చంద్రన్న కానుకల సరుకులు
ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల పంపిణీ గందరగోళంగా తయారైంది. పోర్టబులిటీ సౌకర్యాన్ని ఈ సరుకులకు ఎత్తివేయడంతో చాలా మందికి చంద్రన్న కానుక అందకుండా పోతోంది.
పశ్చిమగోదావరి,దేవరపల్లి: ఈ– పోస్ యంత్రంలో పోర్టబులిటీ సదుపాయం కల్పించకపోవడంతో పండుగ కానుకలు అందక వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ఇతర జిల్లాల ప్రజలు జిల్లాకు వలస వచ్చి ఉపాధి పొందుతూ జీవనం గడుపుతున్నారు. శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి అనేక కార్మిక కుటుంబాలు వలస వచ్చి దేవరపల్లి, కొవ్వూరు మండలాల్లోని నల్లరాతి క్వారీల్లో పనిచేస్తున్నాయి. ప్రతినెల స్థానికంగా ఉండే రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులు పోర్టబులిటీలో పొందుతున్నారు. అలాగే భీమవరం ప్రాంతంలో విస్తరించి ఉన్న రొయ్యలు, చేపలచెరువుల వద్ద ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వందలాది కుటుంబాలు వలసలు వెళ్లి ఉంటున్నాయి. చంద్రన్న కానుకలకు పోర్టబులిటీ సదుపాయం నిలుపుదల చేయడంతో రేషన్ దుకాణా లకు వెళ్లిన కార్డుదారులు నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రతినెల రేషన్ సరుకులు ఇస్తుండగా, కానుకలు ఎందుకు ఇవ్వరని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊరుకు వెళ్లి పండగ చేసుకోవాలనడం ఎంత వరకు సమంజసమని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కార్డుదారులకు సమాధానం చెప్పలేక డీలర్లు తల పట్టుకుంటున్నారు.
చంద్రన్న క్రిస్మస్ కానుకలను ఇవ్వాలనే ఉద్దేశంతో తొలుత 50 శాతం కార్డుదారులకు కానుకలను సరఫరా చేశారు. అయితే సంక్రాంతి కానుకలను కూడా ఈ నెలాఖరుకు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెండు రోజుల నుంచి అధికారులు గిడ్డంగుల నుంచి రేషన్ దుకాణాలకు ఆగమేఘాలపై సరుకులను సరఫరా చేస్తున్నారు. నూరు శాతం కార్డులకు కానుకలను అందించాలని అధికారులు డీలర్లకు ఆదేశాలు ఇవ్వడంతో కానుకల పంపిణీ ముమ్మరంగా జరుగుతోంది. నూరుశాతం కానుకలు రేషన్ దుకాణాలకు సరఫరా చేసినందున పోర్టబులిటీ ఇవ్వకపోతే కానుకలు మిగిలిపోతాయని డీలర్లు అంటున్నారు. మిగిలిపోయిన కానుకలు సకాలంలో తిరిగి అప్పగించకపోతే పాడైపోయే ప్రమాదం ఉందని డీలర్లు అంటున్నారు. కానుకల కోసం రేషన్ దుకాణాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. పోర్టబులిటీ విషయాన్ని పలువురు డీలర్ల సంఘాల ప్రతినిధులు మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. అయినప్పటికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని డీలర్లు తెలిపారు. ఒక్కొక్క రేషన్ దుకాణంలో 30 నుంచి 100 వరకు పోర్టబులిటీ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం పోర్టబులిటీకి అనుమతి ఇవ్వకపోతే కార్డుదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధికారపార్టీ నాయకులు అంటున్నారు.
కానుకల్లో తరుగుదల..డీలర్లు లబోదిబో
గిడ్డంగుల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల్లో తరుగులు రావడంతో డీలర్లు లబోదిబో మంటున్నారు. శనగపప్పు, కందిపప్పు, గోధుమపిండి ప్యాకెట్లు బస్తాల్లో తక్కువగా ఉంటున్నాయని డీలర్లు వాపోతున్నారు. ప్యాకెట్లు బస్తాలో వేసి తూకం వేసి ఇచ్చారని.. బరువు 50 కిలోలు ఉంటున్నప్పటికి ప్యాకెట్లు మాత్రం 44, 45 కిలోలు ఉంటున్నాయని డీలర్లు తెలిపారు. ఈ విధంగా తరుగులు ఉంటే కార్డుదారులకు ఏవిధంగా సరిపెట్టగలమని, నష్టం ఎవరు భరిస్తారని డీలర్లు వాపోతున్నారు. గిడ్డంగి అధికారులను అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని డీలర్లు తెలిపారు. కార్డుదారులకు ప్యాకెట్ల లెక్కన ఇచ్చి... డీలర్లకు తూకం ద్వారా ఇవ్వడం వల్ల డీలర్లు నష్టపోవలసి వస్తోందని పలువురు డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తగ్గిన ప్యాకెట్లకు డీలర్లకు ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment