ration card problems
-
మాకు రేషన్ కార్డు రాక పదేళ్లయింది!
నల్లగొండ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో నూతన రేషన్ కార్డులపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలోనే రేషన్ కార్డులను ఇచ్చింది. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో ఒక్క కార్డు కూడా ముద్రించి ఇవ్వలేదు. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న కొందరికి మాత్రమే ఫుడ్ సెక్యూరిటీ కార్డులను ఇచ్చింది. ఆ తర్వాత రేషన్ కార్డుల జారీ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కొత్తవారితోపాటు పిల్లల పేర్లు కార్డులో నమోదు చేయించుకునేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్సే అధికారంలోకి రావడం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి తాజాగా మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో కొత్త దరఖాస్తుదారులతోపాటు పాతవారు కూడా ఆనందపడుతున్నారు. 4.66లక్షల కార్డులు జిల్లాలో మొత్తం 4,66,180 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో పాతవాటితోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఫుడ్‌సెక్యూరిటీ కార్డులు కూడా ఉన్నాయి. కార్డుదారులందరికీ ప్రభుత్వం ప్రతినెలా 6 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఒక్క బియ్యం తప్ప ఎలాంటి సరుకులు అందడం లేదు. అయితే జనాభా కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో కార్డుల తొలగింపునకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం వల్ల చాలా మంది అనర్హులకు కార్డులు తొలగిపోయాయి. అలాగే అనర్హులు ఉంటే కార్డును స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని కలెక్టరేట్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేయడంతో చాలామంది అప్పగించడంతో చాలావరకు కార్డులు తగ్గాయి కానీ, అర్హులైన వారందరికీ ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు ముదిరంచి ఇవ్వలేదు. పదేళ్లయినా రేషన్ కార్డు రాలే.. నాకు పదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పడు నాకు ఇద్దరు కొడుకులు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెయ్యి తొలగించారు. రేషన్ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వంటి పథకం కింద వైద్యం చేయించుకోలేక పోతున్నాను. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామన్నందుకు సంతోషంగా ఉంది. – గుండగోని రాజు, కట్టంగూర్ రెండేళ్ల క్రితం 11,950 కార్డులు జారీ.. రెండేళ్ల క్రితం హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన అవకాశం మేరకు జిల్లాలో 22వేల మంది కొత్త రేషన్‌కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్లో 22వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వివిధ కారణాలతో కొందరిని అనర్హులను తొలగించిన ప్రభుత్వం కేవలం11,950 మందికే ఫుడ్ సెక్యూరిటీ కార్డులు జారీచేసింది. అనంతరం కొత్త దరఖాస్తుల ఆహ్వానానికి ఓపెన్ చేసిన ప్రత్యేక సైట్‌ను బంద్ చేయడంతో దరఖాస్తులు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని కార్డులురాని కుటుంబాలు ప్రస్తుతం 6,450 ఉన్నాయి. జిల్లాలో ఇంకా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లక్ష కుటుంబాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
కొత్త కోడళ్లకు నో రేషన్..
కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌కు చెందిన కత్తురోజు రమేష్‌కు ఏడాది క్రితం హుజూరాబాద్‌కు చెందిన అఖిలతో వివాహామైంది. రేషన్‌కార్డులో ఆమె పేరును అక్కడ తొలగించారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇది ఒక అఖిల పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్న బాధితులది. సాక్షి, కరీంనగర్ : రేషన్ కార్డుల జారీ ఎటూ తేలకపోవడం కొత్త కోడళ్లకు శాపంగా మారింది. ఇంటి పేరు మారినా రేషన్ కార్డులో పేరు చేరకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వేలమంది బాధితులు నిరీక్షిస్తుండగా అధికార యంత్రాంగం సమాధానం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గత మూడేళ్లుగా అర్జీలు కుప్పలుగా పేరుకుపోతుండగా కార్డుల జారీ ప్రశ్నార్థకం మారింది. ఇక పేర్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుండగా కొత్త కార్డుల జారీలో మాత్రం ఆలస్యం జరుగుతోంది. కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని యంత్రాంగం చెబుతుండగా నిరీక్షణ ఇంకెన్నాళ్లో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: టెన్త్ విద్యార్థులకు శుభవార్త..! అర్జీ ఇచ్చి ఏళ్లు.. మంజూరుకు ఎన్నేళ్లో.. అర్జీ ఇచ్చి ఏళ్లు గడుస్తుండగా స్పష్టమైన ప్రకటన లేదని బాధితులు వాపోతున్నారు. తనకు మూడేళ్ల క్రితం వివాహామైందని, పిల్లలు పుట్టారని అయినా కార్డు మంజూరు కాలేదని చొప్పదండికి చెందిన రాజు వివరించాడు. జిల్లాలో 497 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా 2.50లక్షల కార్డుదారులు ఉన్నారు. పెళ్లి కాగానే తమ పేరును తొలగించాలని కొందరు యువతులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వారి పేరు మీద ఉన్న యూనిట్‌ను అధికారులు తొలగిస్తున్నారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చే ఆప్షన్ లేకపోవడంతో కొందరు తొలగింపునకు ఒప్పుకోవడం లేదు. సదరు కార్డులు అలాగే కొనసాగుతుండగా పలు గ్రామాల్లో పేర్లు తొలగించాలని తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేసి తొలగిస్తున్నారు. ఈ మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా అత్తింటి కార్డులో ఒక్క పేరు చేర్చలేదని తెలుస్తోంది. దశలవారీగా పేర్ల తొలగింపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టకపోవడంతో వేల కార్డులు వృథాగా మిగిలిపోయాయి. ఐదేళ్ల కాలంలో వేలమంది మరణించగా ఇంకా కార్డుల్లో పేర్లు కొనసాగుతుండగా యూనిట్ల సంఖ్య అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరణించిన వారు, కొత్తగా పెళ్లయిన వారి వివరాలను నమోదు చేసి తొలగించారు. ఆడపిల్లకు పెళ్లి జరిగితే ఇతర ప్రాంతాలకు వెళ్లడం, పురుషులకు వివాహామైతే వేరు కుటుంబం ఏర్పడడం అనివార్యమే. ఈ క్రమంలో వేర్వేరుగా జాబితాలను తయారు చేసి తొలగించారు. ఇక అలాగే సంపన్నులను గుర్తించేందుకు వివిధ మార్గాల్లో అన్వేషించి తొలగించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు విక్రయించిన ధాన్యం, వచ్చిన నగదు, రైతుబంధు పథకంలో ఎక్కువ మొత్తం పెట్టుబడి సాయం వచ్చిన రైతు, వ్యాపారులకు సంబంధించి జీఎస్టీ చెల్లిస్తున్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించాయి. పట్టణాల్లో బహుళ అంతస్తుల నివాసాలు, వివిధ వ్యాపారాలు, స్థిరాస్తులు, ప్రైవేటు కంపెనీలు వంటి వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కార్డుకు రూ.25వసూలు రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రేషన్‌కార్డులను పంపిణీ చేయలేదు. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొత్త కార్డులను ముద్రించగా జిల్లాల విభజనతో సదరు కార్డులను మూలన పడేశారు. దీంతో డీలర్లే కార్డులు ముద్రించి లబ్ధిదారుల పేర్లు రాసిస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.25వరకు వసూలు చేస్తున్నారు. కొత్తకార్డులు, పేర్లు చేర్పించేందుకు మీసేవ కేంద్రాల్లో వేలల్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అధికారులు విచారణ చేసి అర్హులకు అనుమతిచ్చి కమిషనరేట్ లాగిన్‌కు పంపించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడక మూడేళ్ల నుంచి ముందుకు సాగడం లేదు. పేరు చేర్చే అవకాశం అత్తారింటి కార్డులో పేరు చేర్చుకునే అవకాశ«ం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పెళ్లయిన వెంటనే పేరు తొలగింపునకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. గిర్దావర్ విచారణ చేసి తహసీల్దార్ లాగిన్‌కు పంపిస్తారు. పేరు తొలగించినట్లు తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం తీసుకుని డీఎస్వో కార్యాలయంలో అందజేయాలి. విచారణ చేసి పేరు చేరుస్తారు. లబ్ధిదారులు అదే జిల్లా పరిధిలోని వారై ఉండాలి. వివాహమైన యువతులు జిల్లా పరిధిలో వారైతే పేరు తొలగించినట్లు తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని, డీఎస్వో కార్యాలయంలో అందజేస్తే కమిషనరేట్ నుంచి ప్రత్యేక అనుమతి వస్తుందని అధికారులు వివరించారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చితే కొత్త జంటకు కార్డు ఏదన్నది తేల్చడం లేదు. -
కొలిక్కిరాని...కోటా కార్డు !
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు మర్రాపు ఎల్లమ్మ.. ఈమెది సీతానగరం గ్రామం. రేషన్ కార్డు రద్దు చేశారని వాపోతూ రెండు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతోంది. సరుకులు ఇచ్చేందుకు కార్డులో వివరాల్లేవని అంటున్న అధికారులు రైతు రుణమాఫీకి వచ్చేసరికి ఈమె విషయంలో మరో మెలిక పెట్టారు. అదేంటంటే ఈమెకు ఒక కార్డు కాదు అనేకం ఉన్నాయని(మల్టిపుల్ కార్డ్స్), అందుకే రుణమాఫీ అవదని చెబుతున్నారు. తన పేరున ఉన్నది ఒక్క రేషన్ కార్డేనని దీనిని పట్టుకుని కార్డులు వేరేగా ఉన్నాయని అంటుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయింది. తమకు రేషన్ సరుకులు రాకపోవడమే కాకుండా రుణమాఫీ కూడా జరగలేదని తెలిపారు. పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం తీరు ఇలా ఉండడంతో జనం విస్తుపోతున్నారు. సరుకులు ఇవ్వడానికి అసలు రేషన్ కార్డు లేదట! రుణమాఫీ అమలు చేయడానికి ఎక్కువ కార్డులున్నాయనీ అనడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. విజయనగరం కంటోన్మెంట్ :కాళ్లరిగిపోతున్నాయి...జ్వరమైనా...ఇంటినుంచి కదలలేని పరిస్థితి అయినా ప్రతి రోజూ కలెక్టరేట్‌ను దర్శించుకోవలసిందే...ప్రజల బాధలు చూడలేక ఏకంగా దేవుడే దిగివచ్చినా రేషన్ కార్డు దక్కని పరిస్థితి దాపురించింది. ఆధార్ అనుసంధానం చేయలేదన్న సాకుతో జిల్లాలో చాలా మంది రేషన్‌కార్డులను రద్దు చేశారు. తమ కార్డులను పునరుద్ధరించుకోడానికి ఇప్పుడు వారు నానా పాట్లు పడవలసి వస్తోంది. జిల్లాలో ఇంకా ఐదు వేల కార్డులు పునరుద్ధరణకు నోచుకోలేదు. వీరంతా గత మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిగరుతున్నారు, జిల్లావ్యాప్తంగా రద్దయిన కార్డులు చాలానే ఉన్నాయి. మెరకముడిదాం మండలం బిళ్లల వలసకు చెందిన లక్ష్మి అనే మహిళ రేషన్ కార్డు గల్లంతయింది. అయితే ఆమె తన కార్డును మళ్లీ లైవ్‌లోకి తెచ్చుకుంది. కానీ మళ్లీ రద్దు చేశారు. దీంతో ఆమె ప్రతి వారం గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి తన కార్డు పునరుద్ధరించాలని కోరుతోంది. జిల్లాలో రేషన్ కార్డులు గల్లంతైన వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చాలా మంది తమ కార్డుల పునరుద్ధరణ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రేషన్ కార్డులకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని అధికారులు గత రెండేళ్లగా పలుమార్లు ఆదేశాలు జారీ చేయడంతో పాటు గడువు కూడా విధించారు. అయితే ఆ గడువుకు కూడా ప్రజలకు ఆధార్‌కార్డులు రాకపోవడంతో రేషన్ కార్డులను అనుసంధానం చేసుకోలేకపోయారు. చివరకు రాష్ట్ర ఉన్నతాధికారులు రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జిల్లాలో దాదాపు 14వేల రేషన్ కార్డులు రద్దయిపోయాయి. వాటిని తిరిగి ఫొటోలు, ఆధార్ కార్డులు ఇస్తే అనుసంధానం చేస్తామని ప్రకటించడంతో కొన్ని కార్డులకు అనుసంధానం జరిగింది. కానీ కొన్ని కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు తొలిగిపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబంలోని ఒక్కరి వివరాలు లేకపోయినా మొత్తం కార్డులోని కుటుంబసభ్యులందరికీ రేషన్ నిలిపేశారు. దీంతో జిల్లాలో చాలా మంది ఇబ్బం దులు పడుతున్నారు. దీనిని గుర్తించిన జాయింట్ కలెక్టర్ కార్డుల వివరాలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టి గుర్తింపు కార్డులు, ఆధార్ నంబర్లు ఇచ్చిన వారికి రేషన్ కార్డులు పునరుద్ధరిస్తామని చెప్పడంతో నెలకు దాదాపు రెండు వేల వరకూ రేషన్ కార్డులు చేరుతున్నాయి. అయినా కొన్ని రేషన్ కార్డులు ఇప్పటికీ పునరుద్ధరించకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు.