చదువుల నిలయాల్లో వర్గపోరుకు శ్రీకారం
అర్హత, ఆసక్తి ఉన్న తల్లిదండ్రులను పోటీచేయకుండా అడ్డుకున్న వైనం
శనివారం గొడవలు, అడ్డగింతతో 282 స్కూళ్లల్లో ఆగిన ఎన్నికలు
ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికకు రాజకీయ రంగు
సాక్షి, అమరావతి/నెల్లూరు సిటీ/కొనకనమిట్ల: ప్రశాంతంగా జరగాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు టీడీపీతోపాటు కూటమి నాయకులు రాజకీయరంగు పులిమారు. ఈ నెల 8వ తేదీన 40,150 పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆ రోజు 631 స్కూళ్లలో గ్రామస్థాయి కూటమి నాయకులు గొడవలకు దిగారు. దీంతో కోరం లేక 631 స్కూళ్లలో ఎన్నికలు నిలిచిపోయాయి.
ఆ ఎన్నికల్ని విద్యాశాఖ అధికారులు శనివారం నిర్వహించగా.. కూటమి నేతలు మళ్లీ పాత పరిస్థితినే తీసుకొచ్చారు. పలుచోట్ల ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపిన తల్లిదండ్రులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులన్న నెపంతో మళ్లీ ఎన్నికలు నిలిపేసేందుకు యత్నించారు. పలుచోట్ల దళిత తల్లిదండ్రులపై దాడులు చేశారు.
కొన్నిచోట్ల తమకు బలం లేదన్న అక్కసుతో ఎన్నికల్ని నిలిపేయించారు. టీడీపీ నాయకుల అరాచకాలతో కొన్నిచోట్ల పేరెంట్స్ తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి నాయకుల కుట్రలకు కొన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు సైతం వత్తాసు పలకడం గమనార్హం. మొత్తంమీద టీడీపీ నేతల కుట్రలతో 282 పాఠశాలల్లో కమిటీ ఎన్నికలు నిలిచిపోయాయి.
దళితులపై దౌర్జన్యం
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గొల్లకందుకూరు పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలను టీడీపీ నేతలు మరోసారి వాయిదా వేయించారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ వర్గానికి 15 ఓట్లు ఉండగా, టీడీపీ వర్గానికి 6 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయంతో టీడీపీ నేతలు స్థానిక దళితులైన ఇద్దరు పేరెంట్స్‌ను భయభ్రాంతుల్ని చేశారు. దళితుడైన నారాయణ ఎన్నికల్లో పాల్గొనేందుకు వస్తుండటంతో దాడిచేశారు. ఎన్నికల్లో పాల్గొంటే అంతు చూస్తామని బెదిరించారు. మరో దళితుడు వెంకటరమణయ్యను రాకుండా అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఎంఈవో ఎన్నికలను మరోసారి వాయిదా వేశారు. టీడీపీ వర్గీయుల అరాచకాలను నిరసిస్తూ 13 మంది పేరెంట్స్ తమ పిల్లలను మరో పాఠశాలలో చేర్చాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని కాట్రగుంట పంచాయతీ పేరారెడ్డిపల్లి యూపీ పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు.
ఎన్నికల్ని ఆపాలని టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతోపాటు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే కమిటీ సభ్యులుగా ఎన్నికవడంతో ఉక్రోషం పట్టలేని టీడీపీ కార్యకర్త కె.బసవయ్య పాఠశాల సభ్యులున్న గదిలోకి వెళ్లి టేబుల్‌పై ఉన్న పేపర్లు చించి బయటవేశాడు.
99.38 శాతం ఎన్నికలు పూర్తి ఎస్పీడీ శ్రీనివాసులు
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు 99.38 శాతం పాఠశాలల్లో పూర్తయ్యాయని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. జీరో ఎన్‌రోల్‌మెంట్, పాఠశాలల మూసివేత, కోరం లేకపోవడం వంటి కారణాలతో 282 పాఠశాలల్లో యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment