- కౌంసల్యాదేవిపల్లిలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల పరిశీలన
- మంజూరైన గృహాల్లో 85శాతం అవినీతి
- సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ వెల్లడి
నర్సింహులపేట : మండలంలోని కౌంసల్యాదేవిపల్లి గ్రామంలో ‘ఇందిరమ్మ’ పథకం అక్రమాలపై సీఐడీ చేపట్టిన విచారణ సోమవారం ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌంసల్యాదేవిపల్లిలో ఇందిరమ్మ పథకం మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలపై సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, హెచ్‌సీలు 10 బృందాలుగా వెళ్లి విచారణ చేపట్టారు.
గ్రామంలో 433 ఇళ్లు మంజూరుకాగా మొదటి రోజు 172, రెండవ రోజు 261 ఇళ్లను తనిఖీ చేశారు. ఈగ్రామంతో పాటు రూప్లాతండాలో మంజూరైన ఇళ్లను సైతం పరిశీలించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పోజిషన్, ఎంత బిల్లు వచ్చింది, ఎంత సిమెంట్ వచ్చింది, రేషన్‌కార్డు, బ్యాంక్ పాసుబుక్కు, లబ్ధిదారు అర్హుడా, అనర్హుడా, బిల్లు ఇప్పించిన వారి వివరాలను నమోదు చేసుకున్నారు. రికార్డుల్లో బిల్లు మొత్తం ముట్టినట్లు ఉన్న లబ్ధిదారులు మాత్రం మొత్తం డబ్బు తమకు ముట్టలేదని అధికారులకు విన్నవించారు.
85శాతం అవినీతి
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ అన్నారు. విచారణ పూర్తికాగానే సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. గ్రామానికి మంజూరైన ఇళ్లలో 85 శాతానికి పైగా అవినీతి జరిగిందని పరిశీలనలో తేలినట్లు పేర్కొన్నారు. సమగ్ర విచారణ పూర్తి కాగానే అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువగా పాత ఇళ్లపైన, ఒకే పేరు మీద రెండు సార్లు, ఇళ్లు కట్టకుండానే, ఊళ్లో లేని వారి పేర్ల మీద, ఇళ్లు పూర్తి చేయకుండానే డబ్బులు తీసుకున్నవి ఉన్నాయని వివరించారు.
ఇళ్లు, మనుషులు లేకుండా 30 వరకు బిల్లులు తీసుకున్నారని తెలిపారు. డబ్బులతో పాటుగా సిమెంటులోనూ ఎక్కువగా అక్రమాలు జరిగాయని చెప్పారు. మండలంలో పెద్దనాగారంతో పాటుగా భూపాలపల్లి మండలంలోని రెండు గ్రామాలలోనూ తనిఖీలు చేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు వివరించా రు. తనిఖీల్లో సీఐలు కరుణాసాగర్‌రెడ్డి, విజయ్‌కుమార్, రాజేంద్రప్రసాద్, సిబ్బంది చల్లా యాదవరెడ్డి, జబ్బార్, సూర్యప్రకాశ్, హౌసింగ్ డీఈ రవీందర్, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.