సొంతింటి ఆశలకు ఎసరు
సాక్షి, కాకినాడ :అధికారంలోకి వచ్చింది మొదలు శ్వేతపత్రాల విడుదల.. కమిటీల నియామకం, ఆర్భాటపు ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా ‘సర్వే’ మంత్రం జపిస్తోంది. ఎన్నికల్లో తామిచ్చిన హామీలను గాలికొదిలేసి ఏ పథకానికి నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు లక్షలాది నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన ‘ఇందిరమ్మ’ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. గత ఏడేళ్లుగా గృహనిర్మాణాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిపోయిందంటూ వాటిపై ‘ఇంటిగ్రేటెడ్ సర్వే’ చేయాలని రెండ్రోజుల క్రితం అధికారులను ఆదేశించింది. కొత్తగా ఒక్క రుణం కూడా మంజూరు చేయని తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు గతంలో ఏదో అవినీతి జరిగిపోయిందంటూ భూతద్దం పెట్టి వెతికే ప్రయత్నం చేయడం అన్యాయమని గృహనిర్మాణ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
‘అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు సెంట్లలో రూ. లక్షన్నర వ్యయంతో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం’ ఇది ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటి. ఇప్పుడు ఈ హామీ ఊసెత్తకుండా టీడీపీ సర్కారు ప్రజల దృష్టి మరల్చేందుకు సిద్ధమైంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇందిరమ్మ పథకానికి మార్చి నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. మే నెలలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఈ చెల్లింపులను పునరుద్దరించాల్సి ఉన్నప్పటికీ కోడ్ సమయంలో విధించిన నిషేధాన్ని కొనసాగించడం వల్ల గత ఐదు నెలలుగా రూ.50 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. మరొక పక్క కాంగ్రెస్ హయాంలో మంజూరైన గృహనిర్మాణాలకు సైతం ప్రభుత్వం బ్రేకు లేసింది. గృహ నిర్మాణంపై తమ విధానాన్ని ప్రకటించ కుండా తాత్సారం చేస్తూ ఆ శాఖను నిర్వీర్యం చేసిన బాబు సర్కార్ ఇప్పుడు గత ఏడేళ్లుగా జరిగిన గృహ నిర్మాణంలో అవకతవకలను శోధించే పనిలో పడింది.
గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న థర్డ్ పార్టీ ఏజెన్సీ సర్వేలో గుర్తించిన అనర్హుల జాబితాను బయటకు తీస్తోంది. కనీసం క్షేత్ర స్థాయిలో విచారణ కూడా చేపట్టకుండా ఒకరిద్దరు చెప్పిన సమాచారంపై ఆధారపడి అర్హులను సైతం అనర్హులుగా నిర్ధారించిన థర్డ్ పార్టీ ఏజెన్సీ సర్వే తీరు అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ జాబితాలో సంశయ లబ్ధిదారులు (డౌట్‌ఫుల్ బెనిఫిషియరీస్) పేరిట 16,724 మందిని అనర్హులుగా నిర్ధారించారు. వీరిలో 6306మంది తమ గృహాలను నిర్మించుకోలేదు. మిగిలిన 10,418 మంది అయాచితంగా లబ్ధి పొందారని ఏజెన్సీ అప్పట్లో అభిప్రాయపడింది. ఈ మేరకు రూ.22,43,91,016 మేర దుర్వినియోగమైనట్టుగా లెక్కతేల్చింది. ఇప్పుడు ఈ సొమ్మును రికవరీ చేసే లక్ష్యంతో టీడీపీ సర్కారు ఇంటిగ్రేటెడ్ సర్వేకు సిద్ధమైంది. ఇందుకోసం వారం రోజుల్లో మండల, డివిజన్ స్థాయిలో కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది.
గృహ నిర్మాణ శాఖ డీఈఈ నేతృత్వంలో ఏర్పాటయ్యే మండలస్థాయి కమిటీలో ఎంఆర్‌ఐ, వీఏఓ, ఏఈలు, ప్రత్యేకాధికారి నేతృత్వంలో ఏర్పాటయ్యే డివిజనల్ స్థాయి కమిటీలో ఆర్డీఓ, హౌసింగ్ ఈఈలు సభ్యులుగా ఉంటారు. మండల కమిటీలు ప్రతి గ్రామానికి వెళ్లి ఏజెన్సీ జాబితాలో ఉన్న వారితో పాటు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న గృహనిర్మాణాలను కూడా పరిశీలిస్తాయి. జీయో టాగింగ్ సిస్టమ్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌కు అప్‌లోడ్ చేస్తారు. రేషన్, ఆధార్ సీడింగ్ చేసి రుణం పొందిన వారి అర్హతలు పరిశీలిస్తారు. అనర్హులుగా నిర్ధారిస్తే నోటీసులు జారీచేసి ఆర్ ఆర్ యాక్టు ద్వారా రుణం వసూలుకు చర్యలు తీసుకుంటారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై తీవ్రతను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ నంతటిని అక్టోబర్ 14లోగా పూర్తి చేయాలని, దుర్వినియోగమైన సొమ్ము రికవరీ చేయాలని పేర్కొంది.