చీరాల: అవినీతికి, అక్రమాలకు కాదేది అనర్హం అన్నట్లు విద్యాశాఖ వ్యవహరిస్తోంది. విద్యాశాఖలో ఇప్పటికే అనేక అవినీతి వ్యవహారాలు బట్టబయలైనా సిబ్బందిలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ శాఖలో మరో అక్రమ వ్యవహారం బయటపడింది. బస్సు సౌకర్యం లేని గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున విద్యాశాఖ ప్రతి విద్యార్థికి చెల్లిస్తుంది. జిల్లాలో ప్రధానంగా పర్చూరు ప్రాంతంలో పాఠశాలలకు, గ్రామాలకు మధ్య చాలా దూరం ఉండడంతో విద్యార్థులు వ్యయప్రయాసలతో చదువుకోవాల్సి వస్తుంది. వీరి కోసం విద్యాశాఖ ఇటువంటి అవకాశం కల్పించింది. చీరాల నియోజకవర్గంలో పాఠశాలలన్నీ కిలోమీటరు దూరంలోనే ఉండి బస్సు సౌకర్యం కూడా ఉన్నప్పటికీ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు నయాపైసా కూడా చెల్లించకుండానే పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ కలిసి సొమ్ము స్వాహా చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. 2017–18 విద్యా సంవత్సరంలో వేటపాలెం మండలం నాయనిపల్లి పడమర స్కూల్‌లో 41 మంది విద్యార్థులకు దూర ప్రాంతం నుంచి వస్తున్నట్లుగా, వారికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనట్లుగా రికార్డుల్లో సృష్టించి రూ.1.68 లక్షల నిధులు మింగేశారు. అయితే ఇక్కడ కిలోమీటరులోపే ప్రాథమిక పాఠశాల ఉంది. కానీ ఎక్కువ దూరం ఉన్నట్లుగా చూపించి డబ్బులు కాజేశారు. అలానే దేశాయిపేటలో 30 మంది విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని, రవాణా సౌకర్యం కింద రూ.90 వేలు డ్రా చేసి విద్యార్థులకు దక్కనివ్వలేదు. వేటపాలెం ఓఆర్‌ఎస్ (ప్రాథమిక పాఠశాల) ఏడుగురు విద్యార్థులకు రవాణా సౌకర్యం కింద రూ.12,900, కొత్తపేట యానాది సంఘం యూపీ స్కూల్‌లో రవాణా సౌకర్యం కింద తొమ్మిది మంది విద్యార్థులకు మొత్తం రూ.15,900 చొప్పున మొత్తం కలిపి రూ.2,25,600 గత మార్చిలో డ్రా చేసి బిల్లులన్నీ స్వాహా చేశారు.
నిబంధనలు ఇవీ...
ఈ జీవో ప్రకారం మండల పరిధిలోని కిలోమీటరు దూరంలో ఎటువంటి ప్రభుత్వ పాఠశాల లేకుండా ఆ పాఠశాలలోని వారు కిలోమీటరు పక్కన ఉన్న పాఠశాలలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రవాణా సౌకర్యం కింద రూ.300 చెల్లించాల్సి ఉంది. అది కూడా బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు మాత్రమే. ఆర్టీసీ బస్సు పాసులు అందించాలనే నిబంధన ఉంది. అలానే యూపీ పాఠశాల విద్యార్థులకు 2 కిలోమీటర్లు దాటి మరో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి రవాణా సౌకర్యం చొప్పున ప్రతి విద్యార్థికి రూ.300 చెల్లిస్తుంది. అలానే హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు మూడు కిలోమీటర్లు దాటి వెళున్న వారికి రూ.300 చొప్పున అందిస్తుంది. వేటపాలెం మండలంలో ప్రతి కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాల, రెండు కిలోమీటర్లలో యూపీ స్కూల్స్, మూడు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్ ఉన్నాయి. చివరకు చీరాల నుంచి ఒంగోలుతో పాటు ఈ పాఠశాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంది. అయినా దూర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు నమ్మించారు.
బయటపడిందిలా...
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పడిపోవడంతో బడిబాట పేరుతో విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలని విద్యాశాఖ ఆదేశించింది. అలానే విద్యార్థుల సంఖ్య తగిన రీతిలో లేకపోతే ఆ పాఠశాలను తొలగిస్తున్నారు. దీంతో విద్యాసంవత్సరం మొదటి సంవత్సరంలోనే ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను చేర్పించేందుకు మొదటలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరు రూ.500లు చొప్పున ఖర్చు పెట్టి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఆటోలు ఏర్పాటు చేశారు. అయితే రవాణా చార్జీల కింద వచ్చిన నిధులలో ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.500 ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుడికి, ప్రధానోపాధ్యాయుడికి మధ్య వివాదం తలెత్తడంతో ఈ అవినీతి వివాదం బట్టబయలైంది.
ఎంఈఓ ఏమంటున్నారంటే....
వేటపాలెం మండల ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు ఈ అక్రమ వ్యవహారంపై మాట్లాడుతూ విద్యార్థులకు రవాణా కింద చెల్లించాల్సిన నగదు దుర్వినియోగం అయినట్లు తన దృష్టికి వచ్చిందని, దానిపై విచారిస్తున్నట్లు తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థుల సొమ్ముకు వేశారు కన్నం
Published Wed, Jul 18 2018 12:34 PM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment