దరఖాస్తు తిరస్కరణకు గురైన ఒక జంట పెళ్లి ఫొటో
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: చంద్రన్న పెళ్లి కానుక పథకం జిల్లాలో కినుక వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడి వివాహాలు చేసుకున్న పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వందలాది మంది లబ్ధిదారులు చంద్రన్న పెళ్లి కానుకల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు చేసుకుని నెలలు గడుస్తున్నా కానుకలు అందకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కొందరు అవి వస్తాయా.. రావా అన్న సందేహంలో కొట్టిమిట్టాడుతుంటే.. మరికొందరు అవి వచ్చి చచ్చేవి కాదని బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎక్కువగా ఈ పథకంలో దరఖాస్తులు చేసుకుంది టీడీపీ కార్యకర్తల పిల్లలే కావడంతో, వారు విషయాన్ని బయటకు కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పేద, మధ్యతరగతి వారి వివాహాలకు పెళ్లికానుకలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు ఈ పెళ్లి కానుకల కోసం మొత్తం 2,510 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 458 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. మిగిలిన వారు కానుకల కోసం ఎదరుచూస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా ద్వారకాతిరుమల మండలంలో 348, ఏలూరులో 176, భీమవరంలో 102, పాలకొల్లులో 109, పెదవేగిలో 110 మంది ఈ పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు.
ఆదిలోనే హంసపాదు
చంద్రన్న పెళ్లి కానుక పేరుతో 2018 ఏప్రిల్ 20న ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం సామాజికవర్గాల వారీగా పెళ్లి కానుకలను అందించాలని నిర్ణయించింది. అయితే పాలకుల నిర్లక్ష్యం.. ఈ పథకానికి శాపంగా మారింది. దీంతో ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టైంది. చంద్రన్న పెళ్లి కానుక పథకంలో ఉన్న అనేక సమస్యలను లబ్ధిదారులు అధిగమించినా, చివరకు నగదు అందక డీలా పడుతున్నారు. కానుకల కోసం వెలుగు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పెళ్లి చేసుకునే నూతన వధూవరులు 15 రోజుల ముందే అధికారులకుసమాచారమిచ్చి, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పథకం వర్తిస్తుంది. ఆ తరువాత బర్త్ సర్టిఫికెట్, తెల్లరేషన్ కార్డు, కుల సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది. పెళ్లి జరిగే రోజున సంబంధిత కల్యాణ మిత్రలు వచ్చి, పెళ్లి లైవ్ (జియో ట్యాగింగ్) ఫొటో అప్‌లోడ్ చేస్తేనే కానుక అందుతుంది. అయితే అష్టకష్టాలు పడి, ఈ నిబంధనలన్నింటినీ దాటి ముందుకెళ్లినా కానుకలు అందక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు.
సామాజిక వర్గాన్ని బట్టి కానుక
చంద్రన్న పెళ్లి కానుకను ఒక్కో సామాజికవర్గానికి ఒక్కోలా అందించాలని ప్రభుత్వం పథకానికి రూపకల్పన చేసింది. ఇందులో ముస్లింలు, గిరిజనులు, మైనారిటీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ. 40 వేలు, బీసీలకు రూ.35 వేలు, ఓసీలకు రూ.20 వేలు అందిస్తామని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీలలో కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, బీసీలలో కులాంతర వివాహానికి రూ.50 వేలు, దివ్యాంగులకైతే రూ.లక్ష ఇస్తామన్నారు. వీటికి అనుగుణంగానే అన్ని సామాజికవర్గాల వారు ఈ కానుక కోసం దరఖాస్తులు చేసుకుని, నెలల తరబడి వేచిచూస్తున్నారు.
దుల్హన్, గిరిపుత్రిక పథకాలు విలీనం
గతంలో ముస్లిం మైనారిటీలకు, అలాగే గిరిజనులకు సంబంధించి దుల్హన్, గిరిపుత్రిక అనే రెండు పథకాలు ఉండేవి. ముస్లిం, మైనారిటీలు వివాహాలు చేసుకుంటే దుల్హన్ పథకం కింద రూ.50 వేలు ఇచ్చేవారు. అలాగే గిరిజనుల్లో ఎవరు పెళ్లి చేసుకున్నా గిరిపుత్రిక పథకంలో రూ.50 వేలు అందించేవారు. అయితే ప్రభుత్వం ఈ రెండు పథకాలకు చరమగీతం పాడి, వాటిని చంద్రన్న పెళ్లి కానుకలోకి విలీనం చేసింది. దీంతో ముస్లిం, మైనారిటీలు, గిరిజనులు సైతం చంద్రన్న పెళ్లి కానుకలను అందుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఆధార్ మార్చకూడదట..
వివాహానంతరం భార్య తన ఆధార్ కార్డును భర్త అడ్రస్‌కు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే చంద్రన్న పెళ్లికానుకకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రం నగదు అందిన తరువాతే ఆధార్ మార్పు చేసుకోవాలని వెలుగు సిబ్బంది చెబుతున్నారట. దీంతో అటు కానుక అందక, ఇటు రేషన్‌కార్డు పొందేందుకు వీలులేక నూతన వధూవరులు నానా పాట్లు పడుతున్నారు.
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తే ఇవ్వరట..!
నా పేరు బోడ కృష్ణ. మాది ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి. నా కుమార్తె వెంకటలక్ష్మిని, బుట్టాయగూడెం మండలం దొరమామిడికి చెందిన మరపట్ల రాజేష్‌కిచ్చి ఈ ఏడాది మే 3న పెళ్లిచేశాం. ముందుగానే ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నాం. వివాహం జరిగి నాలుగు నెలలుపైగా గడిచినా ఇంత వరకు కానుక అందలేదు. అధికారులు అదిగో.. ఇదిగో అన్నారు. చివరకు నా అల్లుడు రాజేష్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నందున కానుక ఇవ్వమంటున్నారు. – బోడ కృష్ణ, జి.కొత్తపల్లి, ద్వారకాతిరుమల మండలం
Comments
Please login to add a commentAdd a comment