కలువాయి మండలం రాజుపాళెం చౌక దుకాణం ఓ మహిళ పేరుతో నిర్వహిస్తున్నారు. ఆమెకు వివాహమై సుమారు 7 సంవత్సరాలు గడిచింది. ఆమె నెల్లూరులో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. రాజుపాళెంలోని చౌకదుకాణాన్ని ఆమె తండ్రి నిర్వహిస్తున్నాడు. నెల్లూరు నగరంలోని మూలాపేట, వెంకటేశ్వరపురం, కావలి, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి తదితర మండలాల్లో ఇలా బినామీలు రేషన్‌షాపులు నిర్వహిస్తుండడం కారణంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.
నెల్లూరు(పొగతోట): చౌకదుకాణాల్లో ఏళ్ల తరబడి బినామీల బాగోతం నడుస్తోంది. రేషన్‌షాపు డీలర్ పక్క జిల్లాలో ఉన్నా బినామీ డీలర్ మాత్రం చౌకదుకాణాలను సంవత్సరాల తరబడి నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ఈ–పాస్ విధానంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పేద ప్రజలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లాలో చాలా మంది డీలర్ల ఆధ్వర్యంలో మూడు నుంచి నాలుగు చౌకదుకాణాలు ఉన్నాయి. మూలాపేటకు చెందిన రెండు చౌకదుకాణాలకు సంబంధించిన డీలర్లు పక్క జిల్లాలో నివాసం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. రేషన్‌షాపును మరొకరికి అద్దెకు ఇచ్చి రెండు వైపులా సంపాదిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో 300లకు పైగా చౌకదుకాణాలు బినామీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనేక ప్రాంతాల్లో మహిళల పేర్లతో రేషన్ షాపులు ఉన్నాయి. వాటి నిర్వహణ మాత్రం బినామీలు చేస్తున్నారు. వివాహమై దూర ప్రాంతాలకు వెళ్లిన వారు షాపులు వదులుకోకుండా బినామీల ఆధ్వరంలో నిర్వహిస్తున్నారు.
మరణించినా కొనసాగుతున్న వైనం
పలువురు డీలర్లు మరణించినా ఆ షాపులు కొనసాగుతున్నాయి. మరణించిన వారిలో అతి తక్కువ మందికి మాత్రమే వారి కుటుంబ సభ్యులకు కేటాయించారు. అధిక శాతం రేషన్ షాపులు బినామీల చేతుల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని బినామీ డీలర్లు రేషన్ షాపునకు బోర్డులు కుడా ఏర్పాటు చేయకుండా వారి ఇళ్లలోనే నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో బినామీ డీలర్లు రూ.కోట్లు సంపాదించారు. జిల్లాలో 1896 చౌకదుకాణాలు ఉన్నాయి. 8.76 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యం చౌకదుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. చౌకదుకాణాల డీలర్లు ప్రతి నెలా డీడీ తీసి కార్యాలయంలో అందజేయాల్సిఉంది. డీడీలు చెల్లించిన చౌకదుకాణాలకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ సరఫరా చేస్తారు. గత నెలలో ఉన్న నిల్వలను పరిశీలించి రేషన్ సరఫరా చేస్తారు. ఈ–పాస్ విధానం ప్రవేశ పెట్టక ముందు డీలర్లు 100, 95 శాతం పంపిణీ చేసినట్లు రికార్డులు చూపించేవారు. 50 నుంచి 60 శాతం మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేసేవారు. మిగిలిన దానిని దొడ్డిదారిన పక్క రాష్ట్రాలకు తరలించే వారు. కొంతమంది డీలర్లు జిల్లాలో రైస్ మిల్లర్లకు విక్రయించేవారని సమాచారం. బియ్యం, చక్కర, కిరోసిన్ ద్వారా డీలర్లు లక్షల రూపాయలు వెనుకవేసుకునేవారు. అక్రమమార్గంలో సంపాదించిన దానిలో అసలు డీలర్లకు అద్దెతోపాటు 10 శాతం వాటా ఇచ్చేవారని తెలుస్తోంది.
కొత్తదారులు వెదకి..
ఈ–పాస్ విధానం వచ్చిన తరువాత డీలర్ల చేతులు కొంతవరకు కట్టేశారు. డీలర్లు నూతన మార్గాలు అన్వేషించారు. బినామీలు నిర్వహించే రేషన్ షాపులకు బోగస్ ఏఏవై(అంత్యోదయ అన్న యోజన) కార్డులు సృష్టించారు. ప్రస్తుతం ఏఏవై కార్డుల ద్వారా బియ్యం స్వాహా చేస్తున్నారు. ఏఏవై కార్డుకు 35 కేజీలు బియ్యం పంపిణీ చేస్తారు. 100 బోగస్ ఏఏవై కార్డులు ఉన్న చౌకదుకాణం డీలర్ 3500 కిలోల బియ్యం(70 బస్తాలు) స్వాహా చేస్తున్నారు. 150 ఏఏవై కా>ర్డులు ఉన్న రేషన్ డీలర్లు 105 బస్తాల బియ్యం స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎలక్ట్రానికల్ నో యువర్ కస్టమర్(ఈకేవైసీ) కార్యక్రమం జరుగుతోంది. ఈకేవైసీ ద్వారా చౌకదుకాణాల డీలర్ల పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇప్పటి వరకు 17 మండలాల్లో మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభమైంది. మిగిలిన 29 మండలాల్లో ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరణించిన రేషన్ షాపుల డీలర్ల సమాచారం వచ్చే అవకాశం లేదు. ఇతర జిల్లాల్లో నివసించే వారు, వివాహం అయిన మహిళల షాపులకు సంబంధించిన సమాచారం పూర్తిగా ఆన్‌లైన్‌లో నమోదు అయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారణ చేపడితే బినామీల రేషన్ డీలర్ల బండారం బయటపడే అవకాశం ఉంది.
డీలర్ల సమాచారం సేకరిస్తున్నాం
చౌకదుకాణాల డీలర్లకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాం. ఈకేవైసీ ద్వారా డీలర్ల సమాచారం సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాం. సమాచారం సేకరించే సమయంలో బినామీలు ఉంటే బయపడే అవకాశం ఉంది. అలాంటి షాపులకు సంబంధించిన వివరాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. అధికారుల అనుమతితో నోటిషికేషన్ ద్వారా షాపులను నూతన డీలర్లకు కేటాయిస్తాం.
– శివప్రసాధ్, డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment