సొంతిల్లు కలే..
ఒంగోలు, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇల్లు ఇక కలగా మారనుంది. పేదవాడు సైతం పక్కా ఇంట్లోనే ఉండాలంటూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకానికి కొత్త ప్రభుత్వం మంగళం పాడనుంది. ఇంటి నిర్మాణానికి కిరణ్ సర్కారు ప్రకటించిన రూ.80 వేలకు బదులుగా టీడీపీ తన మ్యానిఫెస్టోలో రూ.1.50 లక్షలు ప్రకటించడంతో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అర్జీలను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గృహ నిర్మాణశాఖలో నెలకొంది. దాదాపు 70 వేల మంది అర్హులుగా గుర్తించినా వారంతా కొత్త ప్రభుత్వంలో మళ్లీ దరఖాస్తు చేసుకోక తప్పదు.
వేలాది దరఖాస్తుల పెండింగ్: ఒక వైపు ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా 2013 నవంబరులో రచ్చబండ-3 ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కనికరిస్తే సొంతింటిలో సేద తీరవచ్చంటూ జిల్లా వ్యాప్తంగా 30 వేల మందికిపైగా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తికాకపోవడం, ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో అధికారులు మిన్నకుండిపోయారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ తొలగిపోయినా కొత్త ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇంటికి ప్రత్యామ్నాయంగా కొత్త పథకం వచ్చే అవకాశం ఉండడంతో పాతవాటిని ఆన్‌లైన్‌లో పెట్టేందుకు అధికారులు వెనకాడుతున్నారు. అయితే రచ్చబండ-1, రచ్చబండ-2లో దరఖాస్తు చేసుకొని ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్
ఉన్నవారి సంఖ్య 43,951 మంది ఉండగా వారిలో కేవలం 2,062 మందికి మాత్రమే రచ్చబండ-3 నిర్వహణ సమయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించారు. అంటే రచ్చబండ-3లో వచ్చిన 30 వేలకు పైగా అర్జీదారులతో కలిపి పెండింగ్ సంఖ్య దాదాపు 72 వేలుగా ఉండడం గమనార్హం.
వై.పాలెం 1,777, దర్శి 5,832, పర్చూరు 5,490, అద్దంకి 5,739, చీరాల 1,838, సంతనూతలపాడు 2,196, ఒంగోలు 1, కందుకూరు 2,543, కొండపి 3,596, మార్కాపురం 4,327, గిద్దలూరు 5,308, కనిగిరి 5,304 మంది రచ్చబండ -3 నాటికి సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఎస్సీ 10,190, ఎస్టీలు 1331, మైనార్టీలు 2235, ఇతరులు 30,195 మంది ఉన్నారు. వీటిలో రచ్చబండ-3 కార్యక్రమం జరిగిన సమయంలో పర్చూరు 725, కందుకూరు 888, కొండపి 289, మార్కాపురం 160 మంది నియోజకవర్గాల వారీగా కొత్త ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంటే రచ్చబండ-3వ విడత కార్యక్రమంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సంఖ్య 2062 మాత్రమే. ఇంకా 41,889 మంది మొదటి, రెండో విడత రచ్చబండల్లో అర్హులుగా గుర్తింపు పొంది మంజూరు కోసం ఎదురు చూస్తుండడం గమనార్హం. వీరికి మూడో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న మరో 30 వేల మంది అదనం. ఇవి కాకుండా మరో 28 వేల ఇందిరమ్మ ఇళ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.
దీనిపై గృహనిర్మాణ శాఖ పీడీ ధనుంజయుడు స్పందిస్తూ ప్రస్తుతం గతంలో మంజూరై నిర్మాణాలు కొనసాగిస్తున్న వాటికి మాత్రం బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. రచ్చబండ-3కి సంబంధించి ఇంకా గ్రామస్థాయి నివేదికలు తమకు అందలేదని తెలిపారు.