
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం తీసుకోకపోయినా రేషన్ కార్డు రద్దు కాదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా కార్డు ఉన్న ప్రతి పేదవానికి బియ్యం అందేలా చూస్తామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి రేషన్ డీలర్లకు చెక్కులు అందించారు. డీలర్లకు రావాల్సిన బకాయిలు అందజేయాలని ఆగస్టు 23న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని, కేజీకి 20 పైసల నుంచి 70 పైసలు కమీషన్ పెంచుతూ కేసీఆర్ అప్పుడే నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఈ మేరకు 2015 నుంచి ఉన్న రూ.132 కోట్ల బకాయిలను రేషన్ డీలర్లకు అందిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాలో 859 షాపుల డీలర్లకు రూ.9 కోట్ల 40 లక్షల బకాయిలు ఉండగా.. దీనిలో తొలి దఫాగా రూ.4.33 కోట్లు అందస్తున్నామన్నారు. మిగిలిన రూ.5.7 కోట్లు త్వరలో అందిస్తామన్నారు. ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌కు మీ కష్టాల గురించి తెలిసే కమీషన్ పెంచారన్నారు. ఈ శాఖకు కమిషనర్లుగా పనిచేసిన అధికారుల కృషి వల్లే దేశంలో నంబర్ వన్ శాఖ గా నిలిచిందన్నారు. ఇందులో రేషన్ డీలర్ల భాగస్వామ్యం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment