు. ఆ తర్వాత జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ స్థానం నుంచి దినకరన్‌తో పోటీ చేయించి నెమ్మదిగా రాష్ట్ర పగ్గాలను అతడికి ఇప్పించాలన్నది మన్నార్‌గుడి మాఫియా ప్లాన్. అయితే ఓటర్లకు కనీ వినీ ఎరుగని స్థాయిలో డబ్బులు పంపిణీ చేయడం, అదంతా ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల్లో బయటపడటంతో ఏకంగా ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత కొద్దికాలానికే రెండాకుల గుర్తు కోసం ప్రయత్నం జరగడం, అందులో దినకరన్ దొరికిపోవడం లాంటి పరిణామాలు జరిగాయి.
తాము గెలవాలన్నా, గెలిచి నిలవాలన్నా.. పార్టీ గుర్తు తమకు రావడం చాలా అవసరమని శశికళ వర్గం భావించింది. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా ఉన్నా బలం తమకే ఎక్కువగా ఉన్నా కూడా గుర్తు లేకపోవడం అతిపెద్ద లోపమని దినకరన్ వర్గీయులు అనుకున్నారు. అందుకోసమే ఎలాగైనా గుర్తును సాధించాలని.. ఆ బాధ్యతను దినకరన్ మీద పెట్టారు. తాను హైకోర్టు జడ్జినని చెప్పిన సుఖేష్ చంద్రశేఖరన్ వలలో దినకరన్ చిక్కుకోవడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. దినకరన్ - సుఖేష్ సంభాషణలకు సంబంధించిన టేపులన్నీ తమవద్ద ఉన్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అయితే వాటిని ఇంతవరకు బయటపెట్టలేదు.