సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల విషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులునిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొత్త దరఖాస్తులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు విచారణ చేపట్టకపోవడంతో లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులపై కనీసం సిటిజన్ చార్టర్ కూడా అమలు కావడం లేదు. మీ సేవా ద్వారా కొత్త కార్డులు, రద్దయిన కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో మార్పులు చేర్పులు తదితరాలకు సంబంధించి ప్రతిరోజూ పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కనీసం వాటికి కాలపరిమితి కూడా లేకుండా పోయింది. వాస్తవానికి క్షేత్రస్థాయివిచారణ తప్పా.. మిగిలిన ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది.
అదే కీలకం...
ఆహార భద్రత కార్డుల మంజూరుకు క్షేత్రస్థాయి విచారణే కీలకం. కొత్త కార్డు దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ పూర్తయితేనే ప్రక్రియ ముందుకు సాగుతోంది. కొత్త కార్డు కోసం మీ సేవా, ఈ సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత పౌరసరఫరాల శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్షేత్రస్థాయి విచారణ జరిపి ఏఎస్‌ఓకు నివేదిక అందించడంతో పాటు ఆన్‌లైన్‌లో సిఫార్సు చేస్తారు. దరఖాస్తుదారుడి కుటుంబం ఆహార భద్రత కార్డుకు అర్హులైతే సంబంధిత ఇన్‌స్పెక్టర్ సిఫార్సు ఆధారంగా ఏఎస్‌ఓకు ఆ తర్వాత డీఎస్‌ఓకు సిఫార్సు చేస్తారు. డీఎస్‌ఓ పరిశీలించి ఆమోద ముద్ర వేసి కార్డు మంజూరు చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది.
ఇదీ పరిస్థితి...
గ్రేటర్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పౌరసరఫరాల విభాగం పరిధిలో సుమారు 15,97,333 కుటుంబాలకు మాత్రమే ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. మరో మూడు లక్షల కుటుంబాలకు పైగా కార్డులు లేవు. మీ సేవా అధికార లెక్కల ప్రకారం గత ఆరు నెలల వ్యవధిలో కొత్త కార్డుల కోసం సుమారు 2,65,998 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 69,016 దరఖాస్తులను ఆమోదించి కొత్త కార్డులు మంజూరు చేశారు. మరో 31,323 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 1,65,659 దరఖాస్తులపై కనీసం క్షేత్రస్థాయి విచారణ చేపట్టకుండా పెండింగ్‌లో ఉంచారు. దీంతో దరఖాస్తుదారులు సర్కిల్ ఆఫీస్‌ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment