‘ఇందిరమ్మ’ కల నెరవేరేలా లేదు. పక్కాఇంటికి సర్కారు ఇస్తున్న సొమ్ము సరిపోక నిర్మాణాలు చాలావరకు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇంకా పలుచోట్లా పనులే మొదలుకాలేదు. ఇప్పటికీ ప్రారంభించని ఇళ్లను రద్దు చేయాలని జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులను నిరాశకు గురిచేస్తోంది. ఇళ్ల నిర్మాణ బిల్లును ప్రభుత్వం రెండుసార్లు పెంచినా.. సామగ్రి ధరలు అంతకన్నా భారీస్థాయిలో పెరుగుతుండడం పనులకు ప్రతిబంధకంగా మారుతోంది. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందకపోవడం కూడా జాప్యానికి కారణమవుతోంది.
-సాక్షి, కరీంనగర్
పథకం ప్రారంభం ఇలా..
ఇందిరమ్మ పథకం 2006లో ప్రారంభమైంది. మొదటి విడత మంజూరైన ఇళ్లకు ఇక్కో ఇంటికి రూ.28,050 ఇచ్చారు. అప్పటి ధరల ప్రకారం డబ్బులు సరిపోకపోవడంతో లబ్ధిదారులు కొం త కలుపుకున్నారు. వెచ్చించలేనివారు ఆశలను వదులుకున్నారు.
లబ్ధిదారుల ఇబ్బందులు, ముడిసరుకుల ధరలను దృష్టిలో ఉంచుకుని 2007లో యూనిట్ వ్యయాన్ని రూ.34,250కు పెంచారు. అప్పటికే సరుకుల ధరలు అంతకన్నా వేగంగా పెరిగాయి. ఫలితంగా లబ్ధిదారులకు ఎలాంటి ఊరటా కలగలేదు. 2008-09లో యూనిట్ వ్యయాన్ని రూ.48,050కు ప్రభుత్వం పెంచింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.68,050 ఇచ్చిం ది. తాజాగా యూనిట్‌కు రూ.70 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.1.05లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.సామగ్రి ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఈ డబ్బులూ సరిపోవడం లేదు.
నిలిచిపోయిన పనులు
జిల్లావ్యాప్తంగా మంజూరైన ఇళ్లలో ఇప్పటివరకు మూడో వంతు నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. అధికారులు కిందిస్థాయి సిబ్బందికి నెలవారీగా లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నా.. క్షేత్రస్థాయి ఇబ్బందులతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. జిల్లాకు మూడు విడతల్లో 2,55,284 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 1,56,652 మాత్రమే పూర్తయ్యాయి. 98,632 ఇళ్లకు ఇంకా మోక్షమే లభించలేదు.
ఇంకా 23,116 ఇళ్లు ఇంకా మొదలుపెట్టలేదు. 34,221 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 27,467 ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 7,655కు మించలేదు. మరో రెండు నెలల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడం అసాధ్యమన్న భావన అధికారుల్లోనే ఉంది. మరోవైపు నిర్మాణాలు ప్రారంభించని ఇళ్లను రద్దు చేయాలని యంత్రాంగం భావిస్తోంది. చాలామంది లబ్ధిదారులు నిరుపేదలు కావడంతో సొంతంగా డబ్బులు ఖర్చు చేయలేకపోతున్నారు. కొన్నిచోట్ల ఇళ్ల స్థలాల సమస్య కూడా వెంటాడుతోంది.
రెండేళ్ల నుంచి బిల్లు రాలె
రెండేళ్ల క్రితం ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేశారు. అప్పు చేసి ఇల్లు కట్టుకున్న. మంజూరు పత్రం, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా పరిశీలించిన అధికారులు బిల్లు ఇస్తమన్నారు. ఇప్పటికీ బిల్లు ఇవ్వలేదు. ఊరికి వచ్చే సార్లందరినీ అడుగుతున్నాను. ఎవరూ పట్టించుకుంట లేరు. అప్పులోళ్లు అడుగుతున్నారు. సార్లు స్పందించి త్వరగా బిల్లు ఇప్పించాలి.
- న్యూస్‌లైన్, కమాన్‌పూర్
ఇల్లు మంజూరైనా అద్దె ఇంటిలోనే..
ఈమె ఎంపెల్లి స్వరూప. మహదేవపూర్ మండలకేంద్రం. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 2008లో మంజూరు చేసింది. అయితే స్థలం లేకపోవడంతో పలుమార్లు అధికారులను వేడుకుంది. ఇంతలో మంజూరైన ఇల్లు రద్దయ్యింది. తిరిగి రచ్చబండలో మరోసారి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇల్లు మంజూరైన ఆమెకు స్థలాన్ని మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇల్లు రద్దయ్యే ప్రమాదముంది. రోజు కూలీ చేసుకుని జీవించే ఈమె నెలనెలా ఇంటి కిరాయి రూపేణా రూ.500 చెల్లిస్తోంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది.
- న్యూస్‌లైన్, మహదేవపూర్
పేకమేడలు
Published Wed, Jan 22 2014 4:00 AM | Last Updated on Tue, Mar 19 2019 6:15 PM