ఒంగోలు, న్యూస్‌లైన్: పేదలపై ప్రభుత్వం కన్నెర్ర జేసింది. వందశాతం అపరాధ రుసుం పేరుతో ఎడాపెడా వాయించేస్తోంది. మూడు నెలలుగా ఇదే తంతు కొనసాగుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. డీకే పట్టాలకు ప్లాన్ అవసరం లేదని మున్సిపల్ అధికారులే కన్నెర్ర చెబుతారు.
కానీ ప్లాన్ లేకుండా కట్టారంటూ వందశాతం అపరాధ రుసుం విధిస్తారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ఇది తమ పరిధిలోనిది కాదని, తాము ఇంటి పన్ను వేసేందుకు వివరాలను నమోదు చేస్తే రెట్టింపు మొత్తం బిల్లులు కనిపిస్తున్నాయని చెబుతుండడం గమనార్హం.
గృహ నిర్మాణాలకు ముందస్తు ప్లాన్ తప్పనిసరి అని 2011లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఒక జీవో ఇచ్చింది. ఈ క్రమంలోఅనధికారికంగా నిర్మించుకున్న చాలా గృహాలను పడగొట్టేశారు. అయితే పురపాలక సంఘం ఉత్తర్వుల ప్రకారం 100 చదరపు మీటర్ల కంటే తక్కువ స్థలంలో ప్లాన్ తీసుకోకుండా కూడా గృహ నిర్మాణాలు చేసుకోవచ్చు. కానీ ఇటీవల దానిని కాస్తా 50 చదరపు మీటర్లకు పరిమితం చేశారు.
అదేవిధంగా డీకే పట్టాలు పేదవారికే ఇస్తారు కనుక మున్సిపాల్టీలో అడిగితే డీకే పట్టాలకు ప్లానింగ్ అవసరం లేదనే సమాధానం వినిపిస్తుంటుంది. దీంతో చాలామంది డీకే పట్టాలు పొందినవారు ప్లానింగ్ లేకుండానే గృహాలను నిర్మించుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వమే పక్కా లేఅవుట్ వేసి ఒక పద్ధతి ప్రకారం గృహాలను నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇలాంటి వాటిలో ఒంగోలు ఇందిరమ్మ కాలనీ లేఅవుట్ ఒకటి. ఇక్కడ దాదాపు 1500కుపైగా గృహాలకు పక్కా లే అవుట్ వేసి అందరికీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది.
ఇళ్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ రుణాలను మంజూరు చేసింది. కట్టుకునే సమయంలో గృహనిర్మాణ శాఖ అధికారుల పర్యవేక్షణ కొనసాగింది. పన్నులు వేయమని నెత్తీనోరు కొట్టుకుని జనం మొత్తుకుంటే ఎట్టకేలకు పురపాలక సంఘం ఇటీవల స్పందించింది. 2013 మార్చి నుంచి పన్నులు వేయడం ప్రారంభించింది.
ఒంగోలు నగరంలో పైపులైన్లు ఉన్న కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేస్తామంటూ కమిషనర్ హుకుం జారీచేశారు. దీంతో ట్యాపులు కావాలంటే ఇంటిపన్ను తప్పనిసరి కావడంతో కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టి పన్నులు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇంటి పన్ను ప్రతి ఆరునెలలకు 391, అయితే పెనాల్టీ మరో 391 అంటూ బిల్లుల్లో కనిపిస్తుండడం గమనార్హం. ఇది కేవలం తొలి దఫా మాత్రమే పెనాల్టీ అనుకుంటే పొరబాటే. ప్రభుత్వం నుంచి తిరిగి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పెనాల్టీ ఉంటుంది.
ఏదైనా ఒక గృహం కొలతలను ‘ఆన్‌లైన్’లో పొందుపరిస్తే చాలు ...ఆటోమాటిక్‌గా రెట్టింపు పన్ను రశీదులు వస్తున్నాయి. అయితే డీకే పట్టాలకు ప్లాన్ అవసరం లేదు. కానీ, అపరాధ రుసుం కట్టాల్సిందే అని పురపాలక సంఘం అధికారులు చెబుతుండడంతో ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. ఒంగోలులోని కరణం బలరాం కాలనీలో రేకుల షెడ్లను ఏర్పాటుచేసుకున్న వారి పరిస్థితి కూడా ఇదే. ప్లాన్ తీసుకోవాలంటే మరలా తడిసి మోపెడయ్యే పరిస్థితి. ఈ క్రమంలో ఏం చేయాలో పేద ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఇది కేవలం ఒంగోలుకు మాత్రమే పరిమితం కాదు. ప్లాన్ లేకుండా కట్టుకున్న రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలలోను ఈ విధానం అమలవుతుండడం గమనార్హం.
రెట్టింపు అనగానే బాధేసింది: పఠాన్ షాహీదా
ఉండేది రేకుల ఇల్లు. ఆరు నెలలకు 203 పన్ను అన్నారు. తీరా చూస్తే 406 ప్రతి ఆరు నెలలకు కట్టాలంటూ రశీదులు ఇచ్చారు. ఇదేమిటి అంటే ముందస్తు ప్లాన్ తీసుకోలేదు కదా అంటున్నారు.
పేదలకు ముందస్తు ప్లాన్ అంటే ఎలా: షేక్ మున్నా
మేం మిద్దెలు, మేడలు కట్టుకోవడం లేదు. చాలా చిన్న రేకుల ఇల్లు. ఒక వైపు రోజురోజుకూ ధరలు పెరుగుతుంటే బతకడమే కష్టంగా ఉంది. ఈ దశలో ఇంటి పన్నులు సైతం రెట్టింపు కట్టాలంటే ఎలా కట్టుకోవాలి.
మంత్రిగారు కాస్త ఆలోచించండి : కొక్కిలిగడ్డ సుబ్బారావు
పట్టా నా భార్య మునెమ్మ పేరు మీద ఉంది. సర్వం ధారబోసి చిన్న ఇల్లు కట్టుకున్నాం. ముందు 391 కట్టాలన్నారు. తీరా బిల్లు తీసుకుంటే 782 రశీదు చేతిలో పెట్టారు. మాపై మంత్రయినా కాస్త కనికరం చూపాలి. రెట్టింపు అపరాధ రుసుం అనేమాటను తొలగించాలి.
పేదలపై ప్రభుత్వం కన్నెర్ర
Published Sat, Feb 1 2014 6:54 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Advertisement