గుట్టు రట్టు | secret opens | Sakshi
Sakshi News home page

గుట్టు రట్టు

Published Mon, Nov 7 2016 11:12 PM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM

గుట్టు రట్టు - Sakshi

గుట్టు రట్టు

 - 'రేషన్‌ బియ్యం’ పంపిణీలో అక్రమాలు
– క్లోజింగ్‌ బ్యాలెన్స్‌లో మాయాజాలం 
– కంప్యూటర్‌ ఆపరేటర్ల చేతివాటం 
– ఈ–పాస్‌ యంత్రాన్ని బైపాస్‌ చేసి సరుకులు స్వాహా 
– ఈ స్కామ్‌ ముద్దుపేరు 'స్కీమ్‌'
– ముగ్గురు డీలర్లు, ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, డేటా బేస్‌ అడ్మినిస్ట్రేటర్,  డీఎస్‌ఓ కార్యాలయం మాజీ ఆపరేటర్‌ అరెస్ట్‌ 
 
కర్నూలు: చౌక ధరల దుకాణాల్లో అక్రమాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈ–పాస్‌ యంత్రాలను బైపాస్‌ చేసి సరుకులను స్వాహా చేసి సొమ్ము చేసుకున్న ముఠా గుట్టు రట్టయ్యింది. డీలర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు కుమ్మక్కై ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందించాల్సిన సబ్సిడీ సరుకులను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. శ్రీశైలంలో తీగ లాగితే కర్నూలులో డొంక కదిలింది. శ్రీశైలానికి చెందిన చౌక డిపో డీలర్‌ చెరుకూరి మల్లికార్జున డీఎస్‌ఓ కార్యాలయ ఆపరేటర్‌ లావణ్య మొదటగా ఈ స్కామ్‌కు తెర తీశారు. ఈ–పాస్‌ యంత్రాల ద్వారా సరుకు బోగస్‌ లావాదేవీల గురించి డీఎస్‌ఓ తిప్పేనాయక్‌ ప్రాథమిక విచారణ జరిపి ఈనెల 3వ తేదీన శ్రీశైలం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీసీఎస్‌ డీఎస్పీ హుసేన్‌పీరా నేతృత్వంలో దర్యాప్తు చేసి అందుకు బాధ్యులైన శ్రీశైలానికి చెందిన ముగ్గురు డీలర్లు సి.హెచ్‌.మల్లికార్జున, మిద్దె నాగమల్లయ్య, ఎర్ర చిన్నమల్లికార్జున, నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ, హైదరబాదు) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అజయ్‌కుమార్‌ పాండే, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌ మువ్వ స్వప్న, డీఎస్‌ఓ కార్యాలయం మాజీ కంప్యూటర్‌ ఆపరేటర్‌(కర్నూలు అశోక్‌నగర్‌) ఎస్‌.లావణ్య తదితరులను అరెస్టు చేసి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో సీసీఎస్‌ డీఎస్పీ హుసేన్‌ పీరాతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను ఎస్పీ వెల్లడించారు.
అక్రమాలు ఇలా..
 హైదరాబాదులోని ఎన్‌ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న స్వప్న డీఎస్‌ఓ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న లావణ్య డీలర్లతో కుమ్మక్కై ఈ స్కామ్‌ వ్యవహారం నడిపించారు. శ్రీశైలానికి చెందిన చెరుకూరి మల్లికార్జున ఇందుకు ప్రధాన సూత్రధారి. కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరిలో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు, వైజాగ్‌లో 12 మంది డీలర్లు ఈ స్కీమ్‌లో చేరి అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఒక్కొక్క డీలర్‌ నుంచి రూ.10 వేల అడ్వాన్స్, నెలకు రూ.5 వేలు మామూళ్లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని 2016 ఏప్రిల్‌ నుంచి జులై దాకా 'బోగస్‌' వ్యవహారాన్ని నడిపించారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం(ఎన్‌ఐసీ)లో పనిచేస్తున్న డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌ స్వప్న ఆన్‌లైన్‌లో క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ను తగ్గించి చూపించి సరుకు పంపిణీ అయినట్లుగా డేటాను సర్దుబాటు చేసి అందుకు భారీగా మామూళ్లు దండుకుంది. సర్దుబాటు చేసిన సరుకుల్లో 50 శాతం వాటా డబ్బులు ఇచ్చే విధంగా మాట్లాడుకుని డీలర్‌ మల్లికార్జున ఆపరేటర్‌ లావణ్య ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపించారు. మొత్తం 18 దుకాణాల్లో ఈ–పాస్‌ మిషన్లు బైపాస్‌ చేసి సరుకులను పక్కదారి పట్టించినట్లు విచారణలో వెలుగు చూసింది.
 
బయటపడింది ఇలా..
 శ్రీశైలానికి  చెందిన డీలర్‌ మల్లికార్జున ఈ స్కీమ్‌లో చేరిన మిగిలిన డీలర్లతో నెలనెలా వసూలు చేసిన డబ్బులను లావణ్య అకౌంట్‌కు జమ చేశారు. అందులోనుంచి ఎన్‌ఐసీ డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌ స్వప్న సోదరుని అకౌంట్‌కు ఒకసారి రూ.3 లక్షలు, రెండవసారి రూ.3 లక్షలు నగదు రూపేణ జమ చేసినట్లు బయటపడింది. రెండు నెలల క్రితమే విషయం వెలుగులోకి రావడంతో లావణ్య ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అజయ్‌కుమార్‌ పాండే (ఉత్తరప్రదేశ్‌ వాసి)తో పరిచయం పెంచుకుని తెర వెనుక ఉండి వ్యవహారాన్ని నడిపించింది. సంవత్సరానికి అడ్వాన్స్‌గా రూ.9,60,000 పాండే బ్యాంక్‌ అకౌంట్‌కు 'ఎన్‌ఈఎఫ్‌టీ' ద్వారా నగదు పంపినట్లు పోలీసు విచారణలో బయటపడింది. లావణ్య పంపిన డీలర్ల వివరాల మేరకు ఆన్‌లైన్‌లో వారి క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ను సర్దుబాటు చేసి సరుకులను మిగిల్చి లాభం చేకూర్చారు. కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 'బోగస్‌' లావాదేవీల వ్యవహారం పెద్ద ఎత్తున జరిగినట్లు దర్యాప్తులో తేలింది. 
 
దర్యాప్తు కొనసాగుతోంది: ఎస్పీ 
ఈ–పాస్‌ యంత్రాన్ని బైపాస్‌ చేసి రేషన్‌ బియ్యాన్ని స్వాహా చేసిన ముఠా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. కార్డుదారులకు పంపిణీ చేయగా మిగిలిన సరుకుల(క్లోజింగ్‌ బ్యాలెన్స్‌)ను ఆన్‌లైన్‌లో సర్దుబాటు చేసి డీలర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు సగంసగం పంచుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ బోగస్‌ వ్యవహారం జిల్లాలో పెద్ద ఎత్తున జరిగినట్లు ప్రాథమికంగా సమాచారముంది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో రూ.20 లక్షలకు పైగా చేతులు మారాయి. ఇందుకు బాధ్యులైన ఆరుగురిపై ఐపీసీ 420, 409, ఐటీ యాక్ట్‌ 66 కింద కేసులు నమోదు చేసి కటకటాలకు పంపాం. ప్రజల సొమ్మును దోచుకుంటే ఎవరినీ వదిలేది లేదు. డీఎస్పీ స్థాయి అధికారి బోగస్‌ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం త్వరలో బయటపడుతుంది. కర్నూలు జిల్లాలో సుమారుగా మూడు వందల మందికి పైగా డీలర్లు ఈ స్కామ్‌లో చేరినట్లు ప్రాథమికంగా సమాచారముంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈ స్కీమ్‌ వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement