సాక్షి, కర్నూలు: ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. నేతల అండ.. అధికారుల ఉదాసీనత కారణంగా మొదటి, రెండో విడత ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి గూడు కట్టుకుంది. ఎట్టకేలకు పాపం పండినా.. అక్రమార్కులు కాజేసిన నగదును రాబట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలంలో అక్రమాలు పరాకాష్టకు చేరడంతో 2008లో గృహ నిర్మాణ సంస్థ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నేతల ఒత్తిడి మధ్య చేపట్టిన విచారణలో ఎట్టకేలకు మండలంలోని బొందిమడుగుల, లింగనేనిదొడ్ది, రాతన, రాంపల్లి గ్రామాల్లో సుమారు రూ.2.50 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. అదేవిధంగా జిల్లాలో రూ.5.13 కోట్లు అక్రమార్కుల పరమైనట్లు గుర్తించారు. ఇందుకు 118 మంది హౌసింగ్ సిబ్బంది, 43 మంది మండల హౌసింగ్ అధికారులు, 38 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, 15 మంది మధ్యవర్తులు, 1,402 మంది లబ్ధిదారుల పాత్ర ఉన్నట్లు వెల్లడించారు.
వీరందరిపై 50 కేసులు నమోదు కాగా.. ఐదు కేసులను ఆర్‌ఆర్ చట్టం కింద నమోదు బనాయించారు. హౌసింగ్ సిబ్బంది, మధ్యవర్తులపై 8 క్రిమినల్ కేసులు పెట్టారు. దుర్వినియోగమైన నిధులను ఆర్‌ఆర్ చట్టం కింద రికవరీ చేయాలని నిర్ణయించారు. అయితే ఐదు సంవత్సరాలు గడిచినా రూ.19.72 లక్షలు మాత్రమే వసూలు చేయడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ సొమ్ములో హౌసింగ్ సిబ్బంది జీతం నుంచి రికవరీ చేసినదే రూ. 10,01,000 లక్షలు కాగా.. గ్రామ సమాఖ్య సభ్యుల నుంచి రూ.9.71 లక్షలు వసూలు చేయడం గమనార్హం. అసలు దుర్వినియోగానికి కారణమైన వారి నుంచి ఇప్పటికీ ఒక్క పైసా వసూలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అంతులేని అవినీతి: జిల్లాలోని దేవనకొండ మండలంలో రూ.70 లక్షలు, కోడుమూరు మండలంలోని లద్దగిరి, గోరంట్ల గ్రామాల్లో రూ.2 కోట్లు దుర్వినియోగం కాగా ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. బొందిమడుగుల, లింగనేనిదొడ్డి, రాతన గ్రామాల్లో రూ.2.50 కోట్లు దుర్వినియోగం కాగా.. బాధ్యులైన డీఈ, ఏఈలను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. డీఈ సుబ్రమణ్యం నుంచి రికవరీ చట్టం ద్వారా రూ.30 లక్షలు, ఏఈ ఆయూబ్ నుంచి రూ.10 లక్షలు రికవరీ చేయడానికి నోటీసులు జారీ చేయగా వారు కోర్టు కెక్కారు. మరో 36 మంది సిబ్బందిని ఉద్యోగం నుంచి తప్పించారు. అక్రమాలకు పాల్పడి ఇతర జిల్లాలో పనిచేస్తున్న హౌసింగ్ సిబ్బంది నుంచి రూ.13.57 లక్షల రికవరీకి విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. అదేవిధంగా కోర్టుల్లో వీగిపోయిన తొమ్మిది కేసులకు సంబంధించి మరో రూ.23.58 లక్షలు వసూలు కావాల్సి ఉంది.
అక్రమార్కుల మాటేమిటి?: ఇళ్ల నిర్మాణం పేరిట అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు, అసలు ఇళ్లు నిర్మించకుండానే నిధులు కాజేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నకు సమాధానం లేదు. గృహ నిర్మాణ శాఖ లెక్కల ప్రకారం దుర్వినియోగమైన నిధులు రూ. 5.13 కోట్లు అయితే.. రికవరీ చేసింది రూ. 19.72 లక్షలు మాత్రమే. ఇంకా రూ.4.93 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ మొత్తం చెల్లించాల్సింది బోగస్ లబ్ధిదారులే. అయితే అధికారులు వీరి జోలికి వెళ్లకపోవడం గమనార్హం.
అవినీతి ‘గూడు’
Published Thu, Dec 12 2013 2:09 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement
Advertisement