బతుకు బాట | Survival trail | Sakshi
Sakshi News home page

బతుకు బాట

Published Mon, Jan 19 2015 2:58 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM

Survival trail

పడిపోయిన మట్టి గోడల ఇంటి ముందు దిగాలుగా కూర్చున్న వారంతా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లిలోని పెద్ద నింగప్ప కుటుంబసభ్యులు. వీరికి సెంటు భూమి లేదు. బతికేందుకు ఊళ్లో పనిలేదు. దీంతో ఇంటిల్లిపాది బెంగళూరుకు వలసెళ్లారు. అక్కడ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఊరికి రాక చాలా రోజులైంది. సంక్రాంతికైనా ఇంటికి రావాలనుకున్నారు.

బుధవారం భోగి పండుగ రోజున నింగప్ప బెంగళూరులో చనిపోయాడు. సంక్రాంతికి సొంతూరొచ్చి సంబరంగా పండుగ చేసుకోవాల్సిన నింగప్ప నలుగురు కుమారులు.. నాన్న శవాన్ని మోసుకుని వచ్చారు. ఊరంతా పండుగ చేసుకుంటే వారు మాత్రం నాన్న చావును తలుచుకుంటూ కుమిలిపోయారు.
 
 సాక్షిప్రతినిధి, అనంతపురం : ఏళ్లుగా ‘అనంత’ను పీడిస్తున్న కరువు రక్కసి ఈసారీ వదలలేదు. దీనివల్ల రైతులు, కూలీలు పొట్టచేతబట్టుకుని వలస వెళుతున్నారు. ఇప్పటికే దాదాపు 43 వేల కుటుంబాలు సొంతూళ్లను వదిలాయి. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది.  ఏటా ఇదే దుస్థితివర్షాభావ పరిస్థితులు ‘అనంత’ రైతును ఏటా దెబ్బతీస్తూనే ఉన్నాయి. వ్యయప్రయాసలకోర్చి ఈ ఏడాది పంట సాగు చేస్తే.. వరుణుడు కాసింత కనికరం కూడా చూపలేదు. పంట మొత్తం ఎండిపోయేలా చేశాడు. పంటను కాపాడుకునేందుకు వందలాది అడుగులు బోర్లు తవ్వినా నీటిజాడ కనిపించలేదు.

కాస్తోకూస్తో పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఫలితంగా రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఏటా జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటిస్తోందంటే ఏస్థాయిలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం మినహా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం లేదు. ఈ క్రమంలో రుణాలు తీర్చలేక, అప్పులోళ్ల మాటలు పడలేక, ఆత్మాభిమానం దెబ్బతిన్న అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

రాష్ట్ర విభజన పూర్తయిన రోజు నుంచి ఇప్పటి వరకూ 51మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు చచ్చి సాధించేదేమీ లేదంటూ వలసబాట పడుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతితో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. భవ న నిర్మాణ కూలీలుగా కొందరు, సెక్యూరిటీ గార్డులుగా మరికొందరు.. ఇలా ఏ పని దొరికితే అది చేస్తున్నారు.
 
కరువు సహాయక చర్యలేవీ?
ఈ ఏడాది ఏడు లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా, వర్షాభావంతో 5.06 లక్షల హెక్టార్లలో మాత్రమే వేశారు. వర్షాలు లేక పంట పూర్తిగా ఎండిపోయింది. ఐదు లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని స్వయాన వ్యవసాయాధికారులే ప్రభుత్వానికి నివేదికలు పంపారు. భూగర్భజలాలు కూడా కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం సగటు నీటిమట్టం 20 మీటర్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే 2.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. కొన్నిచోట్ల 800-1000 అడుగుల లోతుకు బోర్లు  వేసినా నీటి జాడ కనిపించడం లేదు.
 
గత రెండేళ్లుగా పంట నష్టం వాటిల్లడం, ఈసారీ పూర్తిగా చేతికందకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. మూడేళ్లుగా పంట కోసం, పూట గడవడం కోసం చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారాయి. రుణమాఫీపై ఆశలు అడియాసలయ్యాయి. గతేడాదికి సంబంధించి రూ.227 కోట్ల వాతావరణ బీమా జిల్లాకు మంజూరైనా ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అప్పుల కింద ఈ డబ్బును బ్యాంకర్లు జమ చేసుకున్నారు.

గతేడాదికి సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.643 కోట్లు రావాల్సివుంది. కష్టకాలంలో ఈ డబ్బు ఇచ్చి రైతన్నకు ఊరట కల్గించే చర్యలకు  ప్రభుత్వం ఉపక్రమించలేదు.  ఇన్‌పుట్‌సబ్సిడీ సొమ్మును మంజూరు చేయించే దిశగా జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు ఆలోచించడం లేదు.
 బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రెండూ కలిపితేజిల్లాకు దాదాపు రూ.900 కోట్లు అందుతుంది. రుణమాఫీ రూపంలో అయితే ఈ ఏడాది అందేది కేవలం రూ.780 కోట్లే. ఇకపోతే ఉపాధి హామీ పథకం కూడా జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు కావడం కాలేదు. దీనివల్ల తప్పనిపరిస్థితుల్లో ప్రజలు వలసబాట పడుతున్నారు.
 
వలసల బాట
     నల్లచెరువు మండలం బండ్రేపల్లిలో 110 కుటుం బాలు ఉంటే 76 కుటుంబాలు వలసెళ్లాయి.
     కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి, మల్లాపురం, కాపర్లపల్లి, పాలవాయి గ్రామాల నుంచి 500 కుటుంబాలు వలసెళ్లాయి.
     కుందుర్పి మండలం మలయనూరు, తూముకుంట, బెస్తపల్లి, ఎనుములదొడ్డి, జంబుగుంపల, ఎర్రగుంట, మహంతపురం పంచాయతీల్లో దాదాపు 1,500 కుటుంబాలు పొట్ట చేతబట్టుకుని వెళ్లాయి.
     వలస వెళ్లిన కుటుంబాలు 6-8 నెలల పాటు అక్కడే ఉంటున్నాయి. మరికొన్ని కుటుంబాలు అంత కంటే ఎక్కువగా గడుపుతున్నాయి.
     గుంతకల్లు మండలం పులగుట్టపల్లి తండాలో 300 కుటుంబాలుంటే  దాదాపు సగం వలసబాట పట్టాయి.
     సోమందేపల్లి, రొద్దం మండలాల్లో 2,500 కుటుంబాలు వలసపోయాయి.
     మడ గూరు మండలం దెందువారిపల్లెలో వంద కుటుంబాలు వలసెళ్లాయి.
 
 నియోజకవర్గం    వలసెళ్లిన  
                               కుటుంబాలు(అంచనా)
 
 కదిరి             6 వేలు
 పెనుకొండ        4500
 రాప్తాడు            4300
 హిందూపురం        3 వేలు
 మడకశిర            3 వేలు
 ఉరవకొండ        3 వేలు
 గుంతకల్లు         4200
 కళ్యాణదుర్గం        4 వేలు
 రాయదుర్గం        3200
 పుట్టపర్తి            4200
 ధర్మవరం            2400
 అనంతపురం        500
 శింగనమల        500
 తాడిపత్రి            500
 మొత్తం కుటుంబాలు    43,300       

 

కరువు, అనంత, సహాయక చర్యలు,
Drought, indivisible, supporting measures
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement