టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
► పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఇరు వర్గీయులు
చాపాడు: మండలంలోని చియ్యపాడు గ్రామంలో జరుగుత్ను నీరు- చెట్టు పనులు టీడీపీ వర్గీయుల మధ్య తగువులాటకు దారి తీశాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తి నీరు–చెట్టులో భాగంగా శానకట్ట వంక పనులు చేస్తుండగా, మరో వర్గానికి చెందిన వ్యక్తులు తమ పొలంలో పనులు చేయొద్దని పనులపై అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మద్య శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం ఘర్షణ జరిగింది. చియ్యపాడుకు చెందిన టీడీపీ వర్గీయుడు బోగిరెడ్డి అశోక్‌రెడ్డి నీరు–చెట్టులో భాగంగా సర్వే నెంబరు 529లో శానకట్ట వంకలో పూడిక తీత పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సర్వే నెంబరు 533/1ఏలో తమ పట్టా పొలంలో పనులు చేస్తున్నాడని, టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి, దీనికి అవతల వైపు తమ పొలంలో సర్వే నెంబరు 523లో పనులు చేస్తున్నాడని కొందరు దళితులు పనులపై అభ్యంతరం తెలిపారు.
దీంతో శుక్రవారం సాయంత్రం అశోక్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే క్రమంలో శనివారం ఉదయం చియ్యపాడు గ్రామంలో ఉదయం మళ్లీ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలో సమస్య పెరగకూడదనే ఉద్దేశంతో తహసీల్దార్ వి.పుల్లారెడ్డి పనులను నిలుపుదల చేయించారు. సర్వే చేసి వంక పరిధిలోని పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.