నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన మట్టా వరలక్ష్మి, లకంసాని శ్రీను జూన్ 23న కులాంతర వివాహం చేసుకున్నారు. వధువు బీసీ కావడంతో వీరికి చంద్రన్న పెళ్లికానుక కింద రూ.50 వేలు ప్రోత్సాహకం అందించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ బ్యాంక్ ఖాతాలో జమకాలేదు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ చేయాలని వెలుగు అధికారులు సూచించడంతో ఆ పని పూర్తిచేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ నవజంట పెళ్లికానుక కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన పుచ్చకాయల స్వప్నకు, పురుషోత్తపల్లికి చెందిన సాలి లక్ష్మణరావుకు పరిశుద్ధ వివాహం జరిగింది. వీరికి చంద్రన్న పెళ్లికానుక కింద రూ.40 వేలు అందాల్సి ఉండగా వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం అందలేదని వెలుగు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేయాల్సిన గ్రామ పంచాయతీ అధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో పెళ్లికానుక మంజూరులో జాప్యం జరుగుతోంది.
పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: ఆడపిల్ల పెళ్లికి ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు ఏప్రిల్ 20న చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ప్రారంభించింది. పెళ్లిచేసుకున్న రోజునే నవవధువు ఖాతాలో ప్రోత్సాహం వేస్తామని సీఎం ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న నవదంపతులకు లబ్ధి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
అమలులోనే చిక్కులు
చంద్రన్న పెళ్లికానుక అమలులో చిక్కులు ఎదురవుతున్నాయి. నమోదులో సాంకేతికపరమైన సమస్యలతో లబ్ధిదారులు నిరాశకు లోనవుతున్నారు. గతంలో ముస్లింలకు అందించే దుల్హన్ పథకాన్ని, కులాంతర వివాహ పథకాన్ని చంద్రన్న పెళ్లికానుక కిందకు తీసుకొచ్చి ప్రత్యేక సాఫ్ట్‌వేర్, వెబ్‌సైట్ రూపొందించారు. ఆన్‌లైన్ విధానంలో రియల్‌టైమ్ గవర్నెన్స్ టోల్‌ఫ్రీ నంబర్ 1100 ద్వారా, వెలుగు, మెప్మా, మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుదారులుసరైన పత్రాలు సమర్పించిన కారణంగా ఎక్కువ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన వధువులకు ఆర్థిక ఆసరా కలుగుతుందని భావించినా సక్రమంగా అందడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు 5,662 మంది పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అన్ని అర్హతలూ ఉన్న∙3,718 జంటలు పెళ్లికానుకలు అందుకున్నారు. మిగిలిన వారందరినీ వివిధ ధ్రువీకరణ పత్రాలు అందజేయని కారణంతోనూ, ప్రజాసాధికారక సర్వేలో పేర్లు లేవనే నెపంతోనూ పెండింగ్ పెట్టారు. మొత్తం 1,944 అర్జీలను పెండింగ్‌లో పెట్టారు. వాస్తవానికి జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10 వేలకు పైగా వివాహాలు జరిగినా సగం మంది సాంకేతిక చిక్కులు కారణంగా దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ప్రధానంగా పెళ్లికి 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉండటంతో పాటు రకరకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండడం, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉండటంతో, పెళ్లికానుకపై సరైన అవగాహన లేకపోవడంతో పలువురు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రభుత్వం ఇకపై పెళ్లికి పది రోజుల ముందు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
మరోసారి గడువు పెంచినా..
ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 31 వరకు వివాహాలు చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో అర్హులు నమోదు చేసుకోలేదు. జిల్లాలో 2,285 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో కల్యాణమిత్ర పరిశీలించిన తర్వాతే చంద్రన్న పెళ్లికానుక వెబ్‌పోర్టల్‌లో పొందుపర్చాలనే నిబంధన పెట్టారు. దీంతో నవవధువులు పెళ్లిచేసుకున్న ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యులు 10 మంది పెళ్లిచేసుకోగా ఒక్కరికీ పెళ్లికానుక ప్రోత్సాహకం అందలేదు.
కానుక ఇలా..
గిరిపుత్రికలకు రూ.50 వేలు, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్సీ కులాంతర వివాహానికి రూ.75 వేలు, ముస్లింలకు (దుల్హన్) రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేలు, బీసీ కులాంతర వివాహాలకు రూ.50 వేలు, విభిన్న ప్రతిభావంతుల వివాహాలకు రూ.లక్ష, భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యులు, కార్మికుల సంక్షేమ మండలి సభ్యులు ఎస్టీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, బీసీలకు రూ.35 వేలు, ఓసీలకు రూ.20 వేలు ప్రోత్సాహకాలు అందించనున్నారు.
కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు..
మీసేవ జారీ చేసిన కులము, నివాస, జనన ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్ కార్డు, అంగవైకల్యం ఉన్నవారైతే సదరం సర్టిఫికెట్, వధువు, వరుడు పెళ్లి కార్డులు, ఆధార్ కార్డులు, ఆధార్‌తో సీడ్ చేయబడిన వధువు బ్యాంక్ ఖాతా వివరాలు, ఏపీ బిల్డింగ్, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యత్వం ఉన్న వారైతే రిజిస్ట్రేషన్ నంబర్, కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యత్వం ఉన్నవారైతే ఐడీ కార్డు, పెళ్లికి సంబంధించిన మూడు ఫొటోలు అందించాల్సి ఉంది.
అర్హతలివీ..
♦ పెళ్లి తేదీ నాటికి పెళ్లి కుమార్తె వయస్సు 18 ఏళ్లు, పెళ్లి కుమారుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి.
♦ మొదటి వివాహం చేసుకునే వారు మాత్రమే ఈ పథకంలో అర్హులు.
♦ భర్త చనిపోయిన వితంతువులకు మాత్రమే రెండో వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది.
♦ నమోదు చేసుకునే సమయానికి ఆధార్ నంబర్ ఉండాలి. వివాహం రాష్ట్రంలో మాత్రమే జరగాలి.
♦ వధువు, వరుడు ప్రజాసాధికారక సర్వేలో నమోదై ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి వివాహ తేదీ, వేదిక నిర్ణయించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment