సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో వివిధ స్కీముల కింద మంజూరైన 83,768 ఇండ్లను రద్దు చేసేందుకు గృహనిర్మాణ సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం మూ డు విడతలతో పాటు రచ్చబండ తదితర పథకాల కింద మంజూరై.. లబ్ధిదారులు ఇంకా నిర్మాణం మొదలు పెట్టని ఇండ్లను రద్దు చేయనున్నారు.
125 గజాల స్థలంలో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో కూడిన పక్కాఇండ్ల నిర్మాణం పథకం త్వరలోనే ప్రారంభించనున్న నేపథ్యంలో తాజాగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ జిల్లాల గృహనిర్మాణ సంస్థ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు మార్గదర్శకాలను సూచించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 83,768 ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారులకు సమాచారం అందించి వాటిని రద్దు చేసేందుకు గృహనిర్మాణ సంస్థ అధికారులు రెండు రోజుల్లో కసరత్తు పూర్తి చేయనున్నారు.
లబ్ధిదారుల్లో కలకలం
మంజూరైనా నిర్మాణం మొదలెట్టని ఇండ్లను రద్దు చేయాలన్న ప్రభుత్వం యోచన ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల్లో కలకలం రేపుతోంది. 2006 సంవత్సరంలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభం కాగా మూడు విడతల్లో జిల్లాలోని అర్హులైన పలువురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఇందిరమ్మ మూడు విడతలకు తోడు రచ్చబండ, ఇందిరా అవాస్ యోజన తదితర పథకాల కింద కూడ ఇండ్లు మంజూరయ్యాయి.
జిల్లాలో మొత్తంగా ఇప్పటి వరకు ఈ పథకాల కింద 2,42,255 ఇండ్లు మంజూరు కాగా 1,29,202 మాత్రమే పూర్తయ్యాయి. పునాదుల నుంచి రూఫ్, రెంటల్ లెవెల్లో 29,285 ఇండ్ల నిర్మాణం ఉంటే, 83,768 మంది లబ్ధిదారులు అసలే ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించ లేదు. ఇందులో మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు 5,750 మంది ఉండగా, రెండో విడతలో 14,532 మంది ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి.
ఇందిరమ్మ మూడో విడతతో పాటు రచ్చబండ-1, 2 విడతలు, ఇతర స్కీముల కింద మంజూరైన మరో 63,486 మంది సైతం ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టలేదు. ఇదిలా ఉండగా ఇండ్లు మంజూరైనా కనీసం పునాదులు కూడ తీయని లబ్ధిదారులకు చెందిన ఇండ్లను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో జిల్లాలో మొత్తంగా 83,768 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను అసలే మొదలు పెట్టలేదని తేల్చిన అధికారులు ప్రభుత్వానికి సమర్పించేందుకు నివేదిక సిద్ధం చేశారు.
రెండు పడక గదుల పక్కాఇండ్లు ఎప్పుడో?
ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు జిల్లాలో 83,768 ఇండ్లు రద్దుకానుండగా, 125 గజాల్లో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో నిర్మిస్తామన్న పక్కాఇండ్లు ఎప్పుడు మంజూరవుతాయన్న చర్చ సాగుతోంది. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న రెండు పడక గదులు, ఓ వంటగది, బాత్రూమ్‌తో కూడిన పక్కాఇండ్ల కోసం అర్హులైన పేదలు కలలు కంటున్నారు.
గతంలో ఇండ్లు మంజూరైనా నిర్మాణాలు చేపట్టలేదని రద్దు చేస్తున్నా.. కొత్తగా ప్రారంభించే పక్కాఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లను ప్రస్తుతం 240 చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 16 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో నిర్మించే ఈ ఇళ్లపై ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీయేతరులకు రూ.70 వేలు చెల్లిస్తుంది. షెడ్యూల్ తెగలకు రూ.1.05 లక్షలు, షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు రూ.1లక్ష వివిధ దశలు, రూపాల్లో చెల్లిస్తోంది. అయితే కొత్తగా మంజూరు చేసే ఇండ్ల కోసం 125 గజాల స్థలం కేటాయించడంతో పాటు రూ.3.50 లక్షలు ఖర్చు చేయనుండటంతో అందరూ ప్రభుత్వ ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నారు.
83 వేల ఇండ్లు రద్దు?
Published Tue, Oct 7 2014 1:11 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement