
హౌసింగ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్‌ఆర్ సీపీ అండ
ఒంగోలు అర్బన్ : గృహనిర్మాణ సంస్థ(హౌసింగ్)లో విధుల నుంచి తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా సోమవారం 13వ రోజుకి చేరింది. ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఎంపీ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇందిరమ్మ పథకంలో భాగంగా నియమించిన ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం టీడీపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. అన్ని శాఖల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగిస్తూ ఒక్క హౌసింగ్‌లోనే తొలగించడం ఏంటని ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల 13 జిల్లాల్లో 2,250మంది కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. ఆందోళన 12రోజుల నుంచి చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, ఈ విషయాన్ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలోనూ చర్చించే విధంగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హౌసింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు నరాల రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, దుంపా చెంచిరెడ్డి ఉన్నారు.
ఆకులు మేస్తూ నిరసన
ప్రభుత్వ మొండి వైఖరి వీడి తమను విధుల్లోకి తీసుకోకపోతే తమ కుటుంబాలు ఆకులు తిని బతకాల్సి వస్తుందనే సంకేతాలు వచ్చేలా ఆకులు తింటూ ఉద్యోగులు నిరసన తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ జిల్లా జాయింట్ సెక్రటరీ మహ్మద్ యాసిన్, ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. బాలచంద్రం పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో హౌసింగ్ యూనియన్ నాయకులు ఎన్. ఆదినారాయణ, పి. మస్తాన్‌రావు, ఆర్ ఉదయ్‌కుమార్, పున్నారావు, తిరుమలరావు, బి.వి. నాయక్ ఎస్.వి. శైలజ, అనురాధ, నాగలక్ష్మి, శోభన పాల్గొన్నారు.