రెవెన్యూ పరమైన అంశాల జోలికి ఇప్పట్లో వెళ్లొద్దని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉత్తర్వు జారీ
మొదటి విడతలో ఇల్లు పొందాలంటే సొంత జాగా ఉండాల్సిందేనని స్పషీ్టకరణ
ప్రజా పాలనలో ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన సర్కారు
సొంత జాగా లేనివారు 30 లక్షల మంది ఉన్నట్టుగా తేలిన వైనం
ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా సొంతింటి కోసం వేచిచూడాల్సిన పరిస్థితి
పథకం తొలి విడతలో రాష్ట్రంలోని చిన్న గ్రామాలకే ప్రాధాన్యం
ఏడాది కాలంలో లక్ష ఇళ్ల నిర్మాణం! ఆ మేరకు నిధులు సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సొంత స్థలం లేని నిరుపేదలకు ఇప్పట్లో ‘ఇందిరమ్మ గృహ’ వసతి అందే సూచనలు కనిపించటం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో రెవెన్యూ పరమైన అంశాల జోలికి వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం అవసరమైన పట్టాల పంపిణీ ఇప్పట్లో జరిగేలా లేదు. పథకం ప్రారంభించడానికి ఒకరోజు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.
మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా సొంత జాగా కలిగి ఉండాలని అందులో పేర్కొంది. తద్వారా సొంత స్థలాలు లేని వారికి ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లేదనే స్పష్టతనిచ్చింది. ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు 66 లక్షలుగా ఉన్నట్టు ప్రాథమికంగా తేల్చింది. ఇందులో 30 లక్షల మందికి సొంత జాగా లేదని కూడా తేలినట్టు సమాచారం. కాగా వారందరికీ ప్రభుత్వం తొలుత భూమి పట్టాలు జారీ చేసి ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. సొంత స్థలాలు లేని వీరంతా తదుపరి విడత కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
లక్ష ఇళ్లపైనే దృష్టి: ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఏడాది కాలంలో లక్ష ఇళ్లకు మించి పూర్తి కావని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తొలుత ఆ లక్ష ఇళ్లకు సరిపడా నిధులు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రక్రియ కాస్తా పూర్తయి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అంటే జూలైలో ఈ ప్రక్రియ ఊపందుకుంటుంది. గ్రామ సభలు నిర్వహించి అర్హుల ఎంపిక పూర్తి అయ్యేసరికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
అప్పటికి కూడా వానాకాలం కొనసాగనున్నందున అక్టోబర్ తర్వాత గాని ఆ ప్రక్రియలో వేగం పెరగదు. అయితే వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు కొన్ని సొంత నిధులు కలిపి లబ్ధిదారులు పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొన్ని కుటుంబాల్లో అర్థికపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది. అలాంటి వారి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. ఈలోపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో వచ్చే మార్చిలోపు కొన్ని ఇళ్లకే పూర్తి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అలా దాదాపు లక్ష ఇళ్లకే నిధులు అందించాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది.
నిధులు సిద్ధం!
లక్ష ఇళ్లకు రూ.5 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుంది. హడ్కో నిధుల కోసం గతంలోనే ప్రభుత్వం దరఖాస్తు చేయగా, ప్రస్తుతం రూ.3 వేల కోట్ల రుణం మంజూరైంది. ఇందులో రూ.1,500 కోట్లు మాత్రమే ఇప్పుడు విడుదల కానున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మొదటి కిస్తీగా రూ.1,000 కోట్లు మంజూరవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వెరసి రూ.2,500 కోట్లు అందుబాటులో ఉన్నట్టవుతుంది. కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధంగా లక్ష ఇళ్లకు నిధులు దాదాపు సిద్ధంగా ఉన్నట్టుగానే ప్రభుత్వం భావిస్తోంది.
తక్కువ ఇళ్లే ఇచ్చినా ఎక్కువ శాతం కన్పించేలా..
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తొలుత చిన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ జనాభా ఉండే ప్రాంతాలను గుర్తించి, వాటిల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఆయా గ్రామాల్లో తక్కువ ఇళ్లనే అందించినా.. ఆ గ్రామ జనాభా, మంజూరు చేసిన ఇళ్ల దామాషాను చూస్తే ఎక్కువ శాతం ఇళ్లను కేటాయించినట్టు లెక్కలు కనిపిస్తాయి. అదే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు ఇచ్చే ఇళ్ల సంఖ్యను, ఆ ప్రాంత జనాభాను పరిగణనలోకి తీసుకుంటే తక్కువ ఇళ్లు కేటాయించినట్టుగా కన్పిస్తుంది. దీన్ని గమనంలో ఉంచుకునే తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment