సాక్షి, హైదరాబాద్: దసరాకు కొన్ని జిల్లాల్లో రేషన్ బియ్యం అందించలేకపోవడంపై ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ –పాస్ మిషన్ల అక్రమాలను అరికట్టడానికే గానీ, లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టడానికి కాదని పేర్కొన్నారు. ఈ–పాస్ మిషన్లు అందిస్తున్న సంస్థ అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని, మరోసారి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆ కంపెనీని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖపై ఆయన శనివారం సమీక్షించారు.
ఈ కంపెనీ అనుకున్న స్థాయిలో పని చేయట్లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ–పాస్ మెషీన్లు సరిగా పని చేస్తున్నాయో లేదో చూసుకున్నాకే క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, బియ్యం అందించలేకపోతుంటే ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళికి పునరావృతం కాకుండా చూసుకోవాలని కమిషనర్ సీవీ ఆనంద్‌కు సూచించారు. సమస్యల్లేకుండా ఈ–పాస్ మిషన్ల ద్వారా అర్హులయిన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం అందేలా చూడాలని కోరారు.
ఈ ఏడాది సన్న బియ్యం 1.5 లక్షల టన్నులు అవసరం ఉంటుందని సీవీ ఆనంద్ మంత్రికి వివరించారు. 27 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు మొత్తం రూ.8,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. బియ్యం సేకరణ పూర్తి పారదర్శకంగా టెండర్ల ద్వారా జరగాలని మంత్రి ఆదేశించారు. సన్న బియ్యం నిల్వకు అన్ని వసతులు ఉన్న గోదాములను ఉపయోగించాలన్నారు.
అడిగిన ప్రతి ఒక్కరికీ ఎల్పీజీ వంటగ్యాస్ కనెక్షన్లు అందేలా చూసుకోవాలని సూచించారు. చౌక ధరల దుకాణాల సంఖ్య పెంచాలని వస్తున్న దరఖాస్తులపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈలోగా మారుమూల ఉన్న తండాలు, గూడేలల్లో నెలలో రెండు రోజులు డీలర్లు వెళ్లి బియ్యం అందించాలని చెప్పారు. ఇన్‌చార్జి డీలర్లతో నడుస్తున్న దుకాణాలకు డీలర్ల నియామకంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. డీలర్లకు కమిషన్ పెంచే విషయంపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment