గృహనిర్మాణ శాఖకు ‘ఇందిరమ్మ’ గుబులు పట్టుకుంది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో
అక్రమాలపై సీఎం సీరియస్
కేసులు నమోదు చేస్తారేమోనని భయం
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ బాధ్యత ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయం
భవిష్యత్తు కార్యాచరణపై
సిబ్బంది భేటీకి నిర్ణయం
హైదరాబాద్: గృహనిర్మాణ శాఖకు ‘ఇందిరమ్మ’ గుబులు పట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలకు బాధ్యులను చేసి ఒకేసారి పెద్దమొత్తంలో కేసులు నమోదు చేస్తారనే ప్రచారం జరుగుతుండడంతో అధికారులు, సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. కొత్తగా చేపట్టబోయే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ బాధ్యతను గృహనిర్మాణ శాఖకు అప్పగించొద్దనే దిశలో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు దీనికి బలం చేకూరుస్తోంది. గతంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని గట్టిగా నమ్ముతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
తమకు అందిన ఆధారాల ఆధారంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి సీఐడీ దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. అందులో అక్రమాలు నిజమేనని తేలడంతో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో గృహనిర్మాణ శాఖ అధికారులకు బాధ్యత అప్పగించొద్దని సీఎం నిర్ణయించారనే సమాచారం గృహనిర్మాణ శాఖకు అందింది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో దీనిపై ముఖ్యమంత్రి పరోక్షంగా సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే.
రెండు పడక గదుల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దానికి భారీ వ్యయం అవుతుండడంతో నిధుల సమీకరణపై తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో అందులో అక్రమాలు జరిగితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న ముఖ్యమంత్రి... అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బందికి దాని బాధ్యత అప్పగించొద్దని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి మచ్చపడ్డ వారి సంఖ్య పెద్దదేనని ఆయన దృష్టికి రావడంతో వారిని ఆ బాధ్యత నుంచి తప్పించే క్రమంలో... అసలు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో గృహనిర్మాణ శాఖ నేరుగా జోక్యం చేసుకోకుండా చూస్తున్నారు. వీటన్నింటిని గమనిస్తున్న ఆ శాఖ అధికారులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. భారీ సంఖ్యలో సిబ్బందిపై కేసులు నమోదు చేయడం ద్వారా అవినీతికి పాల్పడుతున్న వారిలో భయం కలిగించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని వారు దాదాపు నిర్దారణకు వచ్చారు.
ఎమ్మెల్యేలతో సీఎంపై ఒత్తిడి...!
ఈ నేపథ్యంలో త్వరలో గృహనిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది సమావేశం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు వారు ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి చేయించాలనే కోణంలో ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అనవసరంగా తమపై అవినీతి ముద్రపడుతోందని, చోటుచేసుకున్న అక్రమాల్లో నేతల ప్రమేయమే ఎక్కువని, కొన్నిచోట్ల లబ్ధిదారులు కూడా తమను తప్పుదారి పట్టించారని చెప్పాలని యోచిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో టీఎన్‌జీవో నేత దేవీప్రసాద్ కాస్త దూరమవడం కూడా తమకు అండ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.