కట్టాలా.. వద్దా! | indiramma Homes Beneficiaries | Sakshi
Sakshi News home page

కట్టాలా.. వద్దా!

Published Mon, Nov 10 2014 12:02 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM

కట్టాలా.. వద్దా! - Sakshi

కట్టాలా.. వద్దా!

పేదోడి గూడు అయోమయంలో పడింది. అధికారంలోకి వస్తే రూ.మూడు లక్షలతో బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తామని చెప్పిన టీఆర్‌ఎస్.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇళ్ల నిర్మాణంపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే జిల్లాలో పేదలకు మంజూరైన ‘ఇందిరమ్మ’ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేయాలా? వద్దా? అన్న మీమాంస లబ్ధిదారుల్లో ఉంది. ఒక వేళ పూర్తి చేస్తే వాటికి బిల్లులు వస్తాయో రావో తెలియదు. అలాగే వదిలేస్తే.. కొత్త పథకంలో పాత లబ్ధిదారులకు చోటు దక్కుతుందో లేదో తెలియదు.. అప్పుచేసి చాలామంది ఇళ్లు ప్రారంభించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి కూడా బిల్లులు అందాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఈ అంశాలపై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఇళ్ల పనులు ప్రారంభించిన వాళ్లకు ఎటూ పాలుపోవడం లేదు.     - చేవెళ్ల, మొయినాబాద్
 

అయోమయంలో ఇందిరమ్మ లబ్ధిదారులు
జిల్లాలో మంజూరైన మొత్తం ఇళ్లు:     2,09,194
ఇప్పటికీ ప్రారంభించనివి:                  46,058
వివిధ దశల్లో ఉన్నవి:                      43,914

 
* ఎనిమిది నెలలుగా అందని బిల్లులు
* నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు
* కొత్తవి మంజూరుకావు.. కట్టినవాటికి బిల్లులివ్వరు
* అసలే మొదలుకాని ఇళ్ల పరిస్థితేంటి..

చేవెళ్ల/ మొయినాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ఎనిమిది నెలలుగా బిల్లులు అందకపోవడంతో ప్రారంభించిన నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులు వాటిని నిర్మించాలా? వద్దా? అనే మీమాంసలో ఉండిపోయారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మంజూరు, నిర్మాణంలో ఉన్న పాతవాటి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి  నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ.3 లక్షల వ్యయంతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడడంతో చాలా మంది డబుల్ బెడ్‌రూం ఇళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితి జిల్లా అంతటా ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
 
మార్చి నెల నుంచి బిల్లుల నిలిపివేతతో లబ్ధిదారుల ఇబ్బందులు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కోడ్‌లో భాగంగా ఎన్నికల కమీషన్ మార్చి నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించడాన్ని నిలిపేసింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఐదునెలలు దాటినా బిల్లుల చెల్లింపు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
 
అప్పటి నుంచి చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, నవాబ్‌పేట మండలాల్లో 2065 మంది లబ్ధిదారులకు పలు దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల  బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దాంతో అప్పోసప్పో చేసి నిర్మించుకుంటున్న  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల చెల్లింపులు లేక మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేయలేక అసంపూర్తిగానే మిగిలాయి.  కొన్ని ఇళ్లకు ఒక బిల్లు, ఇంకొన్ని ఇళ్లకు రెండు బిల్లులు, మరి కొన్ని ఇళ్లకు మూడు బిల్లులు వచ్చి ఆగిపోయాయి. ఇంకొంత మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నా ఒక్క బిల్లుకూడా రాలేదు.
 
అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు
గత ఎనిమిది నెలలుగా ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం బిల్లుల చెల్లింపు నిలిపివేసింది. ఎన్నికలు పూరై ్తనా ఇంకా బిల్లులు మాత్రం చెల్లించడంలేదు. ఇటు బిల్లులు రాక అటు ప్రైవేటుగా అప్పులు చేయలేక లబ్ధిదారులు ఇళ్లు నిర్మాణాలను వివిధ దశల్లో నిలిపేశారు. వాటిని పూర్తి చేస్తే ఇందిరమ్మ పథకం ప్రకారమే బిల్లులు చెల్లిస్తారా...? కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకం ప్రకారం డబ్బులు చెల్లిస్తారా అనే విషయంలో ప్రభుత్వంనుంచి ఇంకా ఎలాంటి స్పష్టతలేకపోవడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.
 
నిర్మాణాలు మొదలుకాని వాటి పరిస్థితేంటి..?
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన నియోజకవర్గం పరిధిలో సుమారు 3వేలకు పైగా లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఆ ఇళ్లకు ఈ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం పథకాన్ని అమలు చేస్తుందో, లేదోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో మంజూరైన ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తుందా అనే అనుమానం సైతం కలుగుతోంది. కొత్త ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదిరి చూస్తున్నారు. మరి కొత్త ప్రభుత్వం పేదల సొంతింటి కలను ఎలా నిజంచేస్తుందో వేచిచూడాలి.
 
అప్పుచేసి కట్టాం
సంవత్సరం కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యింది. అప్పు చేసి రూప్‌లెవల్ వరకు గోడలు కట్టాం. బేస్మిట్ బిల్లు ఒక్కటే వచ్చింది. ఇంకా రెండు బిల్లులు రావాలి. ఆ బిల్లులు వస్తే స్లాబ్ వేద్దామని చూస్తున్నాం. ఎనిమిది నెలలుగా బిల్లులు వస్తలేవు. అప్పుచేసి కొంతవరకు కట్టుకోగలిగాం. ఇళ్లులేక అద్దె ఇంట్లో ఉంటున్నాం.
 - జాహెదాబేగం, మొయినాబాద్
 
ఇళ్లు పూరై్తనా ఒక్క బిల్లు కూడా రాలేదు
సంవత్సరం కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. వెంటనే పనులు మొదలు పెట్టాం. మూడు నెలల క్రితమే ఇంటి నిర్మాణం పూర్తియింది. ఇప్పటి వరకు ఒక్కసారికూడా బిల్లు రాలేదు. హౌసింగ్ అధికారులను ఎప్పుడడిగినా ఆన్‌లైన్‌లో ఉంది. త్వరలోనే వస్తాయని చెబుతున్నారు. కాని బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియడంలేదు.
 - కమ్మరి పద్మమ్మ, సురంగల్
 
రెండువారాల్లో బిల్లులు వస్తాయి
ఎన్నికల ముందు నుంచి ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులను ప్రభుత్వం నిలిపేసింది. అప్పుటి నుంచి ఎవరికీ బిల్లులు రాలేదు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలను మరోసారి పరిశీలిస్తున్నాము. నిర్మాణాలను బట్టి బిల్లులు వస్తాయి. రెండు వారాల్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వచ్చే అవకాశం ఉంది.
 - ప్రేంసాగర్, గృహనిర్మాణ శాఖ డీఈఈ, చేవెళ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement