ఖమ్మం వైరారోడ్ : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం గత వారం సీబీసీఐడీ విచారణకు ఆదేశించటంతో జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులు నిధుల స్వాహాకు సంబంధించిన నివేదికలు తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లోని సీబీసీఐడి అడిషనల్ డెరైక్టర్ జనరల్‌కు నివేదికలు సమర్పించేందుకు గృహనిర్మాణ శాఖ యంత్రాంగం సమాయత్త మవుతోంది.
జిల్లాలో 2009 సంవత్సరం నుంచి 6,873 ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగినట్లు లెక్క తేలింది. అయితే ఈ పథకం ద్వారా చేపట్టే గృహనిర్మాణాలలో మూడు దశల్లో నిధులు పక్కదారి పట్టాయి. బోగస్ లబ్ధిదారులతో పాటు అసలు ఇళ్లే నిర్మించకుండా నిధులు స్వాహ పర్వం యథేచ్ఛగా కొనసాగింది. మొత్తంగా రూ. 3.69 కోట్లు స్వాహా అయినట్లు తేలింది. దీనికి సంబంధించిన నివేదికను రెండు,మూడు రోజుల్లో హైదరాబాద్‌లోని ఏడీజీకి అందజేసేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారు.
కొత్తగూడెంలో 1396, పినపాకలో 1019, సత్తుపల్లిలో 1025, భద్రాచలంలో 966, అశ్వారావుపేటలో 893 ఇళ్ల నిర్మాణాలలో అవినీతి జరగగా ఇల్లందు, మధిర, పాలేరు, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో కొంతమేర తక్కువగా ఉంది. ఇప్పటి వరకు 74 కేసులు నమోదు చేయగా అందులో 28 కేసుల విచారణ పూరైంది. రూ.10 లక్షల సొత్తు మాత్రమే రికవరీ జరిగింది. ఈ వ్యవహారంలో 80 మంది వరకు ఆ శాఖ సిబ్బందికి భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. వారిలో 18 మంది ఏఈలను సస్పెండ్ చేయగా నలుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు.
ఈ అవినీతిని వెలికితీసేందుకు ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించటంతో గృహనిర్మాణ శాఖ సిబ్బందిలో దడపుడుతోంది. ఇంతకాలం తప్పించుకుని యథేచ్ఛగా తిరుగుతున్న ఆ శాఖ సిబ్బందిలో వ ణుకు ప్రారంభమైంది. విచారణలో అవినీతి బాగోతం బయటపడటం ఖాయమని, తాము ఇక తప్పించుకోవటం సాధ్యం కాదని వారు తలలు పట్టుకుంటున్నారు.
సీబీసీఐడీ అధికారులు వీరిచ్చే నివేదికను బట్టి కాకుండా మరింత లోతుగా విచారణ జరిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల అవినీతి బాగోతంపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి దొంగలు
Published Wed, Aug 6 2014 3:16 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement