మే నుంచి ఆహార భద్రతా కార్డులు
* అక్రమాల నిరోధానికి ఈ-పాస్ యంత్రాలు: ఈటెల
* వంద గ్రాముల బియ్యం తగ్గినా ఉపేక్షించేది లేదు
* అక్రమాలుంటే నేరుగా మాకు ఫిర్యాదు చేయండి
* సంపన్నులు గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని సూచన
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల నుంచి కొత్త ఆహార భద్రతా కార్డులను లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అర్హులైన వారందరికీ కార్డులు జారీ చేస్తామని, అక్రమాల నిరోధానికి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్ రజత్‌కుమార్‌తో కలిసి ఈటల విలేకరులతో మాట్లాడారు. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలను ఉపేక్షించబోమని, డీలర్లు వంద గ్రాముల బియ్యం తుక్కువగా ఇచ్చినా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అవకతవకలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు.
అక్రమాల నిరోధానికి ఈ-పాస్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి రూ.225 కోట్లు అవసరం కానుండగా కొంతమేర సాయం చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని మంత్రి వివరించారు. దీంతో పాటు జీపీఎస్ వ్యవస్థను వినియోగించుకుని అక్రమాలకు కళ్లెం వేస్తామన్నారు. ఆధార్ సీడింగ్ ద్వారా నకిలీల ఏరివేతతో కార్డుల సంఖ్య కొంత త గ్గిందని ఈటల చెప్పారు. మూడేళ్లలోపు పిల్లలకు బియ్యం కోటా రద్దు చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వారికి యధావిధిగా బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. కందిపప్పు, చక్కెర టెండర్లలో పారదర్శకత లోపించిందంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఒప్పందాల మేరకు చక్కెర, కందిపప్పు సరఫరా చేయని వారిపై చర్యలు తీసుకున్నామని, రూ.2 కోట్ల వరకు జప్తు చేశామని చెప్పారు. పేదల కడుపు నింపే విషయంలో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని ఏమాత్రం లెక్కచేయబోమని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం నుంచి అదనంగా బియ్యం కేటాయింపులు జరుగకున్నా, పేదరిక లెక్కల సర్వేతో సంబంధం లేకుండా రూ.2,600 కోట్లతో 2.86 కోట్ల మందికి రేషన్ బియ్యం అందిస్తున్నామన్నారు. కాగా.. తాను గ్యాస్ సబ్సిడీని వదులుకున్నానని, స్థోమత కలిగిన ఉన్నత వర్గాలు సైతం సబ్సిడీని వదులుకునేందుకు ముందుకు రావాలని ఈటెల పిలుపునిచ్చారు.