
‘ఇందిరమ్మ’పై నిఘా నేత్రం
జియోటాగింగ్ విధానం అమలుకు సన్నాహాలు
లబ్ధిదారుల వివరాలు,
నిర్మాణాల తీరు ‘ఆన్‌లైన్’
ఆధార్‌కార్డుతో అనుసంధానం తప్పనిసరి
ఎప్పుడో నిర్మించిన ఇంటికి ఇందిరమ్మ బొమ్మ వేసి బిల్లులు చేసుకోవడం.. అసలు లబ్ధిదారునికి తెలియకుండా బినామీ పేర్లతో నిధుల స్వాహా.. రెండు, మూడు పేర్లతో విలాసవంతమైన భవనాల నిర్మాణం.. ఇదీ కొంత కాలంగా ఇందిరమ్మఇళ్ల నిర్మాణంలో సాగుతున్న తీరు. పేదలకు చెందాల్సిన రూ.వందల కోట్లు అక్రమార్కుల ఖాతాల్లోకి చేరాయి. ప్రతీ పేదవాడికి గూడు కల్పించాలన్న అత్యున్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకంలో గూడుకట్టుకున్న అవినీతిని కూకటివేళ్లతో పెకలించే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జియోటాగింగ్ విధానంతో వివరాలను ‘ఆన్‌లైన్’లో నిక్షిప్తానికి సిద్ధమవుతున్నారు.
విశాఖ రూరల్ : ఇందిరమ్మ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 7,04,677 ఇళ్లు మంజూరయ్యాయి. మూడు విడతలుగా పథకాన్ని అమలు చేయగా.. నిర్దేశించుకున్న లక్ష్యాలు మాత్రం పూర్తికాలేదన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికీ 82,804 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ఈ నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.891.49 కోట్లు విడుదల చేసింది. ఈ పథకంలో అవినీతి సర్వసాధారణమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కయి రూ.కోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. ఏడాది క్రితం అధికారుల లెక్కల్లో 32,244 ఇళ్లు అక్రమంగా నిర్మించినట్టు నిగ్గుతేల్చారు. రూ.వందల కోట్లు పక్కదారి పట్టగా.. రెవెన్యూ రికవరీ యాక్ట్(ఆర్‌ఆర్) ప్రయోగించి ప్రజాధనాన్ని వెనక్కు తెస్తామని అధికారులు చెప్పినప్పటికీ.. అదీ నామమాత్రమైంది.
ఆధార్‌తో అనుసంధానం : అక్రమాలను అరికట్టేందుకు ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి ఆధార్ వివరాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి నెలాఖరుకు ఆధార్ అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ ప్రక్రియ వేగవంతానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పదేళ్లుగా జరిగిన కేటాయింపులకు సంబంధించి లబ్ధిదారుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడ ం ద్వారా మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశాలున్నాయి. దీంతో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుతో ఆన్‌లైన్ సీడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
కొత్తగా ‘జియో టాగింగ్’ : ఇందిరమ్మఇళ్ల నిర్మాణంలో మోసాలు చోటుచేసుకోకుండా ఇక నుంచి ప్రభుత్వం జియోటాగింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అల్పాదాయ కుటుంబాలన్నింటికీ రేషన్‌కార్డుతో పాటు ఆధార్‌కార్డులున్నాయి. వాటి ఆధారంగా గృహాలు మంజూరు చేసి.. జీపీఆర్ విధానంలో ఆ వివరాలు నమోదు చేయనున్నారు. ప్రతీ ఇంటి ఫొటోను కంప్యూటర్‌లో లోడ్ చేసి ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణ తీరును పరిశీలించనున్నారు. బిల్లుల చెల్లింపులు పారదర్శకంగా ఉండేలా జీపీఆర్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అక్రమాలకు కళ్లెం వే సి పూర్తి స్థాయిలో పారదర్శకంగా పేదలకు పక్కాఇల్లు మంజూరుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.