పాశవికం
► కలకలం రేపిన దంపతుల హత్య
► మృగాలను మరపించిన దుండగులు
► పోలీసు జాగిలం, క్లూస్ టీం బృందం నిశిత పరిశీలన
► మంట కలసిపోతున్న మానవ సంబంధాలు
► నిందితులను పట్టుకుని తీరుతాం : పోలీసులు
రేణిగుంట: అమావాస్య చీకటిలో ఊహకందని విషాదం. దుం డగులు మానవ మృగాలుగా మారి కళ్లెదుటే భర్తను దారుణంగా హతమార్చారు. ఆపై ఆరు పదుల వయస్సున్న వృద్ధురాలిని కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి పాశవికంగా కామవాంఛ తీర్చుకుని ఊపిరి తీశారు. ఈ హృదయ విదారక సంఘటన రేణిగుంట మండలం ఆర్.మల్లవరం సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
ఊరుగాని ఊరొచ్చి..
పూతలపట్టుకు చెందిన కొత్తపల్లి శీనయ్య(65), ఇందిరమ్మ(58) దంపతులకు కుమారులు రాజశేఖర్, కుమార్, కుమార్తె కళావతి ఉన్నారు. వీరు 30 ఏళ్ల క్రితం రేణిగుంట మండలానికి వచ్చి స్థిరపడ్డారు. పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. పంట చేలు, మామిడి తోటల్లో కాపలా ఉంటూ పొట్టపోసుకుంటున్నారు. ఏడాది క్రితం సమీపంలోని గుత్తివారిపల్లె గిరిజనకాలనీలో ఇంటి స్థలం ఇవ్వడంతో అక్కడే ఓ గుడిసె ఏర్పాటు చేసుకున్నారు. వారి సమీపంలోనే పెద్ద కుమారుడు రాజశేఖర్ కుటుంబం, కూతురు కళావతి, ఆమె భర్త వెంకటేశు కాపురముంటున్నారు. రెండు నెలల క్రితం నుంచి ఆర్.మల్లవరం సమీపంలోని సదాశివరెడ్డి పొలాల వద్ద కాపలా ఉంటున్నారు. వీరికి నెలకు రూ.5 వేలు ఇస్తున్నారు. గత గురువారం శీనయ్య తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో పూతలపట్టుకు వెళ్లి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. పొలం వద్ద కాపలా ఉండాల్సి రావడంతో శీనయ్య శుక్రవారం గుత్తివారిపల్లెకు చేరుకుని అక్కడి నుంచి పనికి కుదిరిన పంపు షెడ్డు వద్ద వెళ్లాడు. పూతలపట్టు నుంచి ఆదివారం మధ్యాహ్నం గుత్తివారిపల్లెకు చేరుకున్న శీనయ్య భార్య ఇందిరమ్మ ఇంట్లో భర్త లేకపోవడంతో మల్లవరంలోని పంపు షెడ్డు వద్దకు వచ్చింది. సాయంత్రం ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. ఇటీవలే శీనయ్య పాముకాటుకు గురై పత్యం ఉండడంతో ఇంట్లో వండిన చేపలకూర పెట్టలేదని అలిగి రాత్రి 8 గంటలకు పంపు షెడ్డుకు బయలుదేరాడు. అతనితోపాటు భార్య కూడా వెళ్లింది. ఇద్దరూ అక్కడే పడుకున్నారు.
అతి కిరాతంగా హతమార్చిన వైనం
రాత్రి వెళ్లిన తల్లిదండ్రులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని సోమవారం ఉదయం సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, అర్బన్ సీఐ బాలయ్య, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరూ గదిలో చాపపై పడుకున్న చోటే రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. దుండగులు తొలుత ఎలుకలు పట్టేందుకు వినియోగించే ఇనుప గునపంతో శీనయ్య తలపై మోది హత్య చేశారు. అనంతరం అతని భార్య ఇందిరమ్మను వివస్త్రను చేసి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. గోడ చువ్వలకు తాళ్లను బిగించి విచక్షణా రహితంగా అత్యాచారం చేసి ఆపై తలపై కొట్టి చంపినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. పోలీసు జాగిలం అక్కడి నుంచి గది వెనుకకు వెళ్లి మృతుల అల్లుడు వెంకటేశు కూర్చున్న చోట కాసేపు ఆగింది. అక్కడి నుంచి హైవేపై పరుగులు తీసి సమీపంలో ఉన్న మల్లవరం ఎస్టీ కాలనీలోకి వెళ్లింది. పోలీసులు మృతుల అల్లుడు వెంకటేశును విచారించారు. అలాగే గదిలో హత్యకు వినియోగించిన గునపాన్ని, మూడు మందు బాటిళ్లను, సెల్‌ఫోనును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.