ఇందిరమ్మ ఇంటికి ముడిపెట్టే యోచనలో ప్రభుత్వం
అదే ఖరారైతే.. 30 లక్షల దరఖాస్తులు బుట్టదాఖలే
సాక్షి, హైదరాబాద్: సొంత జాగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రేషన్‌కార్డు కూడా ఉన్నవారినే పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. గత మార్చిలో ఈ పథకాన్ని భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కానీ, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చంది. అధికారికంగా ఇందిరమ్మ పథకాన్ని లాంచ్ చేసే సమయంలో జారీ చేసిన ఉత్తర్వులో.. సొంత జాగా ఉండాలన్న అంశాన్ని స్పష్టంగా వెల్లడించింది.
సొంత జాగా లేని నిరుపేదలకు స్థలం ఇచ్చి మరీ ఇల్లు నిర్మించి ఇస్తామని తొలుత ప్రకటించిన ప్రభుత్వం, ఈ సంవత్సరానికి మాత్రం సొంత జాగా ఉన్నవారికే కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పుడు దానితోపాటు రేషన్‌కార్డుతో కూడా ముడిపెట్టాలని భావిస్తోంది. ఈ నిబంధన వల్ల.. రేషన్‌కార్డు లేనివారిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దారిద్య్ర రేఖ(బీపీఎల్)కు దిగువ ఉన్న వారికే ఇళ్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటోంది. బీపీఎల్‌ను ధ్రువీకరించేది రేషన్‌కార్డే అయినందున, అది ఉన్నవారికే ఇళ్లు మంజూరు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించే నాటికి దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
ప్రజాపాలనలో వచి్చన దరఖాస్తులు 80 లక్షలు
గత డిసెంబరు, ఈ సంవత్సరం జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు అందిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించగా, వాటిల్లో రేషన్‌కార్డు లేనివారికి సంబంధించినవి ఏకంగా 30 లక్షలు ఉన్నట్టు తేలింది. దీంతో వాటన్నింటిని పక్కన పెట్టేశారు. ప్రస్తుతానికి మిగతా దరఖాస్తులనే పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దసరా ముందు రోజు ఇందిరమ్మ కమిటీ మార్గదర్శకాలను వెల్లడిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ఆధారంగా కమిటీ సభ్యులను నియమించింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే హైకోర్డులో వేసిన పిటిషన్ ఆధారంగా కేసు నడుస్తోంది.
ఇలాంటి గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో.. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగానే, దరఖాస్తుదారులకు సొంత జాగా ఉందా లేదో పరిశీలించటంతోపాటు రేషన్‌కార్డు వివరాలు కూడా సేకరించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా రేషన్‌కార్డు అంశాన్ని వెల్లడించనప్పటికీ, మొదటి దఫా ఇళ్ల నిర్మాణంలో రేషన్‌కార్డు తప్పనిసరి అన్నవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రేషన్‌కార్డు వివరాలను జత చేయని పక్షంలో.. లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారేనని ఎలా ధ్రువీకరించారని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment