కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌కు చెందిన కత్తురోజు రమేష్‌కు ఏడాది క్రితం హుజూరాబాద్‌కు చెందిన అఖిలతో వివాహామైంది. రేషన్‌కార్డులో ఆమె పేరును అక్కడ తొలగించారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇది ఒక అఖిల పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్న బాధితులది.
సాక్షి, కరీంనగర్ : రేషన్ కార్డుల జారీ ఎటూ తేలకపోవడం కొత్త కోడళ్లకు శాపంగా మారింది. ఇంటి పేరు మారినా రేషన్ కార్డులో పేరు చేరకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వేలమంది బాధితులు నిరీక్షిస్తుండగా అధికార యంత్రాంగం సమాధానం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గత మూడేళ్లుగా అర్జీలు కుప్పలుగా పేరుకుపోతుండగా కార్డుల జారీ ప్రశ్నార్థకం మారింది. ఇక పేర్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుండగా కొత్త కార్డుల జారీలో మాత్రం ఆలస్యం జరుగుతోంది. కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని యంత్రాంగం చెబుతుండగా నిరీక్షణ ఇంకెన్నాళ్లో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: టెన్త్ విద్యార్థులకు శుభవార్త..!
అర్జీ ఇచ్చి ఏళ్లు.. మంజూరుకు ఎన్నేళ్లో..
అర్జీ ఇచ్చి ఏళ్లు గడుస్తుండగా స్పష్టమైన ప్రకటన లేదని బాధితులు వాపోతున్నారు. తనకు మూడేళ్ల క్రితం వివాహామైందని, పిల్లలు పుట్టారని అయినా కార్డు మంజూరు కాలేదని చొప్పదండికి చెందిన రాజు వివరించాడు. జిల్లాలో 497 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా 2.50లక్షల కార్డుదారులు ఉన్నారు. పెళ్లి కాగానే తమ పేరును తొలగించాలని కొందరు యువతులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వారి పేరు మీద ఉన్న యూనిట్‌ను అధికారులు తొలగిస్తున్నారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చే ఆప్షన్ లేకపోవడంతో కొందరు తొలగింపునకు ఒప్పుకోవడం లేదు. సదరు కార్డులు అలాగే కొనసాగుతుండగా పలు గ్రామాల్లో పేర్లు తొలగించాలని తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేసి తొలగిస్తున్నారు. ఈ మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా అత్తింటి కార్డులో ఒక్క పేరు చేర్చలేదని తెలుస్తోంది.
దశలవారీగా పేర్ల తొలగింపు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టకపోవడంతో వేల కార్డులు వృథాగా మిగిలిపోయాయి. ఐదేళ్ల కాలంలో వేలమంది మరణించగా ఇంకా కార్డుల్లో పేర్లు కొనసాగుతుండగా యూనిట్ల సంఖ్య అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరణించిన వారు, కొత్తగా పెళ్లయిన వారి వివరాలను నమోదు చేసి తొలగించారు. ఆడపిల్లకు పెళ్లి జరిగితే ఇతర ప్రాంతాలకు వెళ్లడం, పురుషులకు వివాహామైతే వేరు కుటుంబం ఏర్పడడం అనివార్యమే. ఈ క్రమంలో వేర్వేరుగా జాబితాలను తయారు చేసి తొలగించారు. ఇక అలాగే సంపన్నులను గుర్తించేందుకు వివిధ మార్గాల్లో అన్వేషించి తొలగించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు విక్రయించిన ధాన్యం, వచ్చిన నగదు, రైతుబంధు పథకంలో ఎక్కువ మొత్తం పెట్టుబడి సాయం వచ్చిన రైతు, వ్యాపారులకు సంబంధించి జీఎస్టీ చెల్లిస్తున్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించాయి. పట్టణాల్లో బహుళ అంతస్తుల నివాసాలు, వివిధ వ్యాపారాలు, స్థిరాస్తులు, ప్రైవేటు కంపెనీలు వంటి వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కో కార్డుకు రూ.25వసూలు
రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రేషన్‌కార్డులను పంపిణీ చేయలేదు. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొత్త కార్డులను ముద్రించగా జిల్లాల విభజనతో సదరు కార్డులను మూలన పడేశారు. దీంతో డీలర్లే కార్డులు ముద్రించి లబ్ధిదారుల పేర్లు రాసిస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.25వరకు వసూలు చేస్తున్నారు. కొత్తకార్డులు, పేర్లు చేర్పించేందుకు మీసేవ కేంద్రాల్లో వేలల్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అధికారులు విచారణ చేసి అర్హులకు అనుమతిచ్చి కమిషనరేట్ లాగిన్‌కు పంపించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడక మూడేళ్ల నుంచి ముందుకు సాగడం లేదు.
పేరు చేర్చే అవకాశం
అత్తారింటి కార్డులో పేరు చేర్చుకునే అవకాశ«ం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పెళ్లయిన వెంటనే పేరు తొలగింపునకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. గిర్దావర్ విచారణ చేసి తహసీల్దార్ లాగిన్‌కు పంపిస్తారు. పేరు తొలగించినట్లు తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం తీసుకుని డీఎస్వో కార్యాలయంలో అందజేయాలి. విచారణ చేసి పేరు చేరుస్తారు. లబ్ధిదారులు అదే జిల్లా పరిధిలోని వారై ఉండాలి. వివాహమైన యువతులు జిల్లా పరిధిలో వారైతే పేరు తొలగించినట్లు తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని, డీఎస్వో కార్యాలయంలో అందజేస్తే కమిషనరేట్ నుంచి ప్రత్యేక అనుమతి వస్తుందని అధికారులు వివరించారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చితే కొత్త జంటకు కార్డు ఏదన్నది తేల్చడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment