‘ఇందిరమ్మ’ అవినీతి ప్రపంచంలోనే పెద్దది
సభలో మంత్రి పోచారం
* తీవ్ర అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ సభ్యులు
* ఎదురుదాడికి దిగిన రసమయి
* సభనుంచి కాంగ్రెస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడా జరగనంత అవినీతి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బుధవారం శాసనసభ దద్దరిల్లింది. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా సంక్షేమ రంగం, గృహ నిర్మాణానికి కేటాయింపులపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాలను విస్మరించిందనే వ్యాఖ్యలపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు.
మేడారం జాతర రెండేళ్లకోసారి మాత్రమే జరుగుతుందని పేర్కొన్న మంత్రి ప్రస్తుత అవసరాల మేరకే బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తారని సమాధానమిచ్చారు. ‘ప్రతి దానికీ ఆరోపణలు చేయడం సరికాదు. మీకంటే ముందు ప్రతిపక్ష నేత జానారెడ్డి ఎంతో చక్కగా మాట్లాడారు. ఆయన పట్ల గౌరవం పెరిగింది. మైక్ ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో జరిగినంత అవినీతి ప్రపంచంలో మరెక్కడా జరగలేదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
పోచారం వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత జానారెడ్డి, సీనియర్ సభ్యులు గీతారెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ సభ్యులు సైతం కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూ ఎదురుదాడికి దిగడంతో సభలో కొన్ని నిమిషాల పాటు గందరగోళం ఏర్పడింది. అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో సభా కార్యక్రమాలు ముందుకు సాగాయి.
కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. బలహీనవర్గాల పేదకు 42 లక్షల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి ఇస్తే ఇలా అడ్డగోలు ఆరోపణలు చేయడం తగదన్నారు. సాధారణ దళితుడిగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించి సభలో మాట్లాడే అవకాశమిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ, సోనియాకు దక్కుతుందని వ్యాఖ్యానించగా.. టీఆర్‌ఎస్ సభ్యుడు రసమయి బాలకిషన్ ఘాటుగా స్పందించారు. ఒక కూలీ బిడ్డ..ఒక పాలేరు బిడ్డ..ఒక దళిత బిడ్డ అయిన తనను శాసనసభ్యుడు చేసింది టీఆర్‌ఎస్ అధ్యక్షుడ్ని కేసీఆర్ అని రసమయి కౌంటర్ ఇచ్చారు.
ఇందిరమ్మ పథకం అక్రమాలను ఎండగడూతూ కవి గోరటి వెంకన్న రాసిన పాటలను ప్రసంగం మధ్య మధ్యలో పాడుతూ నాటి కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు. రసమయి ఆరోపణలు, సభలో పాటలు పాడడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపినా ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మాజీమంత్రి డీకే అరుణ తీవ్ర ఆగ్రహంతో హెడ్‌ఫోన్స్‌ను స్పీకర్ చైర్ వద్దకు విసిరి కొడూతూ బయటకు వెళ్లిపోవడం కనిపించింది. ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సభను గురువారానికి వాయిదా వేశారు.
అవకతవకలు వాస్తవమే: కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అమలుకు సంబంధించి 2004-14 మధ్యలో భారీగా అవకతవకలు జరిగిన విషయం వాస్తవమేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. ఈ మేరకు బుధవారం ఆయన శాసనసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, దుర్గం చిన్నయ్య, బీజేపీ సభ్యులు కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, టి.రాజాసింగ్ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెపుతూ ఈ అవకతవకలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిందని, దీనికి నిర్దిష్టమైన కాలపరిమితిని ప్రభుత్వం సూచించలేదని సీఎం తెలిపారు.