niru chettu works
-
చెరువుల పేరుతో లూటీ
యర్రగొండపాలెం (ప్రకాశం): ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయాభివృద్ధి పథకం కింద మంజూరైన నిధులు కాజేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ పనులకు సంబంధించి గతనెలలో బాక్సు టెండర్లను టీడీపీ వర్గీయులతో వేయించి ఇప్పుడిప్పుడే ఆ పనులకుగాను అగ్రిమెంట్లు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. సహజంగా రోడ్లు, భవనాల శాఖ రూ.1 లక్ష పనులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు రూ.5 లక్షల మేరకు పనులకు ఆన్లైన్ టెండర్లను వేయాల్సి ఉంటుంది. ఈ టెండర్లలో రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు పాల్గొనవచ్చు అనే నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా జిల్లాలో ఈ టెండర్ల ప్రక్రియను పూర్తిగా మార్చివేశారు. కోట్లాది రూపాయల ప్రజల సొత్తును టీడీపీ నాయకులకు కట్టబెట్టడానికి బాక్సు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు వేయటానికి కాంట్రాక్టర్లు షెడ్యూల్ దాఖలు చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పనులకు గాను టెండర్లు మరో విధంగా వేశారు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి తన అధికారాన్ని ఉపయోగించి షెడ్యూల్‌ను తనకు అనుకూలంగా ఉన్న టీడీపీ వర్గీయులకే అందేలా చర్యలు తీసుకున్నారు. అందుకుగాను టెండరు దక్కించుకున్న టీడీపీ నేత ఆయనకు 10 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉందని నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన నాయకులే చర్చించుకుంటున్నారు. సింగిల్ టెండర్ అయితే నిబంధనలను పూర్తిగా వ్యతిరేకించిన వారవుతారన్న ఉద్దేశంతో మరో ఫాల్ట్ టెండర్‌ను వేయించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు : ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే, ఎస్‌ఎన్‌పాడు ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయ అభివృద్ధి పథకం కింద మంజూరైన ఈ పనులు 100 ఎకరాలకుపైబడి ఉన్న చెరువులలో మాత్రమే చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొ దటి విడత కింద 3 చెరువులకు రూ.7.70 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పెద్దదోర్నాల మండలంలోని వై.చెర్లోపల్లి చెరువు అభివృద్ధికి రూ 3.70 కోట్లు, పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె చెరువుకు రూ.2.50 కోట్లు, దేవరాజుగట్టు, పెద్దారవీడు చెరువులకు ఒకే ప్యాకేజి కింద రూ.1.50 కోట్లు ప్రకారం మంజూరయ్యాయి. ఈ నిధులు కాజేయటానికి అధికార పార్టీకి చెందిన నాయకులు పోటీపడ్డారు. అయితే తనకు అత్యంత సన్నిహింతంగా ఉండేవారితో మాత్రమే నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఈ టెండర్లు వేయించారని ఆరోపణలు వినవస్తున్నాయి. అప్పనంగా ప్రజల సొత్తును కాజేయటానికి అధికార పార్టీకి చెందిన వారు ప్రయత్నిస్తున్నారు. దీనివలన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. జిల్లాలో చెరువులకు రూ.37 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులకు ఆన్లైన్ టెండర్లు పిలువాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు బాక్సు టెండర్లను పిలవడం శోచనీయం. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెరువులకు మంజూరైన రూ.7.70 కోట్ల పనులకు సింగిల్ టెండర్లు మాత్రమే వేయించుకున్నారు. కంటి తుడుపుగా మరొకరితో తప్పుడు టెండరు వేయించారు. షెడ్యూల్ కూడా టీడీపీ వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకే ఇచ్చారు. అగ్రిమెంట్లు జరగకుండా రాష్ట్ర నీటిపారుదల మంత్రి, చీఫ్ ఇంజినీరు చర్యలు తీసుకోవాలి. ఈ టెండర్లపై సమగ్రంగా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే 100 ఎకరాలలోపు ఉన్న చెరువులలో నీరు – చెట్టు పథకం కింద కోట్లాది రూపాయలు కాజేశారు. చెరువులను ఆడ్డంగా పెట్టుకొని టీడీపీ జేబులు నింపుకుంటున్నారు. -
దోపిడీ పథకంగా నీరు–చెట్టు
రుద్రవరం: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నీరుచెట్టు పథకం పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె అనుచరుల దోపిడీకి అడ్డాగా మారిందని టీడీపీ మాజీ ఇన్చార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి విమర్శించారు. స్థానికేతరులతో పనులు చేయించి రూ.కోట్లు ఆర్జించారని ఆరోపించారు. రూ. 5లక్షల ఎంపీ ల్యాడ్స్, రూ.15లక్షల ఉపాధి కర్నూలు జిల్లా నిధులతో రుద్రవరం మండలం నర్సాపురం సమీపంలో పెద్దబావి రస్తా నిర్మాణానికి ఎంపీటీసీ సభ్యుడు బలరామిరెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. కార్యక్రమానికి ఇరిగెల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుగంగ కాలువలు అధ్వానంగా ఉన్నా మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. ఆమెకు అక్రమార్జనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదన్నారు. నీరు – చెట్టు పథకం కింద అళ్లగడ్డ నియోజవర్గంలో రూ.100కోట్ల పనులు చేపట్టగా 20శాతం పనులు కూడా చేయించకుండా నిధులు మింగేశారని ఆరోపించారు. వీరి తీరు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. నీరు–చెట్టు పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు. నెలరోజుల్లో సీఎం స్పందించకుంటే జిల్లాలో చాలా మార్పులు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు చాంద్‌బాషా, నర్సాపురం నాయకులు సుద్దుల క్రిష్ణుడు, రుద్రవరం టీడీపీ నాయకులు మౌలాలి తదితరులు పాల్గొన్నారు. -
నీరు–చెట్టు అవినీతిమయం
చాగలమర్రి: టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న నీరు–చెట్టు కార్యక్రమం అవినీతిమయమైందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కొలిమి హుసేన్‌వలి కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీరు – చెట్టు కార్యక్రమం వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని కేవలం ఆ పార్టీ నాయకులు జేబులు నింపుకోవడానికే అమలు చేస్తున్నారన్నారు. అవసరం లేని పనులు చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశౠరు. ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక రైల్వేజోన్ నాలుగేళ్ల కిందట ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మోసం చేయడానికే దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. దొంగ దీక్షలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కర్నూలును దేశ రెండో రాజధానిగా చేయాలని మంత్రి లోకేష్ కోరడం బాగానే ఉందని, మీరెందుకు కర్నూలలో హైకోర్టు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబులాల్, మండల కన్వీనర్ కుమార్‌రెడ్డి, ఉపసర్పంచ్ అబ్దుల్లాబాషా, ఎంపీటీసీ సభ్యుడు మాబుషరీఫ్, తోడేండ్లపల్లె సర్పంచ్ వీరభద్రుడు, నాయకులు శివనాగిరెడ్డి, సింగంభరత్ రెడ్డి, గేట్లమాబు, ముల్లారఫి, ముల్లా ఇబ్రహీ, షబ్బీర్, ఫయాజ్, శేషు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి -
టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
► పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఇరు వర్గీయులు చాపాడు: మండలంలోని చియ్యపాడు గ్రామంలో జరుగుత్ను నీరు- చెట్టు పనులు టీడీపీ వర్గీయుల మధ్య తగువులాటకు దారి తీశాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తి నీరు–చెట్టులో భాగంగా శానకట్ట వంక పనులు చేస్తుండగా, మరో వర్గానికి చెందిన వ్యక్తులు తమ పొలంలో పనులు చేయొద్దని పనులపై అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మద్య శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం ఘర్షణ జరిగింది. చియ్యపాడుకు చెందిన టీడీపీ వర్గీయుడు బోగిరెడ్డి అశోక్‌రెడ్డి నీరు–చెట్టులో భాగంగా సర్వే నెంబరు 529లో శానకట్ట వంకలో పూడిక తీత పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సర్వే నెంబరు 533/1ఏలో తమ పట్టా పొలంలో పనులు చేస్తున్నాడని, టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి, దీనికి అవతల వైపు తమ పొలంలో సర్వే నెంబరు 523లో పనులు చేస్తున్నాడని కొందరు దళితులు పనులపై అభ్యంతరం తెలిపారు. దీంతో శుక్రవారం సాయంత్రం అశోక్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే క్రమంలో శనివారం ఉదయం చియ్యపాడు గ్రామంలో ఉదయం మళ్లీ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలో సమస్య పెరగకూడదనే ఉద్దేశంతో తహసీల్దార్ వి.పుల్లారెడ్డి పనులను నిలుపుదల చేయించారు. సర్వే చేసి వంక పరిధిలోని పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.