దేవరాజుగట్లు చెరువు
యర్రగొండపాలెం (ప్రకాశం): ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయాభివృద్ధి పథకం కింద మంజూరైన నిధులు కాజేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ పనులకు సంబంధించి గతనెలలో బాక్సు టెండర్లను టీడీపీ వర్గీయులతో వేయించి ఇప్పుడిప్పుడే ఆ పనులకుగాను అగ్రిమెంట్లు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. సహజంగా రోడ్లు, భవనాల శాఖ రూ.1 లక్ష పనులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు రూ.5 లక్షల మేరకు పనులకు ఆన్‌లైన్ టెండర్లను వేయాల్సి ఉంటుంది. ఈ టెండర్లలో రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు పాల్గొనవచ్చు అనే నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా జిల్లాలో ఈ టెండర్ల ప్రక్రియను పూర్తిగా మార్చివేశారు.
కోట్లాది రూపాయల ప్రజల సొత్తును టీడీపీ నాయకులకు కట్టబెట్టడానికి బాక్సు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు వేయటానికి కాంట్రాక్టర్లు షెడ్యూల్ దాఖలు చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పనులకు గాను టెండర్లు మరో విధంగా వేశారు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి తన అధికారాన్ని ఉపయోగించి షెడ్యూల్‌ను తనకు అనుకూలంగా ఉన్న టీడీపీ వర్గీయులకే అందేలా చర్యలు తీసుకున్నారు. అందుకుగాను టెండరు దక్కించుకున్న టీడీపీ నేత ఆయనకు 10 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉందని నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన నాయకులే చర్చించుకుంటున్నారు. సింగిల్ టెండర్ అయితే నిబంధనలను పూర్తిగా వ్యతిరేకించిన వారవుతారన్న ఉద్దేశంతో మరో ఫాల్ట్ టెండర్‌ను వేయించారు.
ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు : ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే, ఎస్‌ఎన్‌పాడు
ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయ అభివృద్ధి పథకం కింద మంజూరైన ఈ పనులు 100 ఎకరాలకుపైబడి ఉన్న చెరువులలో మాత్రమే చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొ దటి విడత కింద 3 చెరువులకు రూ.7.70 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పెద్దదోర్నాల మండలంలోని వై.చెర్లోపల్లి చెరువు అభివృద్ధికి రూ 3.70 కోట్లు, పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె చెరువుకు రూ.2.50 కోట్లు, దేవరాజుగట్టు, పెద్దారవీడు చెరువులకు ఒకే ప్యాకేజి కింద రూ.1.50 కోట్లు ప్రకారం మంజూరయ్యాయి. ఈ నిధులు కాజేయటానికి అధికార పార్టీకి చెందిన నాయకులు పోటీపడ్డారు. అయితే తనకు అత్యంత సన్నిహింతంగా ఉండేవారితో మాత్రమే నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఈ టెండర్లు వేయించారని ఆరోపణలు వినవస్తున్నాయి.
అప్పనంగా ప్రజల సొత్తును కాజేయటానికి అధికార పార్టీకి చెందిన వారు ప్రయత్నిస్తున్నారు. దీనివలన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. జిల్లాలో చెరువులకు రూ.37 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులకు ఆన్‌లైన్ టెండర్లు పిలువాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు బాక్సు టెండర్లను పిలవడం శోచనీయం. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెరువులకు మంజూరైన రూ.7.70 కోట్ల పనులకు సింగిల్ టెండర్లు మాత్రమే వేయించుకున్నారు.
కంటి తుడుపుగా మరొకరితో తప్పుడు టెండరు వేయించారు. షెడ్యూల్ కూడా టీడీపీ వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకే ఇచ్చారు. అగ్రిమెంట్లు జరగకుండా రాష్ట్ర నీటిపారుదల మంత్రి, చీఫ్ ఇంజినీరు చర్యలు తీసుకోవాలి. ఈ టెండర్లపై సమగ్రంగా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే 100 ఎకరాలలోపు ఉన్న చెరువులలో నీరు – చెట్టు పథకం కింద కోట్లాది రూపాయలు కాజేశారు. చెరువులను ఆడ్డంగా పెట్టుకొని టీడీపీ జేబులు నింపుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment