సాక్షి సిటీబ్యూరో : ప్రజాపంపిణీ వ్యవస్ధలో అమలవుతున్న రేషన్ పోర్టబిలిటీలో భాగంగా ‘ ఒకే దేశం.. ఒకే కార్డు’ ప్రయోగం హైదరాబాద్ నగరంలో విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా ‘ఒకే దేశం–ఒకే కార్డు’ పేరుతో 2020 జూన్ నుంచి అమలు తలపెట్టనున్న‘ నేషనల్ పోర్టబిలిటీ‘ విధానాన్ని శుక్రవారం పౌరసరఫరాల అధికారులు నగరంలోని ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని పంజాగుట్ట ప్రభుత్వ చౌకధరల దుకాణం (750)లో ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులైన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వర్ రావు ( కార్డు నెం గిఅ్క 0481025 ఆ0472), విశాఖపట్నం జిల్లా, యలమంచిలికి చెందిన అప్పారావు (కార్డు నంబర్ గిఅ్క 034109700550) లబ్ధిదారులు సరుకులను డ్రా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పోర్టబిలిటీ విధానాన్ని తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను ఒక క్లస్టర్, గుజరాత్, మహారాష్ట్ర మరో క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆగస్టు ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. దీంతో పౌరసరఫరాల అధికారులు ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాదిన్నర కాలంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా...ఏ రేషన్ షా పు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానం అమలవుతుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడి జిల్లా పౌరసరఫరాల పరిధిలో లబ్ధిదారులు పోర్టబిలిటీ విధానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఆహార భద్రత పరిధిలో ఉంటేనే...
కేంద్ర ఆహార భద్రత పరిధిలో ఉన్న లబ్ధిదారులు మాత్రమే నేషనల్ పోర్టబిలిటీ విధానాన్ని వినియోగించుకోవచ్చు. వారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. లబ్ధిదారుడి ఆధార్ నంబర్ అతని రేషన్ కార్డుతో సీడింగ్ అయి ఉండాలి. ఈ విధానంలో బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో, నిర్ణయించిన ధరల ప్రకారం లబ్ధిదారులకు సరఫరా చేయబడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment