ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు మర్రాపు ఎల్లమ్మ.. ఈమెది సీతానగరం గ్రామం. రేషన్ కార్డు రద్దు చేశారని వాపోతూ రెండు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతోంది. సరుకులు ఇచ్చేందుకు కార్డులో వివరాల్లేవని అంటున్న అధికారులు రైతు రుణమాఫీకి వచ్చేసరికి ఈమె విషయంలో మరో మెలిక పెట్టారు. అదేంటంటే ఈమెకు ఒక కార్డు కాదు అనేకం ఉన్నాయని(మల్టిపుల్ కార్డ్స్), అందుకే రుణమాఫీ అవదని చెబుతున్నారు. తన పేరున ఉన్నది ఒక్క రేషన్ కార్డేనని దీనిని పట్టుకుని కార్డులు వేరేగా ఉన్నాయని అంటుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయింది. తమకు రేషన్ సరుకులు రాకపోవడమే కాకుండా రుణమాఫీ కూడా జరగలేదని తెలిపారు. పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం తీరు ఇలా ఉండడంతో జనం విస్తుపోతున్నారు. సరుకులు ఇవ్వడానికి అసలు రేషన్ కార్డు లేదట! రుణమాఫీ అమలు చేయడానికి ఎక్కువ కార్డులున్నాయనీ అనడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
విజయనగరం కంటోన్మెంట్ :కాళ్లరిగిపోతున్నాయి...జ్వరమైనా...ఇంటినుంచి కదలలేని పరిస్థితి అయినా ప్రతి రోజూ కలెక్టరేట్‌ను దర్శించుకోవలసిందే...ప్రజల బాధలు చూడలేక ఏకంగా దేవుడే దిగివచ్చినా రేషన్ కార్డు దక్కని పరిస్థితి దాపురించింది. ఆధార్ అనుసంధానం చేయలేదన్న సాకుతో జిల్లాలో చాలా మంది రేషన్‌కార్డులను రద్దు చేశారు. తమ కార్డులను పునరుద్ధరించుకోడానికి ఇప్పుడు వారు నానా పాట్లు పడవలసి వస్తోంది. జిల్లాలో ఇంకా ఐదు వేల కార్డులు పునరుద్ధరణకు నోచుకోలేదు. వీరంతా గత మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిగరుతున్నారు, జిల్లావ్యాప్తంగా రద్దయిన కార్డులు చాలానే ఉన్నాయి. మెరకముడిదాం మండలం బిళ్లల వలసకు చెందిన లక్ష్మి అనే మహిళ రేషన్ కార్డు గల్లంతయింది.
అయితే ఆమె తన కార్డును మళ్లీ లైవ్‌లోకి తెచ్చుకుంది. కానీ మళ్లీ రద్దు చేశారు. దీంతో ఆమె ప్రతి వారం గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి తన కార్డు పునరుద్ధరించాలని కోరుతోంది. జిల్లాలో రేషన్ కార్డులు గల్లంతైన వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చాలా మంది తమ కార్డుల పునరుద్ధరణ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రేషన్ కార్డులకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని అధికారులు గత రెండేళ్లగా పలుమార్లు ఆదేశాలు జారీ చేయడంతో పాటు గడువు కూడా విధించారు. అయితే ఆ గడువుకు కూడా ప్రజలకు ఆధార్‌కార్డులు రాకపోవడంతో రేషన్ కార్డులను అనుసంధానం చేసుకోలేకపోయారు. చివరకు రాష్ట్ర ఉన్నతాధికారులు రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో జిల్లాలో దాదాపు 14వేల రేషన్ కార్డులు రద్దయిపోయాయి. వాటిని తిరిగి ఫొటోలు, ఆధార్ కార్డులు ఇస్తే అనుసంధానం చేస్తామని ప్రకటించడంతో కొన్ని కార్డులకు అనుసంధానం జరిగింది. కానీ కొన్ని కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు తొలిగిపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబంలోని ఒక్కరి వివరాలు లేకపోయినా మొత్తం కార్డులోని కుటుంబసభ్యులందరికీ రేషన్ నిలిపేశారు. దీంతో జిల్లాలో చాలా మంది ఇబ్బం దులు పడుతున్నారు. దీనిని గుర్తించిన జాయింట్ కలెక్టర్ కార్డుల వివరాలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టి గుర్తింపు కార్డులు, ఆధార్ నంబర్లు ఇచ్చిన వారికి రేషన్ కార్డులు పునరుద్ధరిస్తామని చెప్పడంతో నెలకు దాదాపు రెండు వేల వరకూ రేషన్ కార్డులు చేరుతున్నాయి. అయినా కొన్ని రేషన్ కార్డులు ఇప్పటికీ పునరుద్ధరించకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు.
కొలిక్కిరాని...కోటా కార్డు !
Published Sun, Apr 26 2015 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM
Advertisement
Advertisement