సాక్షి, ఖమ్మం: సంక్షేమ పథకాల్లో అక్రమాలకు కళ్లెం వేసే దిశగా ఒక్కో పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డులు, భూదాన్, దేవాలయ భూముల ఆక్రమణలపై కొరడా ఝుళిపించింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించడంతో అధికారుల్లో దడ పుడుతోంది. మన ఊరు..మన ప్రణాళికలో బిజీగా ఉన్న జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాలతో వీటన్నింటిపై వచ్చేనెలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
‘ఇందిరమ్మ’పై విచారణ..
ఇందిరమ్మ పథకం మూడు దశల్లో జిల్లాకు 4.22 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 2.22 లక్షల ఇళ్లు పూర్తి కాగా మరో 64 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. 1.14 లక్షల ఇళ ్ల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. అయితే గత నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇళ్ల నిధులు పక్కదారి పట్టాయి. బోగస్ లబ్ధిదారులతో పాటు అసలు ఇళ్లే నిర్మించకుండా నిధుల స్వాహా పర్వం యథేచ్ఛగా కొనసాగింది.
మొత్తం మీద రూ.3.69 కోట్లు స్వాహా అయినట్లు తేలింది. ఈ వ్యవహారంలో 80 మంది ఆ శాఖ సిబ్బంది భాగస్వాములని తేలిపోయింది. అయినా ఇప్పటి వరకు 13 మంది ఏఈలు, 6 రెగ్యులర్, 4 అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల ఒత్తిడితో ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న మిగతా అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి ఆ శాఖ ఉన్నతాధికారులు వెనకాడుతున్నారు.
అయితే అక్రమాలపై నిఘా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిన అవినీతిని మళ్లీ తోడాలని నిర్ణయించడంతో ఇందులో సంబంధం ఉన్న వారి గుండెలు గుభేల్ మంటున్నాయి. వచ్చేనెల రెండో వారంలో సీబీసీఐడీ పర్యవేక్షణలో జిల్లాలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల వివరాలు సేకరించనుండడంతో ఏం జరుగుతుందోనని ఆశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో బోగస్ ఇళ్లు తేలితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని భయపడుతున్నారు.
ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి..?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణపై కొత్త సర్కారు సీరియస్ కావడంతో జిల్లాలో అసలు ఎక్కడెక్కడ ప్రభుత్వ, దేవాలయ, భూదాన్, వక్ఫ్ భూములు ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు పాత రికార్డులను తిరగేస్తున్నారు. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో వేల ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలున్నాయి.
మండలాల వారీగా ప్రభుత్వ భూమి ఎంత ఉంది, అక్కడ ప్రభుత్వ పరంగా ఎవరికైనా ఇచ్చారా..? ఎంత మేరకు ఆక్రమణకు గురైంది అనే వివరాలను పంపాలని ఇప్పటికే జిల్లా అధికారులు తహశీల్దార్లను ఆదేశించారు. అలాగే దేవాలయ భూములు కూడా అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో 206 ఆలయాలకు చెందిన 14 వేల ఎకరాల భూమి ఉంది. వీటిపై ఆశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భూములను ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న వారు తమ భూములే అన్నట్లుగా స్వాధీనం చేసుకున్నారు. దీంతో వెయ్యి ఎకరాలకు పైగా దేవాలయ భూములు అన్యాక్రాంతమైనట్లు సమాచారం.
భూదాన్ ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం రద్దు చేయడంతో జిల్లాలో ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 వేల ఎకారాలున్న ఈ భూములు కూడా చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. అలాగే వక్ఫ్ భూముల ఆక్రమణపై ప్రభుత్వం కన్నెర్ర జేయడంతో ఈ భూముల విషయంలో చర్యల పర్వం ఎవరిమెడకు చుట్టుకుంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు.
వచ్చే నెల డెడ్‌లైన్..
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల్లో బోగస్ ఏరివేత.. ప్రభుత్వ, దేవాలయ, భూదాన్, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా శాఖల అధికారులు ఈ పనుల్లో తలమునకలయ్యారు. ఉన్న భూములు ఎన్ని ఎకరాలు, ఆక్రమణకు గురైనవి ఎన్ని..? అని క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మండల స్థాయి అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు.
ఇప్పటికే మన ఊరు.. మనప్రణాళికలో బిజీగా ఉన్న జిల్లా యంత్రాంగం ఈ నివేదికలను వచ్చే నెలలో ప్రభుత్వానికి ఇవ్వడానికి కుస్తీ పడుతోంది. నివేదికు తయారు చేయడమే కాకుండా వాటిని పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్డ్ చేస్తే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో సీబీసీఐడీ విచారణ, బోగస్ రేషన్‌కార్డుల ఏరివేత, భూముల అన్యాక్రాంతం నివేదికలు రూపొందుతుండడంతో ఇందులో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది వచ్చే నెలలో తమ జాతకాలు ఎలా ఉంటాయోనని టెన్ష్‌న్ పడుతున్నారు.
అక్రమాలపై నిఘా
Published Mon, Jul 28 2014 2:21 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement